ఆడ‌బిడ్డ‌ల ఆత్మ గౌర‌వానికి పెద్ద‌పీట‌

– చిత్త‌శుద్ధితో సంక్షేమ ప‌థ‌కాలు
– మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం తెలంగాణ ఆడబిడ్డల గౌరవానికి, ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తోంది. వారు సమాజంలో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సగర్వంగా తలెత్తుకొని జీవించేలా అనేక సంక్షేమ పథకాలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామ‌ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆయ‌న రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో రెడ్ రోజ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ లో మంగ‌ళ‌వారం ఏర్పాటు చేసిన “ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో” ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ  తెలంగాణ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం, వారి నాయకత్వాన్ని పటిష్టం చేయడం, మహిళా సంఘాలను బలోపేతం చేయడం, అయిదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ఈ ఇందిరా మహిళా శక్తి సంబరాలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామ‌న్నారు. ఓవైపు గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతూనే మరోవైపు ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామ‌న్నారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకుల తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు. ఒక్కసారి ఆలోచించండి. ఎలాంటి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చిన మాటను తప్పదని ఈ వేదిక ద్వారా మరోసారి స్పష్టం చేస్తున్నా.
ప్రతి సంవత్సరం వడ్డీ లేకుండా మహిళా సంఘాలకు రూ.20వేల కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామ‌న్నారు. ఇలా ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు ఇవ్వ‌బోతున్నామ‌న్నారు. అయితే… తొలి ఏడాదిలోనే రూ.21వేల కోట్లకు పైగా ఇచ్చామ‌ని గుర్తుచేశారు. ఇందిరా మహిళా శక్తి పాలసీతో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 17 రకాల వ్యాపారాలను గుర్తించి ఆర్థికంగా సాయం చేస్తూ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చి దిద్దుతున్నామ‌న్నారు. రాష్ట్ర ప్రభుత్వం 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను కేటాయించింది. ఆడబిడ్డలకు గౌరవం దక్కాలని… అందుకే వారి పేరుపైనే ఇళ్లను ఇచ్చాం. అన్ని అర్హతలు ఉండి కూడా ఇందిరమ్మ ఇళ్లు రాలేదని ఎవరూ బాధపడొద్దు. రాబోయే రోజుల్లో మీ అందరికీ ఇళ్లు ఇచ్చే బాధ్యత ప్ర‌భుత్వానిద‌న్నారు. ప్రతి రోజు  సరాసరి 14 లక్షల మంది మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇప్పటివరకూ 200 కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నార‌న్నారు. కేవలం ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడం కాదు, ఆ బస్సులకే మహిళలను యజమానులుగా మారుస్తున్నామ‌న్నారు. ఇప్పటికే మహిళా సంఘాల ద్వారా 150 బస్సులను కొనుగోలు చేయించి  ఆర్టీసీకి అద్దెకు ఇప్పించాం. దశలవారీగా ఈ సంఖ్యను వేయికి పెంచేలా చర్యలు తీసుకుంటున్నామ‌న్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో మొదటి దశలో వేయి మెగా వాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయించబోతున్నాం. ఇందుకు సంబంధించిన కసరత్తు ఇప్పటికే మొదలైంద‌న్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 31 జిల్లాల్లో పెట్రోల్ బంకులను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ప్రతి మండల కేంద్రంలో మహిళా సంఘాలకు సంబంధించిన కనీసం ఒక్క పెట్రోల్ బంక్ అయినా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామ‌న్నారు. తొలి పెట్రోల్ బంకును నారాయణపేట్ లో లాంఛనంగా ప్రారంభించుకున్నాం.22 జిల్లా మహిళా సమాఖ్యలకు జిల్లా కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలను నిర్మిస్తున్నాం. ఒక్కో దానికి రూ.5 కోట్లు.. మొత్తం రూ.110 కోట్లు ఇప్పటికే కేటాయించామ‌న్నారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా తెలంగాణ ఆడబిడ్డలకు అప్పగించాం. స్కూల్ యూనిఫాం కుట్టే పనిని కూడా  ప్రభుత్వం మహిళా సంఘాలకే అప్పగించింద‌న్నారు. ఫలితంగా ఏటా వారికి రూ.80 కోట్ల ఆదాయం సమకూరుతున్న ద‌న్నారు. మహిళా సంఘాల్లో సభ్యుల సంఖ్యను 2028 నాటికి కోటికి చేర్చాలని టార్గెట్ గా పెట్టకున్నాం. ఆ లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకుంటామ‌న్న విశ్వాసాన్ని వ్య‌క్తం చేశారు. ప్రతి మండల కేంద్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లులు, గోదాములను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామ‌న్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన కొత్త రేషన్ కార్డుల జారీ, పాత రేషన్ కార్డుల్లో అదనపు సభ్యుల పేర్లను చేర్చేందుకు మా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తామ‌న్నారు. మీ అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేస్తున్న ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలని తెలంగాణ ఆడ బిడ్డలను మనస్పూర్తిగా కోరుతున్నాన‌న్నారు.  ఇది మీ ప్రభుత్వం, మీ కోసం పనిచేసే ప్రభుత్వం, మరిచిపోవద్దు. మీ ఆశీర్వాదం,  మీ నమ్మకమే మాకు పెద్ద బలమ‌న్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీరపల్లి శంకర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *