– నల్గొండను విద్యా హబ్‌గా తీర్చిదిద్దుతాం
– ఇక్కడి ఇంటిగ్రేటెడ్ స్కూలు రాష్ట్రంలోనే మొదటిది కావాలి
– రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి కోమటిరెడ్డి
నల్గొండ, ప్రజాతంత్ర, ఆగస్టు 4: అన్ని వర్గాలకు ఉత్తమమైన చదువునందించాలన్న లక్ష్యంతో నల్గొండ జిల్లా కేంద్రంలో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల రాష్ట్రంలోనే మొదటిది కావాలని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకాంక్షించారు. జిల్లాను విద్యా హబ్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు. తొమ్మిది నెలల్లో ఈ పాఠశాల నిర్మాణాన్ని పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. గంధంవారిగూడెంలో రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులకు మంత్రి సోమవారం భూమి పూజ చేశారు. జిల్లాలోని విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి చేపట్టిన బృహత్తర పథకం యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల అని, రాష్ట్రవ్యాప్తంగా రూ.20వేల కోట్లతో ఇలాంటి పాఠశాలలను డిజైన్ చేసి నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాల పక్కనే మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ ఉన్నాయని, నల్గొండలో అన్ని హంగులతో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఉందని, జిల్లాను విద్యా హబ్‌గా మార్చే క్రమంలో యూనివర్సిటీలో ఇటీవలే ఎం ఫార్మసీ, ఎల్‌ఎల్‌బి కోర్సులు మంజూరు చేయించామని వివరించారు. భవిష్యత్తులో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తామన్నారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, విద్యార్థులు చదువుపైనే దృష్టి సారించాలని, మధ్యలో బడి మానివేయవద్దని ఉద్బోధించారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారని, వారందరినీ ఇలాంటి ఉత్తమమైన పాఠశాలల్లో చదివించి వారికి ఇక్కడే ఉద్యోగావకాశాలు కల్పించేలా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని, విద్య, ఉపాధిలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. ప్రస్తుతం నల్గొండలో బాలికలకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల మంజూరు కాగా బాలురకు కూడా ఇలాంటి పాఠశాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో కూడా త్వరలోనే యంగ్ ఇండియా పాఠశాల కోసం భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ నల్గొండ యంగ్ ఇండియా పాఠశాలలో మంచి ఫ్యాకల్టీతో పాటు, అన్ని వెసులుబాట్లు ఉంటాయని తెలిపారు. నాగార్జునసాగర్ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలకు మంచి స్థలాన్ని గుర్తించామన్నారు. టీజీఈడబ్ల్యు ఎంఐడీసీి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాలప్రసాద్ నల్గొండ పాఠశాల గురించి వివరించారు. అదనపు కలెక్టర్లు జె.శ్రీనివాస్ నారాయణ అమిత్, నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డి, విద్యాశాఖ అధికారి భిక్షపతి, టీజీఈడబ్ల్యు ఐడీసీడీఈ శైలజ, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.





