రాష్ట్రం కోసం కేసీఆర్‌తో కలిసి పనిచేస్తా

– ఆయన పాలనే బెటర్
– నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకున్నారు
– తెలంగాణ ఏర్పాటు కేసీఆర్ వల్లనే సాకారమైంది
– మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
– త్వరలో బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటన

జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: తాను బీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. జగిత్యాల వచ్చిన బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. జీవన్ రెడ్డి ఇంటికి వచ్చి ఆయనను బీఆర్ఎస్‌లోకి కేసీఆర్ తరపున ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారిద్దరి భేటీ అనంతరం జీవన్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. తన శేష జీవితంలో కేసీఆర్‌తో పనిచేసే అవకాశం వచ్చిందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్‌తో కలిసి పనిచేస్తే రాష్ట్ర భవిష్యత్తుకు పాటుపడవచ్చన్నారు. 27 నెలలుగా కాంగ్రెస్ పార్టీలో చాలా క్షోభ అనుభవించానని, కాంగ్రెస్‌కు రాజీనామా చేసినప్పుడు భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు. బీఆరఎస్ కంటే మెరుగైన పాలన అందిస్తారని కాంగ్రెస్‌కు ప్రజలు ఓటేశారు.. కానీ రెండేళ్ల పాలనలో రాష్ట్రం తిరోగమన దిశలో నడిచిందని విమర్శించారు. 2014లోనే కేసీఆర్ నాయకత్వంలో పనిచేసే అవకాశం వచ్చినప్పటికీ కాంగ్రెస్‌లోనే కొనసాగానన్నారు. రాష్ట్ర అవసరాల కోసం ఇప్పుడు బీఆరఎస్‌తో కలిసి పనిచేస్తానని జీవన్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్ సూచన మేరకు పార్టీలోకి ఆహ్వానించేందుకు కేటీఆర్ తన ఇంటికి వచ్చారన్నారు. ప్రజాభిప్రాయం మేరకే బీఆరఎస్‌లో చేరుతానని చెప్పారు. తనను పార్టీలోకి ఆహ్వానించినందుకు కేసీఆర్, కేటీఆర్‌లకు హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. ఎన్ని ప్రభుత్వాలనో చూశాను.. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తిరోగమన దిశలో ఉందని వ్యాఖ్యానించారు. రెండు రోజుల్లో కేసీఆర్‌ను జీవన్‌రెడ్డి కలుస్తానన్నారని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు.

రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర‌ విమ‌ర్శ‌లు

రేవంత్ రెడ్డి పాలనకంటే కేసీఆర్ పాలన బాగుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను త్వరలోనే బీఆర్ఎస్‌లో చేరబోతున్నట్లు స్పష్టం చేశారు. గురువారం కేటీఆర్ రాక‌ముందు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతోందని, ఉద్యోగులు, నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ప్రజలు ఆశించిన పాలన రాలేదని వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో బీజేపీ బెటర్ అని, రాష్ట్రస్థాయిలో కేసీఆర్ మెరుగైన నాయకుడని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేసీఆర్ వల్లే సాధ్యమైందని గుర్తు చేశారు. జీవన్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. 1984లో కాంగ్రెస్‌లో చేరిన జీవన్‌రెడ్డి 43 ఏళ్లుగా ఉత్తర తెలంగాణలోనే కీలకమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్‌రెడ్డి మూడుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2014లో తెలంగాణ అవతరించిన తర్వాత ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి కాంగ్రెస్‌కు చెందిన ఏకైక ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన జీవన్‌రెడ్డి 2019లో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలిచి శాసనమండలిలో ఏకైక కాంగ్రెస్ సభ్యుడిగా కొనసాగారు. జగిత్యాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ సంజయ్‌కుమార్‌ను సీఎం రేవంత్‌రెడ్డి పార్టీలో చేర్చుకోవడంతో జీవన్‌రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. జీవన్‌రెడ్డి వర్గానికి ప్రాధాన్యత తగ్గడం, నామినేటెడ్ పదవుల కోసం ప్రతిపాదించిన వారికి పదవులను ఇవ్వకుండా ఎమ్మెల్యే సూచించిన వ్యక్తులకు ఇవ్వడం, ప్రధాన అనుచరుల్లో ఒకరు దారుణ హత్యకు గురికావడంతో జీవన్‌రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాల, రాయికల్ పట్టణాల్లో తన వర్గానికి చెందిన వారిని పక్కన పెట్టడంతో తీవ్ర ఆవేదనకు లోనైన జీవన్‌రెడ్డి గత నెల 25న కార్యకర్తలు, నాయకుల సమక్షంలో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *