తెలవారదేమో స్వామి

 

నేను చచ్చిపోయాను

ఎలా చచ్చిపోయానో తెలుసా?

అరే… మాట్లాడుతుంటే మధ్యలో నా చీర విప్పేస్తున్నారు, చిరిగిన రవిక తీసేస్తున్నారు, అదేంటి నా శవాన్ని కాల్చేటప్పుడు కదా, నా వొంటిమీద వున్న బట్టలన్నీ తీసేయ్యాలి, అరే యిదేమిటి యిప్పుడే తీసేస్తున్నారు? కాటికి వెళ్ళకముందే నన్ను బోడిమొలతో గాని నిలబెడతారా? ఒక్కోకట్టెతో నా మానం కప్పుతూ కదరా తియ్యాలి.

నా మాట వినండర్రా?

ఓహ్… చనిపోయినవాళ్ళ మాటలు మీకు వినిపించవేమో కదా?

నేను చనిపోయినందుకు నాకు బాధ లేదు. నేనేం పిల్లని కాదు. పుట్టి ఆరు పుష్కరాలు దాటింది. వయసు మీద పడితే రోగమో రొస్టో వస్తే పోవడం వేరు. కాటికి కాళ్ళు చాపుకున్న నాకు దేవుడు తప్ప యెవరు పిలుస్తారులే అనుకున్నాను. ఆడదయితే చాలు వావి వరుసలు అడ్డంకాని వాళ్ళకు వయసు అడ్డం కాదని తెలుసుకోలేకపోయాను. కాని నాలాంటి చావు యెవరికీ రాకూడదు గాక రాకూడదు.

అరరే యిదేమిటి? నాకు మళ్ళీ బట్టలు తొడుగుతున్నారు? హమ్మ… బ్రా యిప్పుడా! దేనికి? చేతుల్లేకుండా జాకెట్, స్లీవ్ లెస్సా? నాకు సిగ్గేస్తోంది. హు… విడ్డూరం కాకపోతే టాప్ కింద స్కర్టా? నాకేం అర్థం కావడం లేదు. నన్ను మరీ చిన్న పిల్లని చేసేస్తున్నారు? ఇదేమిటి నా పెదాలకు లిప్స్టిక్ పూస్తున్నారు. నన్ను పెళ్ళికూతుర్ని చేస్తున్నారా? చావు కూడా పెళ్ళిలాంటిదేననా?

‘కురచ దుస్తుల్లో భలే వుంది బామ్మ’

‘ఈ పొట్టి బట్టల్లో యెవరైనా బాగుంటారు’

మీయమ్మ కడుపులు మాడ అవేం మాటలురా? చచ్చిన శవానికి బట్టలు తొడిగి యీ సోకులూ సొంపులూ యేమిట్రా? ఒరే వాడెవడో నన్ను బలాత్కారం చేసి చంపేస్తే వాడ్ని పట్టుకోకుండా యివేమి వేషాల్రా? రేయ్ నా మనవడి వయసువాడురా నామీద అఘాయిత్యం చేసాడురా అ…అమ్మా… ఆడపుట్టుక పుడితే తెలుస్తుందిరా, పాలిచ్చి పెంచిన యీ గుండెలు కోసుకుపోయినట్టుందిరా, ఒరే ఆ శవపంచనామా యేదో చెయ్యించండిరా, యీ వొళ్ళంతా కోసేస్తే ఆ నొప్పితో అయినా యీ నొప్పి మర్చిపోతానురా, అమ్మా…

‘పొట్టి పొట్టి బట్టలు వేసుకోవడం వల్లే రేప్‌లు జరుగుతున్నాయని తెలియాలి’

‘మా బట్టలు మా యిష్టం అనే వాళ్ళకు కరెక్ట్ ఆన్సర్’

అమ్మా… అమ్మా…

 బమ్మిడి జగదీశ్వరరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *