– ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19: దేశంలో రాజకీయ శూన్యత ఏర్పడిన సమయంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇందిరా గాంధీ బ్యాంకుల జాతీయకరణ, అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చారని, పేదలకు భూములు పంచినా, పేదలకు ఇండ్లు కట్టించినా అది ఆమెకే సాధ్యమైందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. పాకిస్థాన్‌తో యుద్ధం సమయంలో దీటుగా నిలబడి ఎదుర్కొన్న ధీశాలి ఇందిరమ్మ దేశానికి బలమైన నాయకత్వం అందించారని, అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణ ప్రాంత మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి విడతగా నేటినుంచి డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు అర్హులైన ప్రతీ గ్రామీణ మహిళకు ఇందిరమ్మ చీరలను ప్రభుత్వం అందించనుంది. రెండో విడతగా మార్చి 1నుంచి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు పట్టణ ప్రాంతాల్లో మొత్తంగా కోటిమందికి కోటి చీరలను ప్రభుత్వం పంపిణీ చేయనున్నది. ఈ సందర్భంగా సీఎం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఇందిరమ్మ స్ఫూర్తితో తమ ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. మహిళలకు పెట్రోల్ బంక్‌లు నిర్వహించుకునేలా ప్రోత్సహించామని, ఆర్టీసీలో వెయ్యి బస్సులకు మహిళలను యజమానులను చేశామని, సంక్షేమంతోపాటు ఆర్థిక ఉన్నతి కలిగించే కార్యక్రమాలు చేపట్టామని, ఆడబిడ్డల పేరుతోనే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామని, రాజకీయాల్లోనూ తగిన ప్రాధాన్యత కల్పించామని వివరించారు. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. ఆడబిడ్డలకు ప్రభుత్వం తరపున సారె పెట్టి గౌరవించాలని భావించి కోటిమంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించామని చెప్పారు. మొదటి విడతలో 65 లక్షల చీరలు పంపిణీ చేయబోతున్నామని, చీరల ఉత్పత్తికి సమయం పడుతున్న నేపథ్యంలో రెండు విడతలుగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ జయంతి రోజున ప్రారంభించిన ఈ కార్యక్రమం డిసెంబర్ 9 వరకు గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతుందన్నారు. మార్చి 1 నుంచి 8వ తేదీ మహిళా దినోత్సవం వరకు పట్టణ ప్రాంతాల్లో పంపిణీ చేస్తామని, ఎవరూ ఆందోళన చెందొద్దు.. ప్రతీ ఆడబిడ్డకు చీరను అందిస్తామని భరోసా కల్పించారు. మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా అధికారులు ఇందిరమ్మ చీర కట్టుకోవాలని, మీరే బ్రాండ్ అంబాసిడర్‌గా మారి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటాలని సూచించారు.
ఇందిరమ్మ ఉక్కు సంకల్పం ప్రతి మహిళలో ఉండాలి : మంత్రి సీతక్క
ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు చీరలు అందజేశారు. తొలుత పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, ఇతర మంత్రులతో కలిసి నెక్లెస్ రోడ్ వద్ద ఉన్న ఇందిరా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఆమె సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మంత్రి సీతక్క మాట్లాడుతూ దేశ తొలి మహిళా ప్రధానిగా పేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఉక్కు మహిళ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వం తరఫున వినమ్ర నివాళులర్పిస్తున్నామన్నారు. పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయం, మహిళా సాధికారత కోసం ఇందిరమ్మ చేసిన కృషిని గుర్తు చేస్తూ ఆమె దేశ ఐక్యత కోసం తన ప్రాణాలను అర్పించిన త్యాగశీలి అని కొనియాడారు. ఇందిరమ్మ ఉక్కు సంకల్పం ప్రతి మహిళలో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి వ్యవస్థలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు గ్రామీణ పేదరికాన్ని తగ్గించే లక్ష్యంతో మహిళా సంఘాలను స్థాపించాయని, అదే దిశలో రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కోటిమంది మహిళలను మహిళా సంఘాల్లో చేర్చి వారిని కోటీశ్వరులను చేయాలనే మహత్తర లక్ష్యంతో ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ లక్ష్యానికి ఆరంభంగా కోటిమంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిందని చెప్పారు. మహిళల ఐక్యతను ప్రతిబింబించేలా యూనిఫామ్ చీరలను అందజేయడం సొంత గౌరవాన్ని, సంఘ బలాన్ని సూచిస్తుందన్నారు. ఈ యూనిఫామ్ చీరలతో సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్(ఎస్‌హెచ్‌జీ) ఆర్మీ గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్థిక సామాజిక సమస్యలపై సమరశంఖం పూరించడానికి సిద్ధమవుతోందన్నారు. తమ ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇప్పటివరకు రూ.27 వేల కోట్లకు పైగా వడ్డీ లేని రుణాలు మంజూరు చేసినట్లు చెప్పారు. బ్యాంకులకు మహిళలు 99.99 శాతం రుణాలను సమయానికి చెల్లించడం వారి క్రమశిక్షణకు నిదర్శనమని ఆమె అన్నారు. ప్రభుత్వ సంకల్పానికి మహిళలందరూ తోడ్పాటునందించాలని పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





