– కొత్తగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్లతో మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా కలెక్టర్లు పనిచేయాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఇటీవల జిల్లా కలెక్టర్లుగా బాధ్యతలు చేపట్టిన జోగులాంబ గద్వాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ తదితర జిల్లా కలెక్టర్లు మంగళవారం మంత్రి పొంగులేటిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలన్నారు. గత రెండేళ్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని, వీటిని ప్రతి పేదవాడికి చేర్చవలసిన బాధ్యత కలెక్టర్లదేనని అన్నారు. సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపై ఎంతో ఉందన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలతోపాటు ప్రజల అవసరాలను అర్థం చేసుకొని పనిచేయాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఐఏఎస్ అధికారుల కెరీర్లో జిల్లా కలెక్టర్లుగా పనిచేయటమే అత్యంత కీలకమైన అవకాశమని అన్నారు. ప్రజలతో మమేకం కావాలని, ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలుండే బాధ్యతలతోపాటు క్షేత్ర స్థాయిలో అన్ని అంశాలపై అవగాహన వస్తుందని, జిల్లాల్లో పనిచేసిన అనుభవమే భవిష్యత్తులో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రజాపాలనలో ప్రజాకేంద్రంగా పాలన సాగాలని, ప్రజలకు మేలు చేసే పనులనే జిల్లా పాలకులుగా చేపట్టాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను అమలు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించాల్సిన బృహత్తర బాధ్యత కలెక్టర్లదేనని, ఒక టీమ్‌లాగా అధికార యంత్రాంగం పనిచేయాలని మంత్రి పొంగులేటి అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



