లొంగుబాటులు త్యాగాల పోరాటలను నిలువరిస్తుందా..?

“భూమి ఉన్నన్నీ రోజులు భూ సమస్యలుంటాయి. భూ సమస్యలునన్నీ రోజులు భూ పోరాటాలుంటాయి.. భూ పోరాటాలునన్నీ రోజులు ప్రజల తిరుగుబాటు, చైతన్యం ఉంటుంది..సామాజిక రుగ్మతలునన్నీ రోజులు అసమానతలుంటాయి.. అసమానతలునన్నీ రోజులు కుల మత సామాజిక ఆధిపత్యం ఉంటుంది..ఈ ఆధిపత్యం ఉన్నన్నీ రోజులు అణచివేత ఉంటుంది..అణచివేత ఉన్నన్నీ  రోజులు  ప్రజల తిరుగుబాటు ఉంటుంది..”

భారత్‌లో విప్లవోద్యమాన్ని నిర్మూలించేందుకు ఇండియన్‌ గవర్నమెంట్ అనేక అణిచివేత విధానాలు అమలు చేస్తోంది. మావోయిస్టు పార్టీ దేశంలో లేకుండా చేసేందుకు ప్రభుత్వాలు చేయని ప్రయత్నాలు లేవు.కాంగ్రెస్‌ నుంచి బీజేపీ వరకూ మధ్యలో వచ్చిన చాలా సంకీర్ణ ప్రభుత్వాలు కూడా నక్సలిజాన్ని నిర్మూలించే ఎజెండానే అమలు చేశారు.

  ప్రపంచ వ్యాప్తంగా ప్రైవేటీకరణ, కార్పోరేటికరణ, గ్లోబలైజషన్‌ వచ్చిన తర్వాత అమెరిక ఆర్థిక సంస్థల గుత్తాధిపత్యం పెరిగింది.ప్రభుత్వంలో డైరెక్ట్‌గా ఆవి జోక్యం చేసుకోవడం ఎక్కువైంది. అంతేకాదు ఆయా దేశాల్లో ప్రజా సంపదను దోచుకునేందుకు ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాయి. బ్రిటిష్‌ సామ్రాజ్యం ప్రత్యేక్షంగా దేశాలను ఆక్రమించి దోపిడీ చేస్తే..గ్లోబలైజేషన్‌ తర్వాత బడా కార్పొరేట్‌ కంపెనీలను అడ్డుపెట్టుకుని దేశాల సంపదను ద్రవ్య సంస్థలు పరోక్షంగా దోపిడి చేస్తుంది.

అయితే ప్రపంచ ద్రవ్య సంస్థల దోపిడీకి భారత్‌లో మావోయిస్ట్ పార్టీ కొరకాని కొయ్యగా మారింది.రెడ్ కారిడార్‌ పేరుతో ప్రభుత్వాల దోపిడికీ ప్రత్యామ్నాయ రాజకీయ సమాంతర ప్రభుత్వాన్ని మావోయిస్ట్‌ పార్టీ నడిపింది.ఇప్పటికీ దండకారణ్యంలో నడుపుతుంది. మధ్య భారత్‌లో ఉన్న విలువైన ఖనిజ సంపద, రేర్‌ మినలర్స్‌పై బడా కార్పొరేట్‌ శక్తుల కన్నుపడింది. అక్కడ ఉన్న జాతి సంపదను కాపాడుతున్న ఆదివాసులకు మావోయిస్ట్‌లు తోడయ్యారు. దీంతో అక్కడ ఉన్న సంపదను దోచుకోవడానికి అడ్డుగా ఉన్న మావోయిస్ట్‌లను నిర్మూలించే ఎజెండాను భారత ప్రభుత్వాలు అమలు చేశాయి.

త్యాగాలకు బయపడలేదు.పోరాటంలో వెన్నుచూపి పారిపోలేదు.చివరికి కోవర్ట్ ఆపరేషన్లు కూడా మావోయిస్ట్‌ పార్టీ ఎదుర్కొంది.ఇప్పటికే ఎదుర్కొంటూనే ఉంది.అయిన ఏనాడు నూతన ప్రజాస్వామ్య విప్లవ నినాదాన్ని విడువలేదు. వర్గ పోరాట పంథాను వీడలేదు. కార్మిక కర్షక నియంతృత్వ విప్లవం కోసం త్యాగాలకు సిద్ధపడింది తప్ప రాజ్యానికి లొంగిపోలేదు. మావోయిస్ట్‌ ఉద్యమాన్ని అంతం చేయడానికి భారత పాలకులు మొదలుపెట్టిన సైనిక ఆపరేషన్లన్నీ విఫలం అవుతున్నాయి. తుపాలకుతో నిర్మూలించడం సాధ్యం కాదని, అన్నల త్యాగాల వారసత్వం ఉద్యమాన్ని మరింత కాపాడుతుందని గ్రహించిన  పాలకులు ఒకవైపు సైనిక యుద్దం కొనసాగిస్తునే మరోవైపు సైకలాజికల్ వార్‌కు దిగింది. మావోయిజం పనికి రాదని, కాలం చెల్లిందనే ప్రచారం విస్తృతంగా ప్రచారం చేస్తుంది.

మావోయిస్ట్‌ పార్టీ కూడా ఒక పొలిటిక్ పార్టీ. బూర్జువా రాజకీయా పార్టీల్లో ఉన్నట్లే నూతన ప్రజాస్వామిక, కార్మిక వర్గ నియంతృత్వ ప్రభుత్వం ఏర్పడాలన్న లక్ష్యం కోసం పని చేస్తున్న మావోయిస్ట్‌ పార్టీలో కూడా ఆధిపత్య విభేదాలుంటాయి..అంతేకాదు రాజకీయ చైతన్యం తగ్గి చాలా మంది త్యాగాల పోరాటం నుంచి బయటకు వచ్చారు. ఒకవైపు రక్తపాతం పారిస్తునే మరోవైపు రాజకీయంగా బలహీనపడిన,చైతన్యం లోపించిన వారిని కేంద్రం అడ్డుపెట్టుకుని మావోయిజానికి వ్యతిరేకరంగా ప్రచారం చేయిస్తుంది.మావో సిద్దాంతం విఫలమైందని, దేశంలో సాయుధ పోరాటం విఫలమైందనే ప్రాపగండను రాజ్యానికి లొంగిపోయిన వారిచే ప్రభుత్వం చేయిస్తుంది.యువత మావోయిస్ట్‌ పార్టీకి ఆకర్షితులు కాకుండా ఇలాంటి వ్యతిరేక ఎజెండాను అమలు చేస్తుంది.

అయితే భారత పాలకులు ఎన్ని ప్రయత్నాలు చేసినా..ఎన్ని కుట్రలు చేసినా..ఎన్ని ఆఫరేషన్లు చేపట్టినా..ఎన్ని కోవర్ట్‌ ఆఫరేషన్‌లు చేసిన ఉద్యమ బలం చెక్కుచెదరడం లేదు. వెరసి త్యాగాలు మరింత ఉద్యమాన్ని బలోపేతం చేస్తుంది. దీంతో మావోయిస్ట్‌ పార్టీ నిర్మూలన కంటే సిద్దాంత నిర్మూలనే ప్రధాన ఎజెండాగా కేంద్రం అమలు చేస్తుంది. ఈ క్రమంలో బలహీనతలతో రాజ్యానికి లొంగిపోయిన వారితో త్యాగాల పోరాటంపై వ్యతిరేక ప్రచారం చేయిస్తుంది.మరీ ముఖ్యంగా గత పదేళ్లుగా ఇది మరింత పెంచింది.ఇప్పుడు అది తారా స్థాయికి చేరింది. కేంద్రం ఈ ఏడాది జనవరిలో ఆపరేషన్‌ కగార్‌, ఆపరేషన్‌ కర్రెగుట్టలు ప్రారంభించి నిర్బంధాన్ని  తీవ్రతరం చేసింది.

అయితే దేశం కోసం, ప్రజల కోసం ఆయుధాలు పక్కనబెట్టి ప్రభుత్వంతో చర్చలకు సిద్దంగా ఉన్నామని మావోయిస్ట్ పార్టీ అనేక ప్రకటనలు చేసినా.నక్సలిజం నిర్మూలనే లక్ష్యంతో ఉన్న భారత పాలకులు చర్చలకు ముందుకు రాలేదు.పాక్‌తో చర్చలు జరిపేందుకు..అప్ఘనిస్తాన్‌తో చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్దమైంది కానీ సొంత ప్రజలతో చర్చలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు రాలేదు..వెరసి లొంగిపోండి లేదా చచ్చి పోండంటూ కేంద్రం బహిరంగానే ప్రకటిస్తుంది.

రాజ్యం బెదిరింపులకు భయపడని మావోయిస్ట్‌లు సాయుధ పోరాటం కొనసాగించేందుకు సిద్దం అయ్యారు..అయితే మధ్య భారత్‌లోని సంపద అదానీలకు కట్టబెట్టాలని ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం అందని ద్రాక్షగానే మిగిలిపోతుందన్న భయంతో రాజ్యానికి లొంగిపోయిన ముఖ్య నక్సల్స్‌తో గత రెండు నెలలుగా సాయుధ పోరాట వ్యతిరేక ప్రకటనలు చేయించింది .. మావోయిస్ట్‌ పార్టీని చీల్చింది. కొంతమంది నాయకులను తన ఆధీనంలో పెట్టుకుని ప్రభుత్వం సాయుధ పోరాట వ్యతిరేక ప్రకటనలు చేయించింది.అధికారం ఆధిపత్యం కోసం ఉద్యమ ద్రోహులుగా మారిన వారిచే మావోయిస్ట్ పార్టీని ముక్కలు చేసే కుట్రలు చేశారు. మల్లోజుల వేణుగోపాల్‌ @ సోనూ @ అభయ్‌ ను పోలీసులు తమ ఆధీనంలో ఉంచుకుని రెండు నెలలుగా భిన్న ప్రకటనలతో పార్టీని బలహీనపర్చే కుట్రలు చేశారు. మావోయిస్ట్‌ పార్టీ కూడా అభయ్‌ను గట్టిగానే మందలించింది. ఆయుధాలు వదిలి పాలక వర్గాల పంచన చేరోచ్చని, ఆయుధాలు పీల్‌జీఏలు స్వాధీనం చేసుకోవాలని పార్టీ ప్రకటించింది.

అయితే ఉద్యమ సానుభూతిపరులు, మాజీ ఉద్యమకారులు అనుమానించినట్లే ఇవాళా నిరూపితం అయింది..ఆయుధాలు పార్టీకి సరెండర్‌ చేయకుండా ప్రభుత్వానికి సరెండర్‌ చేసి రాజకీయంగా దిగజారిపోయిన అభయ్‌ అలియాస్ మల్లొజుల వేణుగోపాల్ రావు ఉద్యమ ద్రోహిగా నిలిచి పోయారు. ఇన్ని రోజులు అభయ్ @ సోను పేరిట విడుదల చేసిన లేఖలన్నీ రాజ్యం సృష్టించినవే అని చెప్పడానికి ఇంతకంటే మించిన శాస్త్రీయ అవగాహన అవసరం లేదు. మావోయిస్టు పార్టీని భౌతికంగా నిర్మూలించవచ్చు కానీ మానసికంగా నిర్మూలించలేమన్న  నిర్ణయానికి వచ్చిన రాజ్యం సైకలాజికల్ వార్ చేసింది.. పార్టీలో మానసికంగా బలహీనతలో బాధపడుతున్న వారికి ఎరగా మార్చుకుని ఇన్ని రోజులు తన ఆధీనంలో ఉంచుకుని రాజ్యమే స్వయంగా పార్టీ అధికారిక ప్రతినిధి పేరుతో అభయ్ తో లేఖలు వాయిస్ లు ఇప్పించింది అనడానికి ఇంతకన్నా ఉదాహరణ అవసరం లేదు.

అంతేకాదు ఇక మావోయిస్ట్ పార్టీ లేదని ప్రకటించేందుకు ప్రభుత్వం నానా తంటాలు పడింది..ఏకంగా వేణుగోపాల్‌ లొంగుబాటు సభ పెట్టి నక్సలిజం లేదని చెప్పే ప్రయత్నం చేసింది. అయితే నిజానికి మావోయిస్ట్‌ పార్టీని నిర్మూలించడం సాధ్యం కాకపోవడంతో పార్టీని చీల్చే ప్రయత్నం చేసింది..అదీ కూడా విఫలం అయింది. మల్లోజులతో చాలా మంది సీనియర్‌ నేతలు, పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యులు సాయుధ పోరాటం విడిచి లొంగిపోతారని రాజ్యం ప్రచారం చేసింది.

కానీ భారత పాలకులు అనుకుట్లు ఏం జరగలేదు.మల్లోజుల తప్ప సీసీ, పొలిట్‌ బ్యూరో రాష్ట్ర కమిటీ సభ్యులు ఎవ్వరూ కూడా మల్లోజులతో కలిసి రాలేదు. మావోయిస్ట్‌ పార్టీ ఒక వ్యక్తిపై ఆధారపడి త్యాగాల పంథాను ఎంచుకోలేదని, సాయుధ పోరాటం కొనసాగుతుందని మరోసారి స్పష్టం చేసింది. మల్లోజుల వంటి వారిని పార్టీ ఎంతో మందిని తయారు చేస్తుందని అందుకే ప్రభుత్వం ప్రచారం చేసినట్లు కీలక నేతలు మల్లొజులతో వెనుక లేరని స్పష్టంగా కనిపించింది.

భూమి ఉన్నన్నీ రోజులు భూ సమస్యలుంటాయి. భూ సమస్యలునన్నీ రోజులు భూ పోరాటాలుంటాయి.. భూ పోరాటాలునన్నీ రోజులు ప్రజల తిరుగుబాటు, చైతన్యం ఉంటుంది..సామాజిక రుగ్మతలునన్నీ రోజులు అసమానతలుంటాయి.. అసమానతలునన్నీ రోజులు కుల మత సామాజిక ఆధిపత్యం ఉంటుంది..ఈ ఆధిపత్యం ఉన్నన్నీ రోజులు అణచివేత ఉంటుంది..అణచివేత ఉన్నన్నీ  రోజులు  ప్రజల తిరుగుబాటు ఉంటుంది. వర్గాలున్నన్నీ రోజులు వర్గ దోపిడీ ఉంటుంది.

ఆర్థికమే ప్రధానమైన చోట శ్రమ దోపిడి కీలకమైతుంది. శ్రమ దోపిడి అధికమైనప్పుడే  మావోయిజం, కమ్యూనిజం, లెనినిజం వంటి ఆర్ధిక రాజకీయ సామాజిక సాంస్కృతిక సిద్ధాంతాలపై, హక్కులు విధులపై చర్చ మొదలైతుంది. ఫాసిజం, సామ్రాజ్యవాదం, కార్పొరేటీకరణ జడలు విప్పినప్పుడే లౌకికవాదం, ప్రజాస్వామ్యం ఆవశ్యకత ఏంటో అర్ధం అవుతుంది. ఆర్థిక సంస్థల బానిసత్వంలో బూర్జువా ప్రజాస్వామ్యం ఓ వెలుగు వెలగవచ్చు, ఇదే అసలు ప్రజాస్వామ్యం అని ప్రచారం జరగవచ్చు, కానీ బూర్జువా ప్రజాస్వామ్యం వెనుక జరుగుతున్న అసలు దోపిడీ గ్రహించనంత వరకు ప్రజలు చైతన్యం కాకపోవచ్చు. ప్రజలు చైతన్యమైన  తిరుగుబాటు చేసే ఈ మధ్య కాలంలో అనేక సిద్ధాంతాలు రావచ్చు. అనేక ప్రజా ఉద్యమాలు రావచ్చు. అనేక బూర్జువా, లెఫ్ట్, నక్సల్స్, కమ్యూనిస్టు పార్టీలు పుట్టుకు రావచ్చు. కాల గర్భంలో కలిసి పోవచ్చు.

కానీ భూ సమస్యలు, ప్రజల మధ్య సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక అంతరాలు ఉన్నన్నీ రోజులు ఏదో రూపంలో ఎక్కడో ఒకచోట తిరుగుబాటు అనేది ఉంటుంది.. ఇవాళ ఒక పార్టీ బలహీనపడిందని కుంగిపోవడమో. ఫాసిస్టు పార్టీలు బలపడుతున్నాయని బాధపడుతు కూర్చోవడం అంటే బతికున్న శవంగా, నిర్జీవంగా బతుకే అవుతుంది.ఒక చోట అణచివేత ఎక్కువైతే  అయితే మరోచోట తిరుగుబాటు తీవ్రం అవుతుంది. అప్పుడు ప్రజలే దానికి నాయకత్వం వహిస్తారు.

-తోటకూర రమేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *