ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలి

– శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి
– నిధులను ప్రణాళిక బద్ధంగా వినియోగించాలి
– ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి సూచ‌న‌

సూర్యాపేట, ప్రజాతంత్ర,మార్చి 12 : ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నూతన సర్పంచులు, మునిసిపల్ చైర్‌పర్సన్‌లు, వార్డు కౌన్సిలర్‌లు తదితర ప్రజా ప్రతినిధులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని ఎస్పీ నరసింహ, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్‌తో కలిసి మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించి అర్హులైన లబ్ధిదారులకు అందేలా చూడాలన్నారు. ప్రజలకు మంచి చేయాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందని, ప్రతి రోజు కొంత సమయం కేటాయిస్తే గ్రామస్థాయిలో స్పష్టమైన మార్పు కనిపిస్తుందని తెలిపారు. గ్రామాలకు గతంలో నిధులు రాలేదనే అపోహలు ఉన్నాయని, గత నెలన్నర కాలంలో పెద్ద ఎత్తున నిధులు విడుదలయ్యాయని మంత్రి పేర్కొన్నారు. 31 లోపు మరిన్ని నిధులు విడుదల అవుతాయని తెలిపారు. ఈ నిధులను ప్రణాళికాబద్ధంగా వినియోగించుకుని ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు నాణ్యతతో చేపట్టడం అత్యంత ముఖ్యమని మంత్రి అన్నారు. గ్రామాల్లో నిర్మాణ పనులపై అధికారులు, ప్రజా ప్రతినిధులు పర్యవేక్షణ పెంచాలని సూచించారు. వేసవిలో తాగునీటి సమస్య ఎక్కడా లేకుండా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కీలకమని తెలిపారు. కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు శిక్షణ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజాప్రతినిధులకు గుర్తింపు కార్డులు, కార్యక్రమానికి సంబంధించిన మెటీరియల్ అందజేసినట్లు తెలిపారు. 10 ప్రధాన థీమ్స్‌పై 99 రోజులపాటు నిర్వహించే కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని అన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతూ నూతన సర్పంచులు, పట్టణ ప్రాంత ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతి ప్రజాప్రతినిధి తమ గ్రామం, వార్డు అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేసి ఆదర్శంగా నిలవాలని సూచించారు. కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, జెడ్పీ సీఈఓ శిరీష, డీపీఓ యాదగిరి, సీపీఓ కిషన్, డివైఎస్ఓ వెంకట్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *