– రాష్ట్రాభివృద్ధికి తెలంగాణ విజన్-2047 రూపొందిస్తున్నాం
– ఇక్కడ పెట్టుబడులు పెట్టండి
– పెట్టుబడిదారులకు మద్దతుగా నిలుస్తాం
– పబ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా 12వ సదస్సులో సీఎం రేవంత్
న్యూదిల్లీ, సెప్టెంబర్ 19: దేశంలో యంగెస్ట్ స్టేట్ (కొత్త రాష్ట్రం) తెలంగాణ.. అయినా తెలంగాణకు, హైదరాబాద్‌కు ఘనమైన చరిత్ర ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. దిల్లీలో శుక్రవారం జరిగిన పబ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా 12వ వార్షిక సదస్సులో ఆయన ప్రసంగించారు. పరిపాలన చేసేందుకు రాజకీయ సంకల్పం ఎంతో అవసరం అని, భవిష్యత్ తరాలకు అవకాశాలను సృష్టించాలనేది తమ ఆలోచన అని అన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తెలంగాణ విజన్ డాక్యుమెంట్-2047 రూపొందించామని, తెలంగాణను కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్‌గా విభజించామని తెలిపారు. కోర్ అర్బన్ ఏరియాలో కోటి మంది నివసిస్తున్నారని, ఇక్కడి కాలుష్యకారక పరిశ్రమలను నగరం వెలుపలికి తరలిస్తున్నామని, సెమీ అర్బన్ ఏరియాను తయారీ రంగం జోన్‌గా (మాన్యుఫాక్చర్) నిర్ణయించామని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధికి తగినట్లు 70 కి.మీ ఉన్న మెట్రోను 150 కి.మీకు పొడిగించాలని నిర్ణయించామన్నారు. సబర్మతీ తీరంలా మూసీని తీర్చిదిద్దుతామని, అందుకు మూసీ పునరుజ్జీవంపై దృష్టి సారించామని చెప్పారు. హౖాెదరాబాద్‌లో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం చేపడుతున్నామని, 2027 నాటికి హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ వాహనాలే ఎక్కువగా ఉండనున్నాయని, అందుకే ఈవీలకు రాయితీలు ప్రకటించామని వివరించారు. రాష్ట్ర అవసరాలకు తగినట్లు రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం ఉంటుందని, భవిష్యత్ అవసరాలకు తగినట్లు భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామని, విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీకి అనుసంధానత కల్పిస్తామని తెలిపారు. తెలంగాణలో సేంద్రియ పంటలు పండుతున్నాయని, పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్నామని, పెట్టుబడిదారులకు మద్దతుగా నిలుస్తామని సీఎం రేవంత్ మాట ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ సమస్య ఉండగా డ్రగ్స్ నిర్మూలనలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లుగా మారండని పిలుపునిచ్చారు. జ్ఞానంతోపాటు నైపుణ్యం అవసరమని, యువతలో నైపుణ్యాలు పెంచేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని, మహాత్మా గాంధీ యంగ్ ఇండియా స్ఫూర్తిని అనుసరిస్తున్నామని తెలిపారు. స్పోర్ట్స్‌లో దక్షిణ కొరియా వంటి చిన్న దేశాలకు వచ్చే మెడల్స్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుందని, ఒలింపిక్స్ పతకాల సాధనే లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. తెలంగాణకు భూపరివేష్టిత రాష్ట్రం (ల్యాండ్ లక్డ్) కావడంతో ఓడ రేవు లేదని, అందుకే మచిలీపట్నం ఓడ రేవు అనుసంధానానికి ఫ్యూచర్ సిటీ నుంచి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే.. దానికి సమాంతరంగా రైల్వే లైన్ మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరామన్నారు. బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో 40 శాతం తెలంగాణనే చేస్తోందని, వ్యాక్సిన్ల తయారీలో హైదరాబద్ ముందు వరుసలో ఉందని వెల్లడిరచారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో అమెరికాకే ఎక్కువగా నష్టం వాటిల్లుతుందని, ఒకరోజు మోదీ నా ఫ్రెండ్ అంటాడు.. మరో రోజు అడ్డగోలుగా సుంకాలు వేస్తారు.. అని వ్యాఖ్యానించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





