– ఎమ్మెల్యే దానంకు క్లీన్ చిట్‌పై బీజేపీ ఆగ్రహం
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 21:తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల అంశం మరోసారి న్యాయస్థానానికి చేరింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇటీవల ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నాగేందర్ పార్టీ మారలేదని స్పీకర్ ఇచ్చిన క్లీన్ చిట్ రాజ్యాంగ విరుద్ధమని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. గత సాధారణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ తరపున ఖైరతాబాద్ నుంచి గెలుపొందిన దానం నాగేందర్ ఆ తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే కాక సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. బీఆర్‌ఎస్ బీ-ఫామ్ ద్వారా గెలిచి మరో పార్టీలోకి వెళ్లినందున ఆయనపై అనర్హత వేటు వేయాలని మహేశ్వర్ రెడ్డి గతంలోనే స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరిపిన స్పీకర్.. దానం నాగేందర్ అసలు పార్టీ మారలేదని, ఆయనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే బహిరంగంగానే పార్టీ మారిన వ్యక్తికి స్పీకర్ ఇలాంటి తీర్పు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఏలేటి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌లో అసెంబ్లీ స్పీకర్‌ను , దానం నాగేందర్‌ను ప్రతివాదులుగా చేర్చారు. ఈ కీలక పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం సోమవారం విచారణ జరపనుంది. స్పీకర్ నిర్ణయంపై కోర్టు ఏ రకమైన స్పందన తెలియజేస్తుందోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.