హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30ః వట్టినాగులపల్లిలో భూ నిర్వాసితులకు అండగా వుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 1960 నుంచే ఇక్కడ సతీష్ షా కుటుంబానికి భూమి ఉంది. ఇప్పటి వరకు వారి పేరు మీదనే భూమి ఉంది. 60 సంవత్సరాలుగా ఈ భూమిలో వారు నివసిస్తున్నారు. వట్టినాగులపల్లి గ్రామం అభివృద్ధి చెందిన తర్వాత ఇక్కడ భూముల విలువలు భారీగా పెరిగాయి. సతీష్ షా కుటుంబానికి చెందిన ఈ భూమి సుమారు ₹1400 కోట్ల విలువ కలిగి ఉండగా దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కన్నుపడింది. మంత్రి పొంగులేటి, ఆయన కుమారుడు హర్షా రెడ్డి కలిసి స్వయంగా సతీష్ షా ఇంటికి వెళ్లి, భూమిని డెవలప్‌మెంట్‌కు ఇవ్వకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని బెదిరించారు. అయితే సతీష్ షా కుటుంబం భూమిని డెవలప్‌మెంట్‌కు ఇవ్వడానికి గానీ, అమ్మడానికి గానీ సిద్ధంగా లేమని స్పష్టంగా తెలిపింది. దీనికి తరువాత మంత్రి పొంగులేటి అరాచకాలకు తెరలేపారు. తన రెవెన్యూ శాఖలోని శ్రీనివాసులు అనే అధికారి ద్వారా, ₹100 కోట్ల లంచం కేసులో పట్టుబడిన ఏడీ (ఏడీ)తో దొంగ సర్వే చేయించి బాధితులను తీవ్రంగా వేధింపులకు గురిచేశారు. భూమిని ఇవ్వకపోతే, రెవెన్యూ సర్వే పేరుతో 27 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటామని బెదిరించారు. దీనికీ లొంగకపోవడంతో హర్షా రెడ్డి, ఆయనకు చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ గుండాలతో కలిసి, నంబర్ ప్లేట్లు లేని జేసీబీలతో వచ్చి బాధితులు నిర్మించుకున్న గోశాలను కూల్చివేశారు. దాదాపు కిలోమీటర్ మేర ఉన్న కాంపౌండ్ వాల్‌ను కూడా ధ్వంసం చేసి, బాధితులను భయభ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటన విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన సతీష్ షా, పల్లవి షా కుటుంబ సభ్యులను అక్కడే సజీవంగా పాతిపెడతామని బెదిరించి, రాత్రంతా నిలబెట్టారు. ఈ ఘటనపై పోలీసులు వద్ద ఫిర్యాదు చేయగా, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాష్ట్రపతి పతకం అందుకున్న నిజాయితీ గల పోలీస్ అధికారి హబీబుల్లాను బదిలీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి మధ్య ఉన్న వ్యాపార అనుబంధాన్ని అడ్డుపెట్టుకుని ఈ దురాగతాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌లో ఉన్న 20 లక్షల ఎకరాల భూమిని కోటి ఎకరాలకు పెంచి, నిషిద్ధ జాబితా పేరుతో ప్రజలను బెదిరిస్తూ 50 శాతం భూమి వాటా డిమాండ్ చేస్తోంది. ఇలాంటి అన్యాయాలకు గురైన బాధితులు ఎవరైనా ఉంటే తెలంగాణ భవన్‌కు వచ్చి వివరాలు ఇవ్వాలని, వారికి పార్టీ పరంగా, న్యాయపరంగా అండగా ఉంటామని తెలిపారు. అక్రమంగా క్రషర్లు ఏర్పాటు చేసి మైనింగ్ చేస్తున్న మంత్రి పొంగులేటిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్‌ను ప్రశ్నించిన మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడి చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. త్వరలో మరిన్ని కుంభకోణాలను బయటపెడతామని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



