– ఉరేసుకున్నట్లుగా రాడ్‌కు మృతదేహం
– హత్య చేశారని కుటుంబీకుల ఆరోపణ
– అనుమానాస్పద మృతిగా పోలీసుల దర్యాప్తు
సూర్యాపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10 : సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రత్నావత్ మణి భార్గవ్ అనే యువకుడి మృతిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం అటుగా వెళ్తున్న ప్రయాణికులు ఆటోలో ఒక వ్యక్తి ఉరి వేసుకుని ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సూర్యాపేట పోలీసులు వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల ప్రకారం.. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఎంజీనగర్ తండా శివారులో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఆటోలో ఓ యువకుడు విగతజీవిగా కనిపించాడు. మృతుడిని రత్నావత్ మణి భార్గవ్‌గా గుర్తించారు. మృతుడు ఆటోలో ఉన్న ఇనుప రాడ్డుకు వేలాడుతూ కనిపించాడు. ఈ ఘటనపై ప్రస్తుతం సోషల్ మీడియా, స్థానికుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇది ఆత్మహత్యా లేక ఎవరైనా చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా? అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మణి భార్గవ్‌కు ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా? లేదా కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనా స్థలంలో వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించడానికి క్లూస్ టీమ్‌ను పోలీసులు రంగంలోకి దించినట్లు సమాచారం. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. మణి భార్గవ్ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు, అతను చివరిగా ఎవరితో మాట్లాడారు?, ఎవరితోనైనా ఛాటింగ్ చేశారా అనే కోణంలో కాల్ డేటా రికార్డులను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. మణిభార్గవ్ మరణ వార్త విన్న అతని తండా, కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తమ కొడుకుది ఆత్మహత్య కాదని, దీని వెనుక కుట్ర ఉందని వారు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


