ల‌క్ష్య‌సాధ‌న‌కు క్ర‌మ‌శిక్ష‌ణ‌తో శ్ర‌మించాలి

– ఎంచుకున్న రంగంలో ఉత్త‌మంగా రాణించాలి
– సైబ‌ర్ ఉచ్చులో ప‌డ‌కుండా విద్యార్థులు జాగ్ర‌త్త వ‌హించాలి
– త‌ల్లిదండ్రులే నిజమైన హీరోలు
– మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి

వనపర్తి, ప్రజాతంత్ర మార్చి 31:  విద్యార్థులు పాఠశాల దశ నుంచే లక్ష్యాలను ఏర్పరచుకొని క్రమశిక్షణతో వాటిని సాధించే దిశగా శ్రమించాలని పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. ఆత్మకూరు పట్టణంలోని ఎం.వి.రామన్ సీబీఎస్‌ఈ పాఠశాలలో మంగళవారం నిర్వహించిన విజ్ఞాన వైభవం–2026 కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీహరి తో పాటు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ సునీత రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 51 స్టాల్స్ లో విద్యార్థులు ప్రదర్శించిన 741 శాస్త్రీయ ప్రదర్శనలు, వినూత్న ఆవిష్కరణలను అతిథులు పరిశీలించి అభినందించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని మంత్రి పేర్కొన్నారు.  ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ  కష్టపడే తత్వం ఉంటే ఇలాగైనా అనుకున్నది సాధించవచ్చు అని విద్యార్థులకు తెలియజేశారు. జ్ఞానం సంపాదించాలన్న సంకల్పం ఉన్నవారికి అది సిద్ధిస్తుందని, ఆ మార్గంలోనే అందరూ ముందుకు వెళ్లాలని సూచించారు. మనల్ని కన్న తల్లిదండ్రులే మనకు నిజమైన హీరోలని, వారిని ఎల్లప్పుడూ గౌరవించాలని సూచించారు. తల్లిదండ్రులను గురువులను గౌరవించిన వారికి జీవితంలో ఉన్నత స్థానాలు దక్కుతాయని తెలియజేశారు. చదువుతోపాటు విద్యార్థులకు క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యమని మంత్రి పేర్కొన్నారు. ఇక పాఠశాల యాజమాన్యాన్ని ఉద్దేశిస్తూ  ఆత్మకూరు పట్టణంలో ఎంతోమందికి విద్య‌ను అందిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు.జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాలను పెట్టుకొని క్రమశిక్షణతో చదివి జీవితంలో ముందుకు వెళ్లాలని సూచించారు. జీవితంలో ఏ రంగాన్ని ఎంచుకున్నా అందులో అత్యుత్తమంగా రాణించాల‌న్నారు.  పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు.
జిల్లా ఎస్పీ డి.సునీత రెడ్డి విద్యార్థులకు ముఖ్య సూచనలు చేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవడంతోపాటు మంచి నడవడిక కొనసాగించాలన్నారు. చదువును కష్టపడి కాక ఇష్టపడి చదవాలని సూచించారు. అప్పుడే విజయం సాధించగలమని విద్యార్థులకు తెలియజేశారు. ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాను జాగ్రత్తగా వినియోగించాలని ఎస్పీ పేర్కొన్నారు. పిల్లలు సైబర్ ఉచ్చులో పడకుండా తల్లిదండ్రులు చూడాలని సూచించారు.ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ ఎం శ్రీధర్ గౌడ్, ప్రిన్సిపల్ అన్సీ శ్రీధర్ గౌడ్ చేతుల మీదుగా ముఖ్య అతిథులు మంత్రి వాకిటి శ్రీహరి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీత రెడ్డిలను సన్మానించి వారికి మొమెంటోను అందజేశారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల నృత్య ప్రదర్శనలు సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆత్మకూరులో గ్రామీణ ప్రజలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలని ఉద్దేశంతో 37 ఏళ్ల క్రితం పాఠశాలలను స్థాపించి విద్యను అందిస్తున్నట్లు చైర్మన్ ఎం.శ్రీధర్ గౌడ్ తెలియజేశారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నాగమణి, వైస్ చైర్మ‌న్‌ శ్రీనివాస్, డీఈవో అబ్దుల్ ఘని, తహసిల్దార్, ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *