పేదల కోసం నిజాయతీగా పనిచేస్తున్నాం

– రాబోయే మూడేళ్లలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
– మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హామీ

కూసుమంచి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా ఎన్నికలపుడు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, పేదలకు అండగా నిలవడం తమ ప్రభుత్వ ధ్యేయమని, రాబోయే మూడేళ్లల్లో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. పాలేరు నియోజకవర్గ పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.8 లక్షల 15 వేల కోట్ల అప్పు చేసి పేదలపై భారాలు మోపిందని విమర్శించారు. ప్రస్తుత ఇందిరమ్మ ప్రభుత్వం పేదల కోసం నిజాయతీగా పనిచేస్తోందని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం అని గుర్తు చేశారు. ఇల్లు అవసరమైన ప్రతి అర్హుడి కల నెరవేర్చే వరకు ప్రభుత్వం వెనుకడుగు వేయదని మంత్రి పొంగులేటి భరోసా ఇచ్చారు. కాగా, నాయకన్‌గూడెంలో రూ.20 లక్షలతో నిర్మించిన పంచాయతీ కార్యాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. నర్సింహులగూడెంలో రూ.1.33 కోట్లతో కిష్టాపురం-నర్సింహులగూడెం పీఆర్‌ రోడ్డుకు, కిష్టాపురంలో రూ.1.61 కోట్లతో కిష్టాపురం-పోచారం పీఆర్‌ రోడ్డుకు, రూ.2.40 కోట్లతో కిష్టాపురం-ముత్యాలగూడెం పీఆర్‌ రోడ్డుకు శంకుస్థాపనలు చేశారు. జుజ్జులరావుపేటలో రూ.88 లక్షలతో జుజ్జులరావుపేట ఆర్‌ అండ్‌బి రోడ్డును మల్లాయిగూడెం పీఆర్‌ రోడ్డుతో కలిపే బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. కూసుమంచి జూనియర్‌ కళాశాల నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించి వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశించారు. కూసుమంచి తహసిల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శాండ్‌ బజార్‌ను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు టన్ను గోదావరి ఇసుకను రూ.1100కు, ఇతర అవసరాలకు టన్ను రూ.1300కు అందుబాటులో ఉంచాం అని మంత్రి తెలిపారు. అనంతరం కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేలకొండపల్లి మండలానికి చెందిన 42, ఖమ్మం రూరల్‌ మండలానికి చెందిన 82 మొత్తం 124మందికి కాటమయ్య రక్షక కిట్లు పంపిణీ చేశారు. కూసుమంచి మండలానికి చెందిన 18మందికి కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన 20 మంది క్రైస్తవ మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *