– కోటిమంది మహిళలకు కోటి చీరలు పంపిణీ చేస్తున్నాం
– 60 ఏళ్లు దాటిన వయోవృద్ధులతో సంఘాల ఏర్పాటు
– మంత్రి దనసరి అనసూయ సీతక్క
ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : మహిళ సాధికారతకు ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, మహిళలకు అన్ని రంగాలలో అభివృద్ధి లోకి తీసుకురావడానికి ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నామని, కోటి మంది మహిళలకు కోటి చీరలను పంపిణీ చేస్తున్నామని , వయో వృద్ధులకు భరోసా కల్పించడం కోసం 60 సంవత్సరాలు నిండిన వృద్ధులకు ప్రత్యేక మహిళా సంఘాలను ఏర్పాటు చేస్తున్నామని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.గోవిందరావుపేట మండలం పసర గ్రామంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ.10 లక్షల నిధులతో ఇందిరా మహిళా శక్తిలో భాగంగా గ్రామ సంఘాల భవనాలకు గురువారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం మహిళా సంఘాల ఉన్నతి తెలంగాణ ప్రగతి అనే లక్ష్యంతో మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి పథం లోకి తీసుకురావడానికి ఇందిరా మహిళా శక్తి పథకాన్ని అమలు చేస్తున్నామని ఈ పథకం ద్వారా అనేకమంది మహిళలు వివిధ వ్యాపార రంగాలలో రాణిస్తున్నారని పేర్కొన్నారు. గ్రామాలలో ఉండే మహిళా సంఘాలు సమావేశాలకు నిర్వహించుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో వారికి శాశ్వత భవనాలు నిర్మించాలని దానిలో భాగంగానే జిల్లాకు దాదాపు 42 శాశ్వత భవనాలు మంజూరు చేయడం జరిగిందని స్పష్టం చేశారు.మేడారం సమ్మక్క సారమ్మ మహా జాతరలో మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, వీటి ద్వారా వారికి రెట్టింపు ఆదాయం లభించిందని , మహిళలు స్వశక్తితో ఎదగడానికి వారికి సకాలంలో వడ్డీ లేని రుణాలు మంజూరు చేసి ఆర్థిక అభివృద్ధికి పాటుపడడం జరుగుతుందని పేర్కొన్నారు. 60 సంవత్సరాలు నిండిన మహిళలకు కూడా ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేయడమే కాకుండా సంఘంలోని సభ్యులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల ఆర్థిక బీమా కల్పించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, డిఆర్డివో శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





