మహిళ జన్ సున్వాయ్ ద్వారా సమస్యల పరిష్కారం

– దేశవ్యాప్తంగా 500 జిల్లాల్లో విచారణకు నిర్ణయం
– పరిష్కార లక్ష్యం 15 వేల నుండి 20 వేల కేసులు
– జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయ రహత్కర్

మేడ్చల్, ప్రజాతంత్ర, మార్చి 12 : మహిళ జన్ సున్వాయ్ ద్వారా మహిళల సమస్యలను పరిష్కరించడానికి జాతీయ మహిళా కమిషన్ మీ చెంతకే వచ్చిందని కమిషన్ చైర్‌పర్సన్ విజయ రహత్కర్ అన్నారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన మహిళా జన్ సున్వాయ్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా రహత్కర్ మాట్లాడుతూ జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్ల్యు) ద్వారా జరుగుతున్న ఈ మహిళా జన్ సున్వాయ్(ప్రజా విచారణ) కార్యక్రమానికి మల్కాజిగిరి, హైదరాబాద్ యంత్రాంగం అంతా ముందుకు వచ్చి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. జాతీయ మహిళా కమిషన్, స్థానిక యంత్రాంగం కలిసి పనిచేస్తే మహిళల సమస్యలకు కచ్చితంగా త్వరగా న్యాయం జరుగుతుందన్నారు. దేశం నలుమూలల నుండి తమకు ఎన్నో ఫిర్యాదులు అందుతుంటాయని, కానీ చాలామంది మహిళలు దిల్లీ వరకు రాలేరని, అందుకే తామే వారి వద్దకు వెళ్లాలని నిర్ణయించుకుని ‘జాతీయ మహిళా కమిషన్ మీ చెంతకు’ అనే ఈ కార్యక్రమం ప్రారంభించి ఇప్పటివరకు దాదాపు 100 జన సున్వాయ్ కార్యక్రమాలను పూర్తిచేశామని చెప్పారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒకేసారి దేశవ్యాప్తంగా సుమారు 500 జిల్లాల్లో ఈ విచారణలు నిర్వహించాలని నిర్ణయించుకుని దీని ద్వారా సుమారు 15 నుండి 20 వేల కేసులను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ రోజు ఇక్కడ కూడా చాలామంది మహిళలకు న్యాయం జరుగుతుందని, వారు సంతోషంగా ఇంటికి వెళ్తారని ఆశిస్తున్నానని రహత్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో 30 కేసుల హియరింగ్ జరిగిందని, అతి త్వరగా పరిశీలించి పరిష్కరిస్తామని, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో డీజీపీ బి.శివధర్ రెడ్డి, అడిషనల్ డీజీపీ చారుసిన్హా, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి, మల్కాజిగిరి సీపీ అవినాష్ మహంతి, ఫ్యూచర్ సిటి కమిషనర్ సుధీర్‌బాబు, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, మల్కాజిగిరి ఆర్డీవో శ్యాంప్రకాష్, మల్కాజిగిరి తహసిల్దార్ సీతారాం, డీడబ్ల్యూవో శారద, డీఆర్‌డీవో సాంబశివరావు, డీఎంఅండ్ హెచ్‌వో ఉమాగౌరి, జిల్లా మైనారిటి అధికారి కాంతమ్మ, జిల్లా హౌసింగ్ అధికారి రమణమూర్తి, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *