సైబర్ నేరగాళ్ల ఉచ్చులో వృద్ధురాలు

– నిర్మలా సీతారామన్ డీప్‌ఫేక్ ఫొటోలతో మోసం
– ఏకంగా రూ.87.96 లక్షలు కొట్టేశారు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16: సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్ప్పుడు కొత్త ఎత్తులతో ప్రజల వద్ద నుండి డబ్బులు తస్కరిస్తున్నారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫొటోలు, వీడియోలనే వాడుకుంటూ కేటుగాళ్లు రెచ్చిపోయారు. డీప్ ఫేక్ సాంకేతికతతో  సృష్టించిన నకిలీ వీడియోను చూసి నిజమని నమ్మిన ఓ వృద్ధురాలు ఏకంగా రూ.87.96 లక్షలు పోగొట్టుకున్న ఘటన మల్కాజిగిరిలో వెలుగుచూసింది. బాధిత  వృద్ధురాలు సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తుండగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్టాక్ మార్కెట్ పెట్టుబడుల గురించి వివరిస్తున్నట్లు ఉన్న ఒక వీడియో కంటపడింది. అది ఏఐతో సృష్టించిన నకిలీ వీడియో అని తెలియని ఆమె సాక్షాత్తు మంత్రి చెబుతున్నారు కదా అని నమ్మి ఆ వీడియో లింక్‌ను క్లిక్ చేశారు. ఆ వెంటనే సైబర్ కేటుగాళ్లు రంగంలోకి దిగారు. బాధితురాలికి వాట్సాప్ కాల్స్ చేసి తాము పెద్ద ట్రేడింగ్ సంస్థ ప్రతినిధులమని పరిచయం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ట్రేడ్ యాప్‌ అనే ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. ఇందుకోసం ఆమె ఐడీ ప్రూఫ్స్, బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకుని ఒక యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ క్రియేట్ చేసి పంపి తమ అసలైన ప్లాన్ అమలు చేశారు. మొదట నమ్మకం కలిగించడానికి కేవలం రూ.60 వేలు పెట్టుబడి పెట్టించారు. ఆ తర్వాత లాభాలు వస్తున్నట్లు నకిలీ గ్రాఫిక్స్‌తో స్క్రీన్‌పై చూపించి దఫదఫాలుగా మొత్తం రూ.87.96 లక్షలు డిపాజిట్ చేయించుకున్నారు. తన అకౌంట్‌లో భారీగా డబ్బు కనిపిస్తుండటంతో బాధితురాలు ఆ మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నించారు. అయితే సాంకేతిక కారణాలు చెప్తూ కేటుగాళ్లు ఆమెను అడ్డుకున్నారు. ఎంత ప్రయత్నించినా డబ్బు చేతికి రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు వెంటనే మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ డబ్బు ఏ అకౌంట్లలోకి వెళ్లిందో దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి అనుమానాస్పద లింక్స్ లేదా కాల్స్ వస్తే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *