గ్రామీణాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి

– పంచాయతీలకు నిధులపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హర్షం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, ఇందులో భాగంగా 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు 2025-26 సంవత్సరం మొదటి విడతలో భాగంగా తెలంగాణ గ్రామ పంచాయతీల కోసం రూ.619.85 కోట్లు విడుదల చేసిందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఇందుకుగాను ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌కి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ‘సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస’ మంత్రాన్ని అక్షరాలా ఆచరణలో పెడుతూ ప్రతి గ్రామ సమగ్రాభివృద్ధికి బాటలు వేస్తోందని ఆయ‌న తెలిపారు. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం గ్రామీణ స్థానిక సంస్థలకు కేటాయించిన నిధుల విషయంలో ఆర్థిక సంఘం రూపొందించిన కార్యాచరణ మార్గదర్శకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు నిధులు అందిన వెంటనే ఆయా రాష్ట్రాల ఆర్థిక శాఖలు పది పని దినాలలోపు సంబంధిత గ్రామ పంచాయతీలన్నింటికీ ఆయా నిధులను బదిలీ చేయాల్సి ఉంటుందన్నారు. అంతకుమించి ఆలస్యం జరిగితే రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర పథకాల కోసం తీసుకున్న మార్కెట్ రుణాలు/రాష్ట్ర అభివృద్ధి రుణాలపై చెల్లిస్తున్న వడ్డీ రేటు ప్రకారం గ్రామ పంచాయతీలకు వడ్డీతో కలిపి ఈ నిధులను విడుదల చేయాల్సి ఉంటుందని కిషన్‌రెడ్డి  స్పష్టం చేశారు. అలాగే కేంద్రం విడుదల చేసిన నిధులకు సమానంగా మ్యాచింగ్ గ్రాంట్లు విడుదల చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *