హైదరాబాద్, జూన్ 10 : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మంగళవారం ప్రజా భవన్‌లో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ Yadadri Thermal Power Station (YTPS) ప్రాజెక్ట్ పురోగతిని సమీక్షించారు. జూన్ 9న బిహెచ్ఇఎల్ సిఎండి, టిజిజెన్కో సిఎండి, బిహెచ్ఈఎల్ డైరెక్టర్లు వైటీపీఎస్ ప్రాజెక్ట్ ను పరిశీలించారు. ప్రాజెక్ట్ పనుల పురోగతిని గౌరవ ఉప ముఖ్యమంత్రికి తెలియజేశారు. యూనిట్ -1, యూనిట్ -2 పనులు విజయవంతంగా పూర్తయ్యాయని, మిగతా మూడు యూనిట్ల పనులు తుది దశలో ఉన్నాయని అధికారులు తెలిపారు. యాదాద్రికి సంబంధించిన అన్ని యూనిట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా ప్రారంభం అవుతాయని అధికారులు తెలిపారు.
వైటీపీఎస్ మొత్తం అంచనా వ్యయం రూ.36,131.99 కోట్లు. ఇది పూర్తిగా దేశీయంగానే ఉత్పత్తి అయ్యే కోల్‌ను (సింగరేణి కాలరీస్ ద్వారా) వాడుతుంది. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నారు. హై ఎఫిషియెన్సీ ఎలెక్ట్రో స్టాటిక్ ప్రీసిపిటేటర్లు (సీఎస్పీ ), ఫ్లూ గ్యాస్ డి-సల్ఫరైజేషన్ (ఎఫ్జీడీ) యూనిట్లు, సెలెక్టివ్ కాటలిటిక్ రియాక్టర్లు, జీరో లిక్విడ్ డిస్చార్జ్ వ్యవస్థ, టీజీ జెన్ కో రైల్వే వాహనాల ద్వారా డ్రై ఫ్లై ఏష్ రవాణా పనులను చేపట్టనున్నారు. ఇది కాలుష్యాన్ని తగ్గించడమే కాక, రోడ్డు రవాణా భారం తగ్గించడంలో కూడా ఉపయుక్తంగా ఉంటుంది.
వైటీపీఎస్ పూర్తయిన తర్వాత టీజీ జెన్కో విద్యుత్ సామర్థ్యం 7980 మెగావాట్లకు పెరుగుతుంది. టీజీ జెన్ కో సీఎస్ఆర్ కార్యక్రమం కింద పలు అభివృద్ధి చర్యలను చేపడుతోంది. ఈ కార్యక్రమాల కోసం రూ.100.40 కోట్లు కేటాయించారు. ఇందులో ఇప్పటికే రూ.30 కోట్లు మంజూరు అయ్యాయి. తాల్ల వీరప్ప గూడెం, దామరచర్ల గ్రామాలను దాటి వెళ్లే కొత్త రహదారి నిర్మాణం ఆర్ అండ్ బి శాఖ ద్వారా చేపట్టబడింది. ఇది ప్లాంట్ నుండి డ్రై ఫ్లై ఏష్ రవాణాలో గ్రామస్థులకు ఇబ్బంది లేకుండా చేయడం కోసం రూపొందించబడింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్ష, పరోక్షంగా ప్రజలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందు, ప్లాంట్‌లో పనిచేసే ఉద్యోగుల కోసం 2158 నివాస క్వార్టర్లు నిర్మాణంలో ఉన్నాయి. టీజీ జెన్ కో 315 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు, కెమిస్టులను నియమించింది. అలాగే 112 మంది ప్రాజెక్ట్ వల్ల నిర్వాసితులుగా మారిన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చింది.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు బిహెచ్ఈఎల్, జెన్ కోస సీఎండీలను త్వరితగతిన పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రతి వారానికి ప్రణాళిక రూపొందించి, పనుల పురోగతిని వేగవంతం చేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం “తెలంగాణ క్లీన్ & గ్రీన్ ఎనర్జీ పాలసీ, 2025” ను 2025 జనవరి 11న విడుదల చేసింది. ఈ పాలసీ ద్వారా పునరుత్పాదక ఇంధనం మరియు స్థిరమైన వ్యాపార ప్రక్రియలలో తెలంగాణను ప్రముఖ స్థానంలో నిలిపే లక్ష్యం ఉంది. 2030 నాటికి 20,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం, నిల్వ సామర్థ్యాన్ని సాధించే లక్ష్యంతో ఈ పాలసీ రూపొందించబడింది. ఈ సమీక్ష సమావేశంలో ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్ కో సీఎండీ డి. కృష్ణ భాస్కర్, జెన్ కో డాక్టర్ ఎస్. హరీష్, బిహెచ్ ఈఎల్ సీఎండీ కొప్పు సదాశివ మూర్తి తదితరులు పాల్గొన్నారు.




