– గ్రామీణ మహిళలు ఉద్యోగ సృష్టికర్తలు కావాలి
– షీ స్పార్క్స్-2026 సదస్సులో మంత్రి సీతక్క
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 14: సమాజంలో మార్పు తీసుకురావడంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. బుల్లెట్ నుంచి బ్యాలెట్ వరకు సాగిన తన జీవిత ప్రయాణం ప్రజాస్వామ్య శక్తిని ప్రతిబింబిస్తుందన్నారు. ఒకప్పుడు న్యాయస్థానంలో నిందితురాలిగా నిలిచిన తాను కాలక్రమంలో అదే కోర్టులో న్యాయవాదిగా వాదనలు వినిపించిన సందర్భం తన జీవితంలో కీలక మలుపుగా నిలిచిందని గుర్తు చేశారు. రాజ్యాంగం కల్పించిన అవకాశాల వల్లే ఈ మార్పు సాధ్యమైందని, ప్రజాస్వామ్య మార్గంలో సాధించే మార్పే శాశ్వతమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఓ జాతీయ మీడియా సంస్థ ఆధ్వర్యంలో దిల్లీ ఐఐటీలో శనివారం జరిగిన ‘షీ స్పార్క్స్-2026’ కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. తన జీవితం, మంత్రిగా తీసుకున్న కీలక నిర్ణయాలపై నిర్వాహకులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. వివిధ రంగాల్లోని మహిళా నాయకులను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన నిర్వాహకులను ఆమె అభినందించారు. వ్యాపారవేత్తలు, పరిశోధకులు, ఐటీ నిపుణులు, రచయితలు, కళాకారులు, పరిపాలనాధికారులు వంటి అనేక రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న మహిళలు ఈ సమావేశంలో పాల్గొనడం ప్రేరణనిచ్చే విషయమన్నారు. ఇలాంటి వేదికలు మహిళల నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తాయన్నారు. తాను ములుగు జిల్లా జగ్గన్నపేట గ్రామానికి చెందిన ఆదివాసీ కుటుంబంలో జన్మించి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ప్రజాసేవలోకి వచ్చానని చెప్పారు. ఒకప్పుడు అన్యాయం, దోపిడీకి వ్యతిరేకంగా నక్సలైట్ ఉద్యమంలో పనిచేసిన తాను ఆ తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసం పెరిగి ప్రధాన స్రవంతిలోకి వచ్చానన్నారు. విద్య ద్వారా జీవితాన్ని మార్చుకోవచ్చని నమ్మి న్యాయ విద్యనభ్యసించి న్యాయవాదిగా పనిచేశానని, అనంతరం ప్రజల సేవ కోసం ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు. సెర్ప్ ద్వారా రాష్ట్రంలో 46 లక్షలకుపైగా మహిళలు స్వయం సహాయక సంఘా(ఎస్‌హెచ్‌జీ)లుగా ఏర్పడి సామాజిక-ఆర్థిక మార్పునకు దోహదపడుతున్నారని చెప్పారు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీలు, చిన్న మధ్యతరహా వ్యాపారాలకు రుణాలు, మార్కెట్ అవకాశాలు కల్పిస్తూ మహిళలను ఉద్యోగార్ధులుగా కాక ఉద్యోగ సృష్టికర్తలుగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. ఇందిరా మహిళా శక్తి విధానం ద్వారా మహిళలకు పెద్దస్థాయిలో వ్యాపార అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి బజార్ ద్వారా గ్రామీణ మహిళలు తమ ఉత్పత్తులను నగర మార్కెట్‌కు నేరుగా విక్రయించుకునే అవకాశాన్ని కల్పించామన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలు బలపడతాయని, సమాజం అభివృద్ధి చెందుతుందని మంత్రి సీతక్క తెలిపారు. దేశ అభివృద్ధిలో మహిళలు భాగస్వాములు మాత్రమే కాక మార్పునకు నాయకత్వం వహించే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల నుంచి వచ్చే మహిళలకు అవకాశాలు కల్పించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన ఆదివాసీ అమ్మాయి మంత్రి కాగలిగిందని, సంకల్పం, విద్య, ప్రజాస్వామ్యం ఏ జీవితాన్నైనా మార్చగలదని పేర్కొన్నారు. కార్యక్రమం నిర్వహించిన అవర్ స్టోరీ సంస్థ స్థాపకురాలు శ్రద్ధా శర్మ, నిర్వాహకులను మంత్రి సీతక్క అభినందించారు. మహిళలు అభివృద్ధిలో భాగస్వాములు మాత్రమే కాక మార్పునకు నాయకులుగా నిలిచే భవిష్యత్తును కలిసి నిర్మిద్దామని పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





