– ప్రధాన ఆకర్షణ కానున్న ఇందిరా మహిళా శక్తి స్టాల్
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 6 : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో మహిళా సాధికారతకు ప్రతీకగా ఇందిరా మహిళా శక్తి స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మహిళల ఆర్థిక, సామాజిక అభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు ఈ స్టాల్ అద్దం పట్టనున్నది. మహిళా స్వయం సహాయక సంఘాల శక్తి, సాధికారత, వ్యాపార నైపుణ్యాలను జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధుల ముందు సమగ్రంగా ప్రదర్శించే వేదికగా ఇందిరా మహిళా శక్తి స్టాల్ నిలుస్తుంది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్ధ (సెర్ప్), తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న ఈ స్టాల్‌లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం చేపట్టిన అనేక వినూత్న కార్యక్రమాల నమూనాలు ప్రదర్శిస్తారు. మహిళలే నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి పెట్రోలు బంకు, హైటెక్ సిటీలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి బజార్, జిల్లాల వ్యాప్తంగా నిర్మితమైన ఇందిరా మహిళా శక్తి భవనాలు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, అలాగే ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణ వంటి విభిన్న వ్యాపారాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలు సాధించిన విజయాలకు సంబంధించిన చిత్రాలు ఈ స్టాల్‌లో ఆకట్టుకునేలా ప్రదర్శించనున్నారు. గ్రామీణ స్థాయి నుంచి గ్లోబల్ వేదిక వరకు మహిళల ప్రయాణాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన డాక్యుమెంటరీల ప్రదర్శన కోసం ప్రత్యేక స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. మహిళా స్వయం సహాయక బృందాలు ఎలా వ్యాపారవేత్తలుగా ఎదిగాయి, ప్రభుత్వ ప్రోత్సాహంతో స్వయం ఉపాధి ఎలా సుస్థిర ఆదాయ మార్గాలుగా మారింది అనే అంశాలు ఈ డాక్యుమెంటరీల ద్వారా సందర్శకులు తెలుసుకోగలగుతారు. అలాగే మహిళా-శిశు సంక్షేమం కోసం ఇటీవల ప్రభుత్వం ప్రారంభించిన నూతన కార్యక్రమాల వివరాలను కూడా స్టాల్‌లో సమగ్రంగా ప్రదర్శిస్తారు. వేల కోట్ల రూపాయల బ్యాంకింగ్ లింకేజ్ రుణాల ద్వారా మహిళా సంఘాలకు ఆర్థిక బలాన్ని అందించడం, వందల కోట్ల రూపాయల వడ్డీ చెల్లింపులతో మహిళలపై రుణ భారాన్ని తగ్గించడం, మహిళా సభ్యులకు రూ.10 లక్షల లోన్ బీమా, రూ.2 లక్షల ప్రమాద బీమా వంటి భద్రతా చర్యలు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా పాలనలో, మంత్రి సీతక్క మార్గదర్శనంలో మహిళల పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇప్పటికే 20కు పైగా విభిన్న వ్యాపార రంగాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తూ, మహిళలను యజమానులుగా, నాయకులుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకెళుతోంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి స్టాల్, మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి అన్న ప్రజా ప్రభుత్వ సంకల్పానికి ప్రతీకగా నిలిచి దేశం ప్రపంచం దృష్టిని ఆకర్ష్షించనుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



