– మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు స్వర్ణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28: బీజేపీకి చెందిన 44 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు అత్యాచార, లైంగిక వేధింపుల కేసుల్లో ఉన్నారని, బీజేపీ పాలిత ప్రాంతాల్లో మహిళలకు రక్షణ కరవైందని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆరోపించారు. పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అన్నారు. రాజకీయ రక్షణ కింద ఆయా నేతలకు బీజేపీ రక్షణ కల్పిస్తోందని స్వర్ణ ఆరోపించారు. మహిళలు అంటే గౌరవం లేని పార్టీ బీజేపీ అని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళల సంరక్షణ గురించి మాట్లడతారు.. దేశంలో మహిళల మీద జరుగుతున్న దాష్టీకాల మీద మాత్రం పెదవి విప్పరని, మహిళా మంత్రులు కూడా మౌనంగా ఉంటారని ఎద్దేవా చేశారు. కేంద్రం సహా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కొందరు మంత్రుల వ్యవహారం ఆందోళన కలిగిస్తోందన్నారు. గోవాలో బీజేపీ కౌన్సిలర్ కొడుకు బాలికలను అత్యాచారానికి గురి చేసిన కేసు, మహారాష్ట్రలో 58మంది మహిళలను అత్యాచారానికి గురి చేసిన అశోక్ ఖరత్ కేసు, ఉత్తరాఖండ్ అంకితా భండారీ హత్య కేసు, ఉన్నావ్ అత్యాచార కేసు, హిమాచల్ ప్రదేశ్‌లో ఒక ఎమ్మెల్యే మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన కేసు, హర్యానా మహిళా కోచ్‌ను వేధింపులకు గురిచేసిన సందీప్ సింగ్ కేసు వంటి ఉదాహరణలు పేర్కొంటూ వీటిల్లో నిందితులకు బీజేపీ రక్షణ కల్పిస్తోందని తెలిపారు. గుర్మీత్ రామ్ రహీమ్‌కు పెరోల్ మంజూరు, బిల్కిస్ బానో కేసులో దోషులకు క్షమాభిక్ష ఇవ్వడం వంటి ఎన్నో కేసులు ఉన్నాయని ఉదహరించారు. జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఆరోపణలు ఉన్నప్పటికీ ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో అతనికి మద్దతు ఇచ్చారన్నారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, దోషి జెఫ్రీ ఎప్‌స్టీన్ మధ్య ఉన్న సంబంధాల విషయంపై పార్లమెంటులో చర్చ జరగకపోవడం విచారకరమన్నారు. లైంగిక వేధింపుల గురించి బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి ఆరోపణలు చేసినప్పటికీ ప్రధాని, పాలక పార్టీ, ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసిలో గత ఏడాది 1686 మహిళలపై నేరాలు జరిగాయని, ఇది పాలన వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. మహిళలు, బాలికలపై పెరుగుతున్న నేరాలు, అలాగే కొన్ని కేసుల్లో నిందితులకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రక్షణ లభిస్తున్నట్లు కనిపిస్తున్న పరిస్థితులపై అఖిల భారత మహిళా కాంగ్రెస్ అత్యవసరంగా సర్క్యులర్ జారీ చేసిందని ఆమె తెలిపారు. కేంద్రంలోశ్రీతీ బీజేపీ చేస్తున్న అరాచకాలను పేర్కొంటూ జిల్లాల్లోో ప్రెస్ మీట్ పెట్టాలని, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు అన్ని జిల్లాలలో ప్రెస్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ, బంక సరళ, నునావత్ రాధ, రాష్ట్ర, జిల్లా నాయకులు, మండల, డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





