– 6,261 భవనాలకు అనుమతులు
– 5,017కు అంచనాలు సిద్ధం
– సర్వేపల్లిలో తొలి భవనం ప్రారంభం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: రాష్ట్రంలో గ్రామీణ మహిళల సాధికారతకు బలమైన మౌలిక వసతులు కల్పించే దిశగా మహిళా సంఘాల (వీవో) భవనాల నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఈ కార్యక్రమం గ్రామాలన్నింటిలో యజ్ఞంలా అమలవుతూ మరో మైలురాయిగా నిలుస్తోంది. ప్రతి గ్రామ పంచాయతీలో మహిళా భవనాల నిర్మాణానికి కనీసం 200 గజాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలన్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలతో 12,728 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటికే 8,193 స్థలాలను గుర్తించారు. అందులో 6,261 భవనాలకు కలెక్టర్ల నుంచి అనుమతులు లభించగా 5,017 భవనాల నిర్మాణాలకు అంచనాలు సిద్ధం అయ్యాయి. ప్రస్తుతం జిల్లాల వారీగా పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క నిత్య పర్యవేక్షణలో, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ దివ్యా దేవరాజన్ ప్రత్యేక చొరవతో సెర్ప్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మధ్య సమన్వయానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయడం వల్ల స్థలాల గుర్తింపు నుంచి అనుమతులు, అంచనాలు, నిర్మాణం వరకు అన్ని దశల్లో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ములుగు జిల్లాలో పలు గ్రామాల్లో మంత్రి సీతక్క మహిళా భవనాలకు శంకుస్థాపనలు చేశారు. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆత్మకూరు మండలం సర్వేపల్లి గ్రామంలో వీవో భవనం ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లాలో కేశంపేట మండలం ఆల్వాల్ గ్రామ పంచాయతీలో కూడా భవనం పూర్తయింది. ఈ మహిళా భవనాలు గ్రామీణ మహిళలకు ఆత్మగౌరవానికి, ఆర్థిక స్వావలంబనకు, పరస్పర ఐక్యతకు ప్రతీకలుగా నిలవనున్నాయి. మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి, ఆదాయ వనరుల పెంపు కార్యకలాపాలకు కేంద్రాలుగా మారనున్నాయి. అవసరమైతే మహిళలు తయారు చేసే ఉత్పత్తుల విక్రయ కేంద్రాలుగా కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
ఆర్థిక, సామాజిక బలోపేతానికి కేంద్రాలుగా.. : మంత్రి సీతక్క
ప్రతి గ్రామంలో మహిళలకు బలమైన వేదిక కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. మహిళా సంఘాల భవనాలు వారి ఆర్థిక, సామాజిక బలోపేతానికి కేంద్రాలుగా మారతాయి. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను విస్తరించుకోవడానికి, ఒకచోట చేరి నిర్ణయాలు తీసుకునే వేదికగా ఇవి ఉపయోగపడతాయి. నిర్దిష్ట కాలంలో భవనాల నిర్మాణాన్ని పూర్తి చేసి మహిళలకు అందుబాటులోకి తీసుకురావాలి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





