– కేంద్ర మంత్రి నిర్మలమ్మకు భట్టి, తుమ్మల వినతి
న్యూదిల్లీ, సెప్టెంబర్ 4: తెలంగాణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రోగ్రామ్, దాని అనుబంధ పెట్టుబడులకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందజేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. అలాగే ఎఫ్‌ఆర్‌బీఎం నిధుల విషయంలో మినహాయింపు కోరారు. యంగ్ ఇండియా స్కూల్స్ ప్రోగ్రామ్ గురించి కేంద్ర మంత్రికి వివరించారు. ఈ ప్రోగ్రాంను పరిశీలించి మద్దతు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. తెలంగాణ జనాభాలో ఎక్కువమంది సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన సమూహాలకు చెందినవారున్నారు. 56.33 శాతం మంది వెనుకబడిన తరగతుల నుంచి, 17.43 శాతం మంది షెడ్యూల్డ్ కులాల నుంచి, 10.45 శాతంమంది ఎస్టీల నుంచి ఉన్నారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో తెలంగాణ ఒకటైనప్పటికీ విద్యా, పోషకాహార రంగాలలో ఫలితాలు తక్కువగా ఉన్నాయని. ఈ అసమానతలు తరతరాలుగా పేదరికాన్ని రూపుమాపనివ్వడంలేదని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. చాలా ఏళ్లుగా ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం పెద్ద సంఖ్యలో రెసిడెన్షియల్ పాఠశాలలను మంజూరు చేశాయి కానీ ఈ సంస్థలు చాలా వరకు అద్దె ప్రాంగణాల్లో లేదా చిన్న భవనాల్లో నడస్తున్నాయని తెలిపారు. సమగ్ర మౌలిక సదుపాయాలు, విద్యా వనరులు లేకుండా పనిచేస్తున్నాయని తెలిపారు.
ఈ అంతరాలను పరిష్కరించడానికే తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ విధానాన్ని రూపొందించిందన్నారు. ఒక్కో స్కూల్‌లో 5నుంచి12 తరగతుల వరకు దాదాపు 2,560 మంది విద్యార్థులకు సేవలందించనున్నట్లు, ఈ పాఠశాలలు 2.7 లక్షల మంది విద్యార్థులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తాయని వివరించారు. అదే సమయంలో దాదాపు 5,250 పొరుగు ప్రభుత్వ పాఠశాలలకు మద్దతు ఇచ్చే కేంద్రాలుగా పనిచేస్తాయన్నారు. తద్వారా దాదాపు 4 లక్షల మంది విద్యార్థులకు పరోక్ష ప్రయోజనాలను అందిస్తాయని భట్టి వివరించారు. ఈ సమగ్ర విద్యా విధానం కోసం అంచనా వేసిన ఆర్థిక వ్యయం రూ.30వేల కోట్లు. ఇందులో 105 క్యాంపస్‌ల నిర్మాణానికి రూ.21వేల కోట్లు, విద్యా రంగంలో అనుబంధ పెట్టుబడులకు రూ.9,000 కోట్లు అంచనా వేశామన్నారు. ఈ అనుబంధ పెట్టుబడులలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, సాంకేతిక, వృత్తి విద్యా సంస్థలను బలోపేతం చేయడం, తెలంగాణ విద్యా వ్యవస్థను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి డిజిటల్ మౌలిక సదుపాయాలు వంటి అంశాలు ఉన్నాయని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.
7. ఈ వనరులను సమీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం, అనుబంధ పెట్టుబడుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రయోజన కార్పొరేషన్ ద్వారా రుణాలు సేకరించాలని ప్రతిపాదిస్తోంది. ఈ రుణాలను రాష్ట్ర ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితుల నుంచి మినహాయించాలని భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కూడా అందించాలని కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





