– మళ్లీ పెరిగిన వరదలు
– పలు రాష్ట్రాల్లో వరదలతో అతలాకుతలం
– దిల్లీని ముంచెత్తిన యుమున వరదలు
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్02: ఉత్తరాది రాష్ట్రాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాగులు, వంకలు, నదులు ప్రమాదకర స్థాయిలో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. యమున ఉధృతితో దిల్లీ నగరం నీట మునిగింది. ఇప్పటికే ఇళ్లలోకి నీరు చేరుతోంది. దిల్లీ వద్ద యమున నది నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. నదీ ప్రవాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌ల్లో కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతిచెందారు. రాష్ట్రంలో పలుచోట్ల ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సిమ్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి తండ్రీ, కుమార్తె సహా ఐదుగురు మరణించారు. ఉత్తరాఖండ్‌లోని సోన్‌ప్రయాగ్ గౌరీకుండ్ మధ్య ఉన్న కేదార్‌నాథ్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతిచెందారు. ఆరుగురు గాయపడ్డారు. దీంతో ఈ నెల 3 వరకు కేదార్‌నాథ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఉత్తరకాశీ జిల్లాలోని కమ్లా నదితో పాటు, దేహ్రాదూన్‌లోని శాలినీ నది, తెహ్రీ జిల్లాలోని అగ్లర్ నది, రుదప్రయాగ్‌లోని అలకనందా, మందాకిని నదులు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. పంజాబ్, హరియాణా, చండీగఢ్‌ల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. లూథియానాలో అత్యధికంగా 216.70 మిల్లీటర్ల వర్షపాతం నమోదైంది. పఠాన్‌కోట్, గుర్‌దాస్‌పుర్, ఫాజిల్కా, కపూర్థలా, తరన్‌తరన్, ఫిరోజ్‌పుర్, హోశియార్‌పుర్, అమృత్‌సర్ జిల్లాల్లోని పలు గ్రామాలు నీట మునిగాయి. ఈ ఆరు జిల్లాల్లో మంగళవారం వరకూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీచేసింది. పంజాబ్‌లో వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దయ్యాయి. రాష్ట్రంలోని 793 రోడ్లను మూసి వేశారు. ఈ నెల 3వరకు అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని పంజాబ్ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. రాజస్థాన్ రాజధాని జైపుర్‌తో సహా పలు ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. రాష్ట్రంలో పిడుగుపాటుకు ఇద్దరు మృతిచెందారు. ఒకరు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయారు. జమ్మూ, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్‌లలో వరదల్లో చిక్కుకొన్న 5 వేల మందిని, 300 మంది పారామిలటరీ దళాల సిబ్బందిని రక్షించామని సైన్యం తెలిపింది. పంజాబ్‌లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర గవర్నర్ గులాబ్ చంద్ కటారియాతో పాటు ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్‌లో మాట్లాడారు. మరోవైపు జమ్మూకశ్మీర్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అధికారులతో సక్షించారు. వరదల్లో నష్టపోయిన పంజాబ్, జమ్మూకశ్మీర్‌లను కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
ప్రమాద సూచికను దాటిన యమున
భారీ వర్షాలు, వరదల కారణంగా యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. హరియాణాలోని మయునానగర్‌లోని హత్నికుండ్ బ్యారేజీ వద్ద నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతుండడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో దిల్లీలోని యమునా నది ప్రమాద సూచికను దాటి ప్రవహిస్తోంది. ఇళ్లల్లోకి వరద నీరు చేరుతుండటంతో యమునా తీర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలకు వరద హెచ్చరికను జారీ చేశారు. మంగళవారం తెల్లవారుజామున యమునా నది 205.33 మీటర్ల డేంజర్ మార్క్ దాటడంతో దేశ రాజధానిలో భారీ వరదలు పోటెత్తే అవకాశం ఉందని దిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు వెంటనే ఖాలీ చేసి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలకు చేరుకోవాలని సూచించింది. సోమవారం హరియాణాలోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి మూడు లక్షలకు పైగా క్యూసెక్కులు విడుదల చేయడంతో నీటిమట్టం పెరిగినట్లు తెలుస్తోంది. హత్నికుండ్ నుంచి విడుదలయ్యే నీటివల్ల సాధారణంగా 36 నుంచి 48 గంటల్లో నగరం మొత్తం వరదల్లో చిక్కుకుపోయే ప్రమాదం ఉందని.. పరిస్థితులను పర్యవేక్షించడానికి దిల్లీ యంత్రాంగం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేఖా గుప్త పేర్కొన్నారు. మరోవైపు మంగళవారం సాయంత్రంలోగా యమునా నది 206 టర్ల ఎత్తుకు చేరుకోవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో పలు కార్యాలయాలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాలని సూచించాయి. పలు పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నాయి. దిల్లీ రోడ్లు జలమయమయ్యాయి. దిల్లీ-జైపుర్ హైవేపై 7-8 కిలోటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. 3 గంటలకు పైగా ప్రయాణికులు ట్రాఫిక్‌లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ప్రతిపక్షాలు దిల్లీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.