యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు
యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, జులై 15: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు. రాజాపేట మండలం బూరుగుపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను ఆయన మంగళవారం పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. గోపాల్ అనే లబ్ధిదారు ఇంటి స్లాబ్ దశ పనులు పరిశీలించి త్వరగా నిర్మాణం పూర్తిచేసి గృహప్రవేశం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. మండలంలో పురోగతిలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను వేగవంతంగా పూర్తి అయ్యేలా చూడాలని ఎంపీడీవోను ఆదేశించారు. హౌసింగ్ ఏఈలు బేస్మెంట్ లెవెల్, పిల్లర్ లెవెల్, స్లాబ్ లెవల్ పూర్తి అయిన వెంటనే ఫొటోలు తీసి అప్‌లోడ్ చేయాలన్నారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయంలో భూభారతి, రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను, రెవెన్యూ అధికారులు ఆన్‌లైన్ చేసే ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. మండల కేంద్రంలో ఉన్న ఎస్సీ రెసిడెన్షియల్ హాస్టల్‌ని తనిఖీ చేసి వంటశాలను పరిశీలించారు. అపరిశుభ్రంగా ఉన్న వంటశాలను రోజూ శుభ్రం చేసుకోవాలన్నారు. విద్యార్థులకు భోజనం మెనూ ప్రకారం ఉందా లేదా అని పరిశీలించారు. కూరగాయలు సరిగా లేవని, వెంటనే కాంట్రాక్టర్‌కు చెప్పి మంచివి అందజేసేలా చూసుకోవాలని వంట మాస్టర్‌కు, కమిటీ సభ్యులకు చెప్పారు. విద్యార్థులతో మాట్లాడుతూ అందరూ కష్టపడి ఇష్టంతో చదువుకోవాలన్నారు. ఈ సంవత్సరం 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన 200 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.
మాతృ మరణాలు జరగకుండా చూడాలి
జిల్లాలో మాతృ మరణాలు జరగకుండా గర్బిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారికి తగు సూచనలు, సలహాలు, చికిత్స అందించాలని కలెక్టర్ హనుమంత రావు వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాతృ మరణాలపై మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో అయన మాట్లాడారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మనోహర్, స్త్రీ వైద్య నిపుణులు (గైనకాలజిస్టులు) నిర్మల, కవిత, పిల్లల వైద్య నిపుణులు కరణ్‌రెడ్డి, మోహన్, మత్తు వైద్య నిపుణులు రెహమాన్, డిప్యూటీ వైద్య శాఖ అధికారి యశోద, డాక్టర్ శిల్పిని, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి రామకృష్ణారావుల్ణ పాల్గొన్నారు.



