స్వేచ్ఛగా పనిచేయండి

నిబద్ధతతో పనిచేసి ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందండి..
పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క
శాఖల వారీగా పనుల పురోగతి, నూతన ప్రణాళికలపై సమీక్ష

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 16 : అధికారులు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగ‌కుండా స్వేచ్ఛ‌గా, నిర్భ‌యంగా ప‌నిచేయాల‌ని  పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. అధికారులంతా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల‌న్నారు. గురువారం ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ కార్యాలయంలో అన్ని విభాగాల శాఖధిపతులతో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, డైరెక్టర్ సృజన, టీజీఐఆర్డి డైరెక్టర్ నిఖిల, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ, ఈఎన్‌సీలు కృపాకర్ రెడ్డి, కనకరత్నం, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి సీత‌క్క మాట్లాడుతూ.. శాఖకు వన్నె తెచ్చేలా పనిచేయాల‌న్నారు.శాఖపరంగా వాస్తవాలనే నివేదించాల‌ని, త‌మ‌ మెప్పుకోసం వాస్తవాలను దాచిపెట్టొద్ద‌న్నారు. అధికారులు, అమాత్యులు వేరు కాద‌ని, మీరు పొరపాట్లు చేసి మమ్మల్ని ఇబ్బందుల పాలు చేయొద్దని హితువు ప‌లికారు. ఎవరూ తప్పులు చేయొద్దు, జైలు పాలు కావద్దని సున్నితంగా హెచ్చ‌రించారు. మీ కింది ఉద్యోగులతో సంప్రదింపులు జ‌రుపుతూ వారి సమస్యలను పరిష్కరించాల‌ని సూచించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పెండింగ్ బిల్లుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైంద‌ని, రూ. 300 కోట్ల ఎన్ఆర్ఈజీఏ బిల్లులను బుధ‌వారం విడుదల చేశామ‌ని, మల్టీ పర్పస్ వర్కర్ల వేతన బకాయిలను విడుదల చేశామ‌న్నారు. పంచాయతీరాజ్ శాఖ తరహాలోనే ప్రతి విభాగంలో ఉద్యోగ సమస్యలను ఆన్ లైన్  లో పరిష్కరించే విధానాన్ని అవలంబించాల‌ని ఆదేశించారు.

అర్హులైన ప్రతి గర్భిణిలు, బాలింతలు, చిన్నారుల‌కు పోషకాహారం అందాల‌ని సూచించారు. అంగన్వాడీ సేవలపై చిన్నారుల పేరెంట్స్ ఫీడ్ బ్యాక్ తీసుకుంటామ‌ని, ప్రతి నెలలో ఒకసారి ఫోన్ ఇన్ విత్ పేరెంట్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. తల్లిదండ్రుల అభిప్రాయాల మేరకు అంగన్వాడీ సిబ్బందిపై చర్యలు ఉంటాయన్నారు. అంగన్వాడీకి వొచ్చే గర్భిణులు కింద కూర్చోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. వారి ఇబ్బందులను తొలగించేందుకు  కేంద్రాల్లో బెంచీలను ఏర్పాటు చేయాల‌ని, దివ్యాంగుల పరికరాల కోసం తెలంగాణ చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా 50 కోట్లు ఖర్చు చేస్తున్నామ‌ని మంత్రి సీత‌క్క తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో స్పెష‌ల్‌ డ్రైవ్‌లు నిర్వహించి దివ్యాంగులకు పరికరాలను అందజేస్తామ‌న్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో చివరి త్రైమాసికంలో ఉన్నామ‌ని, బ‌డ్జెట్‌ పూర్తిస్థాయిలో వినియోగించుకునే విధంగా పనులు పూర్తి చేయాల‌ని మంత్రి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *