– ఆ గుర్తు వుంటదనే రేవంత్ ఎంపీటీసీ ఎన్నికలు జరపడంలేదు
– ఇక్కడి మైనార్టీ గురుకులం నుంచి 19మంది డాక్టర్లు
– సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులు నిలిచిపోయాయి
– కాంగ్రెస్ ఆయా.. బిజిలీ గయా
– మాజీ మంత్రి హరీష్‌రావు
జహీరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 24: నూతన సర్పంచుల గెలుపు కోసం కృషి చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు మంత్రి హరీశ్ రావు అభినందనలు తెలిపారు. జహీరాబాద్‌లో బుధవారం నిర్వహించిన సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. పోలీసు బలగాన్ని, అధికారాన్ని ఉపయోగించినా జహీరాబాద్ లో 52 సర్పంచులు గెలవడం గొప్ప విషయమన్నారు. కారు గుర్తు లేకుంటేనే ఇన్ని గెలిచాం, రేపు కారు గుర్తుంటే ఎన్ని గెలుస్తమో ఆలోచించండని అన్నారు. కారు గుర్తు అంటే కేసీఆర్ గుర్తుకు వస్తరు.. అందుకే రేవంత్ రెడ్డి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టడం లేదన్నారు. బీఆర్ఎస్ ను మొలకెత్తనీయ అన్నడు రేవంత్ రెడ్డి.. నాలుగువేల మంది సర్పంచులు మొలకెత్తిండు. ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ బీఆర్ఎస్. రూ.4వేల పింఛన్ రాలేదు, మహిళలకు రూ.2500 రాలేదు.. తులం బంగారం రాలేదు.. కేసీఆర్ కిట్టు పోయింది, న్యూట్రీషన్ కిట్టు పోయింది, చేపల పంపిణీ, గొర్రెల పంపిణీ బంద్ అయ్యింది.
జహీరాబాద్ లో కేసీఆర్ కట్టించిన మైనార్టీ గురుకులం నుంచి 19 మంది డాక్టర్లు అయ్యారు. ఆటో డ్రైవర్ బిడ్డ, రైతు బిడ్డ, పేదింటి బిడ్డ ఈరోజు డాక్టర్ చదువుతున్నరని గుర్తుచేశారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో ఎంతో మంది డాక్టర్లు అయ్యారు, ఉన్నత హోదాలో ఉన్నారన్నారు. రేవంత్ ప్రభుత్వం వచ్చాక గురుకుల పిల్లలు కల్తీ ఆహారంతో ఆసుపత్రి పాలవుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి సంగమేశ్వర బంద్ పెట్టిండు. మేము మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేసినం, 2,3 వందల చెక్ డ్యాంలు కట్టించినం. భూగర్భ జలాలు పెంచినం. నీటి వసతి పెంచినం. కాళేశ్వరం నీళ్లు జహీరాబాద్ కు తేవాలని సంగమేశ్వర, బసవేశ్వర ప్రారంభించుకున్నం. ప్రభుత్వం వచ్చాక రెండు ప్రాజెక్టులు ఆగిపోయాయి. జిల్లా మంత్రి ఎందుకు రేవంత్ ను ప్రశ్నించడం లేదు? ప్రభుత్వం మెడలు వంచుతం, ప్రాజెక్టు పనులు ముందుకు పోయేలా చేస్తామన్నారు. జహీరాబాద్ కు 50 పడకల మాతా శిశు ఆసుపత్రి సాంక్షన్ చేసిన, రెండేళ్లలో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. కరెంట్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయానికి కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తే రేవంత్ రెడ్డి 12 గంటలే ఇస్తున్నడని ఆరోపించారు.
కాంగ్రెస్ ఆయా, బిజిలీ గయా
రెండేళ్లలో మన ప్రభుత్వం రాబోతున్నది. జహీరాబాద్ మున్సిపాలిటీకి బిఆర్ఎస్ ప్రభుత్వం 50 కోట్లు కేటాయించింది. రైల్వే బ్రిడ్జి కట్టింది బీఆర్ఎస్, బసవేశ్వర విగ్రహం ఏర్పాటు చేసింది బిఆర్ఎస్ రేవంత్ రెడ్డి వచ్చి రిబ్బన్ కట్ చేసి పోతడట అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఒక్క రూపాయి కూడా జహీరాబాద్ కు ఇవ్వలేదు, పైగా కేసీఆర్ ఇచ్చిన రూ.50 కోట్లు పట్టుకుపోయిండు. రేవంత్ రెడ్డి ఫుట్ ఆడటంలో బిజీ ఉన్నడు, తెలంగాణ ప్రజలను నిన్ను ఫుట్ బాల్ ఆడుతరు రేవంత్ రెడ్డి. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి పైసలు ఉండవు, కానీ వంద కోట్లు పెట్టి ఫుట్ బాల్ ఆడుతడు. గురుకుల పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టు అంటే పైసలు లేవు అంటడు. జహీరాబాద్ లో మున్సిపల్ ఎన్నికలకు అందరం తయారు కావాలంటూ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





