“కాంగ్రెస్ మీద మొదట తిరుగుబాటు చేసినవి శూద్ర కులాలే. 1960లలో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు, వాటి వెనుక, ముందు శూద్రకులాల ఓటర్లు, పార్టీలు ఉన్నాయి. ఈ బిసికులాల పునాదిగా వివిధ జనతాపార్టీలు ఏర్పడి, ఉత్తరాది రాష్ట్రాలలో 70లలో, 80లలో అవి అధికారానికి వచ్చాయి. అనంతర సమీకరణల్లో ఆ మధ్యేవాదపార్టీలు అధికంగా కాంగ్రెస్‌తోను, కొన్ని బిజెపితోను కలసి ప్రయాణించాయి. రాహుల్ గాంధీ హయాంలో మాత్రమే కాంగ్రెస్ స్పష్టమైన సామాజిక న్యాయ విధానాన్ని చేపట్టి, బిసి సాధికారత కోసం వాదనలు, ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. బిజెపి దిగివచ్చి, వచ్చే జనాభాసేకరణలో కులగణనను చేర్చాలని నిర్ణయించడం, కాంగ్రెస్ పెడుతున్న ఒత్తిడి ఫలితమే అని చెప్పాలి.”

అధిష్ఠానం ఆగ్రహానికి గురయ్యారని, ఎన్ని సార్లు వెళ్లినా దర్శనం ఇవ్వడం లేదని, ఇంకో నెలరోజుల్లో వీడ్కోలు తప్పదని రేవంత్ రెడ్డి విషయంలో ప్రచారంలో ఉన్న వేడివేడి ఊహాగానాలు ఒక్కసారిగా చల్లారిపోయాయి. రెండురోజులుగా కనిపిస్తున్న దృశ్యాలు, వినిపిస్తున్న వార్తలు చూస్తుంటే, వింటుంటే, ఆగ్రహం సంగతి ఎట్లా ఉన్నా, ప్రస్తుతం మాత్రం ప్రశంసలు దండిగా దొరికాయని, దేశమంతటిలోనూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా చెప్పబోతున్నారని అర్థమవుతోంది. ఈ పార్లమెంటు సమావేశాలలో కాసింత ధాటిగా గొంతు విప్పుతున్న కాంగ్రెస్ పార్టీ, బిహార్‌ఎన్నికల నేపథ్యంలో అనుసరించబోయే ప్రధానవ్యూహానికి తెలంగాణ కులగణన సర్వే ప్రాతిపదిక కావడం రేవంత్ రెడ్డికి అనూహ్య గౌరవమే! అట్లాగని, తక్కిన రాష్ట్రపరిపాలన విషయాల్లో నూటికినూరుపాళ్లు అధిష్ఠానం సంతృప్తిపడుతోందని కూడా చెప్పలేము.
తెలంగాణలో కులగణన సర్వే జరిగిన తీరు మీద చాలా విమర్శలున్నాయి. కొన్ని కొన్ని ప్రాంతాలలో అధికారులు ఏ సమాచారాన్ని సేకరించకుండానే ముగించారని ఆరోపణలు వచ్చాయి. ప్రతిపక్షాల వారు తమ వివరాలందించి సర్వేకు సహకరించలేదని ప్రభుత్వం కూడా ఎదురు దాడి చేసింది. కెసిఆర్ ప్రభుత్వం ఒకేరోజున తెలంగాణ వ్యాప్తంగా చేసిన సమగ్ర సామాజిక సర్వేతో దీనిని పోల్చి కూడా చూశారు. కులగణన సర్వే ఫలితాల మీద కూడా చాలా అభ్యంతరాలు వచ్చాయి. ఓబీసీల జనాభా శాతం వాస్తవం కంటె తక్కువగా చూపించారని, ఆర్థికంగా వెనుకబడినవారన్న పేరుతో అగ్రకులాలవారికి ఇస్తున్న పదిశాతం రిజర్వేషన్లకు సమర్థన ఇస్తున్నట్టుగా, వారి జనాభాను లెక్కించారని విమర్శలు వచ్చాయి. చాలా ఆదరాబాదరాగా జరిపిన సర్వేను కాంగ్రెస్ అధిష్ఠానం ఇంత తలకెత్తుకోవడం ఆశ్చర్యంగా కనిపిస్తుంది.
సాంప్రదాయికంగా, కాంగ్రెస్ పార్టీ ఓట్ల పునాది వేరు. శిఖరస్థానంలో ఉన్న ప్రాబల్యకులాలు, దళిత, ఆదివాసీ కులాల ఓట్లను అది తన ప్రధాన నియోజకవర్గంగా భావిస్తూ ఉండేది. అట్లాగని, శూద్రకూలాలను పూర్తిగా వదిలివేసిందని కాదు. కానీ, ఫోకస్ వాటి మీద ఉండేది కాదు. అందుకే, కాంగ్రెస్ మీద మొదట తిరుగుబాటు చేసినవి శూద్ర కులాలే. 1960లలో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు, వాటి వెనుక, ముందు శూద్రకులాల ఓటర్లు, పార్టీలు ఉన్నాయి. ఈ బిసికులాల పునాదిగా వివిధ జనతాపార్టీలు ఏర్పడి, ఉత్తరాది రాష్ట్రాలలో 70లలో, 80లలో అవి అధికారానికి వచ్చాయి. అనంతర సమీకరణల్లో ఆ మధ్యేవాదపార్టీలు అధికంగా కాంగ్రెస్‌తోను, కొన్ని బిజెపితోను కలసి ప్రయాణించాయి. రాహుల్ గాంధీ హయాంలో మాత్రమే కాంగ్రెస్ స్పష్టమైన సామాజిక న్యాయ విధానాన్ని చేపట్టి, బిసి సాధికారత కోసం వాదనలు, ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. బిజెపి దిగివచ్చి, వచ్చే జనాభాసేకరణలో కులగణనను చేర్చాలని నిర్ణయించడం, కాంగ్రెస్ పెడుతున్న ఒత్తిడి ఫలితమే అని చెప్పాలి.
బిజెపి తీవ్రమత రాజకీయాలకు కులగణన ఒక బలమైన విరుగుడు అని రాహుల్ గాంధీ, ఆయన సలహాదారులు భావిస్తున్నట్టున్నారు. అనుకున్నంతగా అది ఫలితాలను ఇవ్వకపోవచ్చునని కొందరు విశ్లేషకులు హెచ్చరిస్తున్నా, కాంగ్రెస్ నిలకడగా ఈ వైఖరినే విశ్వసించి, ముందుకు వెడుతున్నది. భారతీయ జనతాపార్టీ కూడా వెనుకబడిన కులాల వారిని తమవైపునకు తిప్పుకోవడానికి పది పన్నెండేళ్లుగా గట్టి ప్రయత్నాలు చేసింది. నరేంద్ర మోదీ ప్రధాని అభ్యర్థిత్వం ఖరారు అయ్యాక, 2014 ఎన్నికలలో ఓబీసీ ఓటర్లను ప్రత్యేకంగా లక్ష్యంగా పెట్టుకుంది. బిసి సామాజిక వర్గానికి చెందిన దేవెగౌడ మునుపు ప్రధానిగా కొంతకాలం చేసినప్పటికీ, తనవంటి పెద్ద జాతీయ రాజకీయపార్టీ ప్రధాని అభ్యర్థిగా బిసిని ఎంచుకోవడాన్ని బిజెపి గొప్పగా ప్రచారం చేసుకున్నది. మోదీ ప్రధాని అయ్యాక కూడా, వివిధ మధ్యేవాద రాజకీయపార్టీల వెనుక మోహరించి ఉన్న ఉత్తరాది బిసిలను తన వైపు తిప్పుకోవడానికి, బిజెపి ప్రయత్నాలు కొనసాగించింది. ఆరుదశాబ్దాల కిందటి కలేకర్ కమిటీ రిపోర్టును తిరిగి చర్చకు పెట్టింది, బిసిల అభివృద్ధిని కోరిన అన్ని నివేదికలను కాంగ్రెస్ తొక్కిపెట్టిందని విమర్శించింది. అనేక రాష్ట్రాలలో బిసిలు తమ పార్టీ ముఖ్యమంత్రులుగా ఉన్నారని, కాంగ్రెస్ కంటె తమకే ఓబీసీ ఎంపీలుఅధికంగా ఉన్నారని వాదించింది. కానీ, ఆశించినంత వేగంగా బిసిలు తమ వైపుకు మళ్లకపోవడంతో, ఎన్నికల ప్రయోజనాల కోసం ఉత్తరాది రాష్ట్రాలలో బిసి కులాల మధ్య పోటీని, వైరాన్ని ఆధారం చేసుకుని రాజకీయాలు మొదలుపెట్టింది. ఆ ఎత్తుగడ విజయం సాధించింది కూడా.
“రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రెజెంటేషన్ ఇచ్చిన తరువాత రాహుల్‌గాంధీ ఒక మాట అన్నారు. “రేవంత్ రెడ్డి కులం వాళ్లు, ఈ సర్వేను సవ్యంగా జరగనిస్తారా? అని సందేహం ఉండింది, కానీ, దాన్ని అధిగమించి రేవంత్ దీన్ని పూర్తిచేశారు”- అని. ఎదురయ్యే అవరోధాల మీద అటువంటి అవగాహన కలిగి ఉన్నందుకు రాహుల్ ను అభినందించవచ్చు. బహుశా ఆయనకు ఆ తెలివిడి కర్ణాటక అనుభవం నుంచి వచ్చి ఉండాలి. బిసిలుగా గుర్తింపు కలిగిన రెండు ప్రాబల్యశూద్రకులాల రాజకీయ రంగస్థలం కర్ణాటక. వారి జనాభాశాతం ఎంత తక్కువగా ఉందో, వారింత కాలం ఎంత అధికంగా ప్రాతినిధ్యాన్ని అనుభవిస్తున్నారో బట్టబయలు కావడం అక్కడి అధికారశ్రేణులకు ఇష్టం లేదు. అదిన్నీ ఆ రెండు ప్రాబల్యకులాలకు చెందని సిద్దరామయ్య ద్వారా వెల్లడి కావడం పరువుసమస్యగా మారింది. హయాంలో నిర్వహించిన కులసర్వే ఫలితాలు బయటకు రాకపోవడానికి కారణం అదే. మరి అక్కడ ఇప్పుడు కొత్తగా సర్వే చేయాలనుకోవడం, ఆ తక్కువ శాతాలకు మరమ్మత్తు చేయవచ్చునన్న ఆలోచనా? తెలియదు.”
రాహుల్ మాత్రం కులగణనను తాము అధికారంలో ఉన్నప్పుడే పదిహేనేళ్ల కిందటే చేసి ఉండవలసిందన్న పశ్చాత్తాప ఆత్మవిమర్శకు కూడా సిద్ధపడుతున్నారు. ఆయన ప్రతిపాదనకు, వాదనకు నిరూపణగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేను ఎందుకు భావిస్తున్నారు? ఏడెనిమిదేళ్ల కిందటే సిద్దరామయ్య, తన మొదటి హయాంలో కులసర్వే చేయించారు కదా? దాని ఫలితాలను బయటపెట్టకుండా, ఎందుకు దాచిపెట్టినట్టు? ఇప్పుడు కొత్తగా మళ్లీ సర్వే చేయించాలని ఎందుకు అనుకుంటున్నట్టు? తన మిత్రపక్షం కాకపోయినా, బిహార్ లో కూడా ప్రభుత్వం కులగణన చేయించింది కదా? వీటన్నిటిని పక్కనబెట్టి, తెలంగాణ సర్వేకు మాత్రమే ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు? ఆ నాడు మోదీ గుజరాత్ నమూనా ప్రచారం అయినట్టు, రేపు తెలంగాణ నమూనాకు కూడా దేశమంతా అబ్బురపడుతుందా?
రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రెజెంటేషన్ ఇచ్చిన తరువాత రాహుల్‌గాంధీ ఒక మాట అన్నారు. “రేవంత్ రెడ్డి కులం వాళ్లు, ఈ సర్వేను సవ్యంగా జరగనిస్తారా? అని సందేహం ఉండింది, కానీ, దాన్ని అధిగమించి రేవంత్ దీన్ని పూర్తిచేశారు”- అని. ఎదురయ్యే అవరోధాల మీద అటువంటి అవగాహన కలిగి ఉన్నందుకు రాహుల్ ను అభినందించవచ్చు. బహుశా ఆయనకు ఆ తెలివిడి కర్ణాటక అనుభవం నుంచి వచ్చి ఉండాలి. బిసిలుగా గుర్తింపు కలిగిన రెండు ప్రాబల్యశూద్రకులాల రాజకీయ రంగస్థలం కర్ణాటక. వారి జనాభాశాతం ఎంత తక్కువగా ఉందో, వారింత కాలం ఎంత అధికంగా ప్రాతినిధ్యాన్ని అనుభవిస్తున్నారో బట్టబయలు కావడం అక్కడి అధికారశ్రేణులకు ఇష్టం లేదు. అదిన్నీ ఆ రెండు ప్రాబల్యకులాలకు చెందని సిద్దరామయ్య ద్వారా వెల్లడి కావడం పరువుసమస్యగా మారింది. హయాంలో నిర్వహించిన కులసర్వే ఫలితాలు బయటకు రాకపోవడానికి కారణం అదే. మరి అక్కడ ఇప్పుడు కొత్తగా సర్వే చేయాలనుకోవడం, ఆ తక్కువ శాతాలకు మరమ్మత్తు చేయవచ్చునన్న ఆలోచనా? తెలియదు.
తెలంగాణ సర్వేను నమూనాగా భావించాలనుకోవడానికి స్థానికసంస్థల ఎన్నికలలో, వీలయితే అధికారికంగా, కాకపోతే, పార్టీపరంగా 42 శాతం రిజర్వేషన్లను అమలుచేయగలిగే వీలు ఉండడమే కావచ్చు. ప్రాబల్య కులానికి చెందిన రేవంత్ రెడ్డి ద్వారా కులగణన, 42 శాతం రిజర్వేషన్ ప్రయత్నం జరిగితే ఏకాభిప్రాయం సాధ్యమని అనుకుని ఉండవచ్చు. బిల్లు అయితే చేశారు. గవర్నర్ దాన్ని కేంద్రానికి నివేదించారు. సెప్టెంబర్ 30 లోగా ఎన్నికలు జరగాలి. ప్రక్రియ ప్రారంభమయ్యే గడువులోగా, రాష్ట్రపతి ఆమోదం వస్తే సరే, లేకపోతే, ఆర్డినెన్స్ జారీచేస్తారు. కోర్టుకు వెడితే అది రద్దుకావచ్చు. అధికారికంగా కాకపోతే, పార్టీ పరంగా అయినా 42 శాతం అభ్యర్థులుగా బీసీలను నిలబెట్టవచ్చు. అమలుచేయాలనే సంకల్పాన్ని రుజువు చేసుకోవడానికి రేవంత్ ప్రభుత్వానికి తద్వారా కాంగ్రెస్ కు ఇది ఒక అవకాశం. ఇది బిహార్ ఎన్నికలలో ప్రదర్శించుకోగల వైఖరి అవుతుంది.
బిజెపికి ఇది చాలా సంకట పరిస్థితి. అందుకే, కాంగ్రెస్ కు, రేవంత్‌కు చిత్తశుద్ది లేదన్న వాదన ఎత్తుకున్నది. ముఖ్యమంత్రిగా బిసిని నియమించవచ్చును కదా అని కొన్ని పేర్లు కూడా సూచిస్తున్నది. బిసి రిజర్వేషన్లను 9 వ షెడ్యూలులో చేర్చడం ద్వారా న్యాయప్రమేయం నుంచి రక్షణ కల్పించాలన్న సూచన ఆచరణ సాధ్యం కాదని బిజెపి రాష్ట్రఅధ్యక్షులు స్పష్టం చేశారు. కేంద్రవైఖరిని సమర్థించవలసి రావడం, అటు నదీజలాల విషయంలో అయినా, ఇటు బిసి రిజర్వేషన్ల విషయంలో అయినా రాష్ట్ర బిజెపి నాయకులకు తెలంగాణలో ఇబ్బందే. ఇక బిఆర్‌ఎస్ నాయకత్వం కూడా కాంగ్రెస్ ద్వంద్వత్వం మీద, బిల్లు ఆమోదం పొందే అవకాశం లేదనే వాదన మీద ఆధారపడి ఉన్నారు. బిసిల సాధికారత కోసం, అధిక ప్రాతినిధ్యం కోసం ఉద్యమించడానికి బిఆర్‌ఎస్ బిసి నాయకులు కొంత ప్రయత్నం చేశారు కానీ, అది ఆరంభంలోనే ఆగిపోయింది. కల్వకుంట్ల కవిత బిసి అంశాన్ని రాజకీయ కార్యక్రమంగా మలచుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, కానీ, పార్టీలోపల ఆమె పడుతున్నఘర్షణ ఆ ప్రయత్నానికి ఒక పరిమితిగా ఉన్నది.
పెహల్‌గామ్ మీద ప్రతిపక్షాల తీవ్రవిమర్శలు, జడ్జి వర్మ అభిశంసన విషయంలో కాంగ్రెస్‌కు దొరికిన చొరవ, బిహార్‌లో ఓటర్లజాబితా సవరణ మీద వెల్లువెత్తిన అభ్యంతరాలు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో అధికారపక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఉపరాష్ట్రపతిని అమర్యాదకరంగా సాగనంపిన అప్రదిష్ఠను మూటగట్టుకోవడానికి కూడా బిజెపి సిద్ధపడింది. అంతర్జాతీయంగా పరిస్థితులు ఏమంత అనుకూలంగా లేవు. కొత్త ఆలోచనలు చేయగలిగే సృజనాత్మకత కూడా లోపిస్తున్నది. ముస్లిములకు బిసిప్రతిపత్తి తొలగించాలన్న వాదనతో, ఆ పార్టీ ఈ పరిణామాలను ఎదిరించాలని చూస్తున్నది. ఈ సమయంలో, బిసిలకు భాగస్వామ్యాన్ని పెంచే ఉద్యమాన్ని కాంగ్రెస్ చేపట్టడంలో రాజకీయ వివేకం ఉన్నది. స్పందన ఎట్లా ఉంటుందో వేచిచూడవలసిందే.
అయితే, అసలు సమస్య మిగిలే ఉంటుంది. చిత్తశుద్ధి ఉందా? అగ్రనేతకు సరే, అనంతర నాయకశ్రేణికి ఉంటుందా? కామారెడ్డి డిక్లరేషన్ తరువాత, అసెంబ్లీ అభ్యర్థిత్వాల విషయంలో, ప్రభుత్వం ఏర్పడిన తరువాత మంత్రివర్గంలో స్థానాల విషయంలో, ఆ స్ఫూర్తి సాధ్యపడిందా? ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేకపోయినా, పిసిసి అధ్యక్షపదవి ఇవ్వగలిగారు, మంచిదే కానీ, ఈ మొత్తం ప్రక్రియ, బిసి రాజకీయ, విద్యా, ఉద్యోగ సాధికారతలను ఎంతో కొంత పెంచగలదా? అస్తిత్వ చైతన్యాన్ని పెంచి, మరోఐదేళ్లకో, పదేళ్లకో అయినా వారు తమ హక్కును గట్టిగా, సంఘటితంగా డిమాండ్ చేయగలిగే స్థితి తేగలరా? రేవంత్ రెడ్డి జన్మించిన సామాజికవర్గం కానీ, తెలంగాణలోని ఇతర అధికార కులాలు కానీ, ఈ పరిణామాన్ని అనుమతిస్తాయా?
చట్టసభల్లో, విద్యా ఉద్యోగ అవకాశాల్లో దళిత, ఆదివాసీలకు తమ జనాభాకు తగిన ప్రాతినిధ్యం సాంకేతికంగా అయినా ఉంది. చాలా రాష్ట్రాల్లో బిసిలకు విద్యా ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్ అందడం కూడా గగనంగానే ఉంది. ఇక చట్టసభల సంగతైతే దేశవ్యాప్తంగా ఒకటే పరిస్థితి. అల్పసంఖ్యాకులైన ప్రాబల్యకులాలు తమ జనాభా నిష్పత్తికి మించి అనుభవిస్తున్న స్థానాలన్నీ బిసిల నుంచి అపహరించినవే అని గ్రహించాలి. ‘మేమెంతో మాకంత’ అన్న నినాదాన్ని వాస్తవంగా మార్చగలిగితే, సామాజికన్యాయ ప్రస్థానంలో ఒక ముఖ్యఘట్టం పూర్తవుతుంది!




