– యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు
యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, జులై 24: డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పనులు త్వరగా పూర్తిచేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మినీ మీటింగ్ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో పెండిరగ్‌లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మౌలిక వసతులు కల్పనను, ఇతర పెండిరగ్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇళ్ల పనులపై పంచాయతీరాజ్ ఈఈ, ఆర్‌బి ఈఈ, డిఈ, ఏఈలతో కలెక్టర్ సమీక్షించారు. డబుల్ బెడ్ రూమ్‌లో పైప్ లైన్లు, కరెంటు, డ్రైనేజీ, వంటి చిన్నచిన్న మౌలిక వసతులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రతి ఇంటికీ విద్యుత్తు, నీటి సరఫరా కనెక్షన్లు ఇవ్వాలని, డ్రైనేజీ సంబంధిత పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఎరువుల కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
ఎరువుల కొరత సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. బీబీనగర్ మండల కేంద్రంలో ఉన్న ఎరువుల దుకాణాలను ఆయన గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏవోతో కలిసి ఎరువుల దుకాణాలను తనిఖీ చేశామన్నారు. షాప్ లైసెన్స్, ఫర్టిలైజర్స్ లైసెన్స్ ఉన్నాయా లేవా అని పరిశీలించారు. రైతులు ఏ మందులు కొనుగోలు చేస్తున్నారు, రైతులు అడిగినవే ఇస్తున్నారా, మీరు ఏమైనా డిమాండ్ చేసి ఇస్తున్నారా అని ఆరా తీశారు. రైతులకు సరిపోయే యూరియా ఉందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి సిబ్బంది హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు. రోజు ఓపీకి ఎంతమంది వస్తున్నారు అని వైద్యుడిని ప్రశ్నించారు. హాస్పిటల్‌లో ప్రతి నెలా ఎన్ని ప్రసవాలు జరుగుతున్నాయి అని వివరాలడిగి ప్రసవాల సంఖ్య పెరగాలన్నారు. ప్రస్తుతం ప్రసవానికి ఉన్న గర్భిణితో ఫోన్‌లో మాట్లాడి ప్రతి నెలా పరీక్షలకు వస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. స్కానింగ్ ఇక్కడే చేస్తున్నారా లేక బయటకు పంపిస్తున్నారా అని అడిగారు. డెలివరీలు ప్రభుత్వ హాస్పిటల్‌లో చేయించుకోవాలని, ఇక్కడ మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అసంపూర్తి పనులతో నిలిచిపోయిన నూతన భవనాన్ని పరిశీలించి మిగిలిన పనులను త్వరగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. త్వరలో నూతన హాస్పిటల్ భవనం ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, వైద్యులు, ఆసుపత్రి, సిబ్బంది పాల్గొన్నారు.





