ప్రముఖ కథా రచయిత ముక్తవరం కన్నుమూత

కాళోజీ జంక్షన్ /హనుమకొండ,  ప్రజాతంత్ర, మార్చి 4 : తెలుగు సాహిత్యంలో ప్రముఖ కథా, నవలా రచయిత, అనువాదకుడు ముక్తవరం పార్థసారథి (82) హైదరాబాద్‌లో బుధ‌వారం కన్నుమూశారు. పార్థసారథి పూర్వ నల్గొండ జిల్లా భువనగిరిలో 1944 జూలై 7న జన్మించారు. పాఠశాల విద్యను భువనగిరిలోనే పూర్తి చేశారు. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. ప్రభుత్వ ఆంగ్ల అధ్యాపకులుగా పనిచేసే పదవి విరమణ చేశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ నల్లగుండ్ల సిటిజన్ ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్నారు. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో కూడా బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ క్ర‌మంలో పార్థసారథి బుధవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో గుండెపోటుకు గురై కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆంగ్ల అధ్యాపకులుగా పనిచేసిన ముక్తవరం పార్థసారథి రంగుల వల, నువ్వు నేను చిన్నారావు, పరువు, కౌగిలి, కలల నీడలు, దమయంతి, మలివెలుగు, శూన్యం, మనసులోని చలి, కించిద్విషాదం, మినుగుర్లు కథలు సృజనాత్మక రచనలు చేశారు. వివిధ ప్రపంచ దేశాల సాహిత్యాన్ని కూడా తెలుగులోకి అనువాదం చేసిన గొప్ప రచయిత ముక్తవరం. తొమ్మిది దేశాల కథలు, ఉక్కుపాదం (నవల) అపరాజిత, నరహంతకుని స్వగతం, చైనా జానపద కథలు, ఆలోచన ఆయుధంగా, దుష్ట రాజ్యం, సీగల్, నరహంతలు ధరాధిపతులై, పోలీసులు (నాటకం), నోబెల్ బహుమతి గ్రహీతల కథానికలు తదితర అనువాదాలను తెలుగులోకి తీసుకువచ్చారు. పార్థసారథి మరణం పట్ల విప్లవ రచయితల సంఘం ఉమ్మడి జిల్లా కమిటీ కన్వీనర్ కోడం కుమారస్వామి సంతాపం ప్రకటించారు. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన కృషిని నవతరం రచయుతలు స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *