మహిళలు ఆర్థికంగా ఎద‌గాలి

– అప్పుడే స‌మాజాభివృద్ధి సాధ్యం

– మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్గొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13: పురుషులతోపాటు మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎల్బీసీ కాలనీ సమీపంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా జిల్లా మహిళా సమాఖ్య, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ సంయుక్త ఆధ్వర్యంలో సుమారు రూ.5 కోట్లతో ఏర్పాటు చేయనున్నమహిళా శక్తి పెట్రోల్‌ పంపు పనులకు మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. ప్రజా ప్రభుత్వం మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, అన్ని పథకాల లబ్ధిని మహిళలకు కల్పిస్తున్నదంటూ ఉచిత విద్యుత్తు, ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం వంటివి ఉదాహరణగా చెప్పారు. మహిళా సంఘాల సభ్యులు కలిసికట్టుగా పనిచేసుకోవాలని సూచించారు. పెట్రోల్‌ బంక్‌ మెడికల్‌ కళాశాల పక్కనే ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల, నర్సింగ్‌ కళాశాల, ఇటు హైదరాబాద్‌ రహదారికి, నాగార్జునసాగర్‌ రహదారికి చేరువలో ఉండటంతో బాగా నడుస్తుందని, పెట్రోల్‌ పంపుతోపాటు, ఏవీ చార్జింగ్‌ మిషన్‌, కెఫెటేరియా, సూపర్‌ మార్కెట్‌ వంటివి ఇక్కడ బాగా నడుస్తాయని అన్నారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ హాస్పిటల్‌ ప్రైవేట్‌ దవాఖానలకు మించి వైద్య సేవలందిస్తున్నదని, ఇటీవలే ఏఐజి హాస్పిటల్‌ ప్రభుత్వ వైద్య కళాశాలతోపాటు, జీజీహెచ్‌ను దత్తత తీసుకున్నదని, కనగల్‌ పిహెచ్‌సీలో గ్లకోమా సెంటర్‌ ఏర్పాటు చేశామని, మహిళల ద్వారా కట్టంగూరు మండలం అయిటిపాములలో సోలార్‌ విద్యుత్‌ యూనిట్లు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. సెర్ప్‌ సీఈవో దివ్యా దేవరాజన్‌ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.20వేల కోట్ల రుణాలు ఇస్తున్నామని, చిన్న సంఘాల ద్వారానే మహిళల్లో ధైర్యం వస్తుందని, ఆర్థికంగా నిలదొక్కుకున్నప్పుడే మహిళ ముందడుగు వేస్తుందని అన్నారు. పాఠశాల విద్యార్థుల యూనిఫామ్‌ కుట్టే బాధ్యతలను మహిళలకు అప్పగిస్తే రాష్ట్రవ్యాప్తంగా రూ.30 కోట్ల ఆదాయం వస్తే ఈ జిల్లాలో రూ.1.40 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ధాన్యం కొనుగోలులో సైతం రాష్ట్రంలో రూ.80 కోట్ల ఆదాయాన్ని స్వయం సహాయక మహిళా సంఘాలు అర్జించాయని వివరించారు. దీంతోపాటు ఆరోగ్యం, పిల్లల చదువు, పౌష్టికాహారం అందించాలని, గ్రామాలలో గృహ హింసకు వ్యతిరేకంగా బాధిత మహిళలకు తోడుగా నిలవాలని, ఆరోగ్యం, సామాజిక భద్రత చూసుకోవాలని పిలుపునిచ్చారు. కలెక్టర్‌ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే మహిళలు వాణిజ్య, వ్యవసాయ రంగాలలో ముందుకు వెళ్తున్నారన్నారు. ఈ పెట్రోల్‌ పంపును సక్రమంగా నిర్వహించుకోవాలని, జిల్లాలో ఇది మూడవదని, మరో మూడు పెట్రోల్‌ పంపులు జిల్లాకు మంజూరయ్యాయని తెలిపారు. ఐవోసీఎల్‌ జీఎం సుదీప్‌రాయ్‌, డీఆర్‌డీఏ పీడీ శేఖర్‌ రెడ్డి మాట్లాడారు. స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ నారాయణ అమిత్‌, రెవెన్యూ అదనపు కలెక్టర్‌. జె.శ్రీనివాస్‌, ఇన్‌చార్జి డీఆర్‌వో అశోక్‌ రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జూపూడి రమేష్‌, డీసీసీబీ డైరెక్టర్‌ సంపత్‌ రెడ్డి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి ఫిష్‌ ఔట్‌లెట్‌ను కూడా ప్రారంభించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *