– కోటిమందిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కార్యక్రమాలు
– ప్రతీ మహిళ మహిళా సంఘాల్లో చేరాలి
– ఎరువుల సరఫరా బాధ్యత మహిళా సంఘాలకే
– పోషణ మాసం, బతుకమ్మ వేడుకల్లో మంత్రులు ప్రభాకర్, సీతక్క
కరీంనగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24: తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎం కాలనీలోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ మహిళా, శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం)లో బ్యూటీషియన్, టైలరింగ్, జ్యూట్ బ్యాగ్ తయారీ, ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ పూర్తి చేసిన మహిళలకు బుధవారం మంత్రుల చేతులమీదుగా సర్టిఫికెట్ల ప్రదానం జరిగింది. అలాగే పోషణ మాస ఉత్సవం, బతుకమ్మ ఉత్సవాలకు కూడా మంత్రి సీతక్క రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ
స్వయం సహాయక సంఘాల మహిళలు ఇప్పటికే ఏడువేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారరన్నారు. రానున్న సీజన్‌లో ఎరువుల సరఫరా మహిళా సంఘాల ద్వారానే చేస్తామని, ఈ కార్యక్రమం కూడా విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళా ప్రాంగణంలో విజయవంతంగా ఆటో డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న 15 మంది మహిళలకు డ్రైవింగ్ లైసెన్సు ఫీజు భరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. హైదరాబాదులో మహిళలకు ఐదువేల ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకురానన్నామన్నారు. ప్రతీ మహిళ స్వయం సహాయక సంఘంలో చేరాలని సూచించారు. స్వయం సహాయక సంఘాలను బస్సులు, పెట్రోల్ బంకులకు యజమానులుగా చేయడం వంటి అనేక కార్యక్రమాలు విజయవంతంగా నడుస్తున్నాయన్నారు. ఆర్టీసీలో మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేశామని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 47 బస్సులు మహిళా సంఘాల ద్వారా అద్దెకు నడుస్తున్నాయని తెలిపారు. మహిళా ప్రాంగణానికి పూర్వ వైభవం తీసుకొచ్చామంటూ ఈ ప్రాంగణాన్ని మొక్కలు నాటి అందంగా తీర్చిదిద్దాలని సూచించారు. మహిళా ప్రాంగణ స్థలంలో స్వయం సహాయక సంఘాల ద్వారా పెట్రోల్ బంకు ఏర్పాటుకు పరిశీలించాలని అధికారులను మంత్రి పొన్నం ఆదేశించారు.
బతుకమ్మ పండుగ మరో వెయ్యేళ్లు వర్థిల్లాలి : సీతక్క
బతుకమ్మ పండుగ వందల ఏళ్ల నాటి ఆచారం, సంప్రదాయమని, ఈ పండగ మరో వెయ్యేండ్లు వర్థిల్లాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆకాంక్షించారు. మహిళలంతా ఐక్యంగా, సంతోషంగా ఉండాలన్నారు. మహిళలకు ఆర్థికంగా, రాజకీయంగా తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తుందని, ఎప్పుడూ తోడుగా ఉంటుందని తెలిపారు. కోటిమందిని కోటీశ్వరులను చేయాలన్న ముఖ్యమంత్రి సంకల్పం దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు. ట్రాన్స్‌జెండర్లకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని, వారూ సమాజంలో భాగమేనని, వారిని గౌరవించాలని సూచించారు. ఇప్పటికే హైదరాబాదులో 40మంది ట్రాన్స్‌జెండర్లకు ట్రాఫిక్‌లో ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆచార సంప్రదాయానికి ప్రతీక అని అన్నారు. గ్రామీణ, పట్టణాల్లో బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. హైదరాబాదులో టూరిజం అభివృద్ధి ఘనంగా చేస్తామని తెలిపారు. అనంతరం మంత్రులు, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద, ఉమెన్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ‘సుడా’ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి బతుకమ్మ సంబరాల్లో పాలుపంచుకున్నారు. మహిళలతో బతుకమ్మ ఆడి పాడారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డిఆర్‌ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్ బాబు పాల్గొన్నారు. అంగన్వాడి టీచర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, మెప్మా, డిఆర్‌డిఏ సభ్యులు, మహిళా పోలీసులు, అధికారులు ఉద్యోగులు సిబ్బంది కూడా ఈ ఉత్సవాల్లో పాలు పంచుకున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





