అక్రెడిటేష‌న్ కార్డుల‌పై ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తాం

– జ‌ర్న‌లిస్టుల‌ను విడ‌దీసి చిచ్చుపెట్ట‌వ‌ద్దు
– వారిసంక్షేమాన్ని గాలికొదిలేసిన ప్ర‌భుత్వం
– రెండు కార్డుల విధానం స‌రైంది కాదు
– మాజీ మంత్రి హ‌రీష్‌రావు
హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 1: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 252ను వెంటనే సవరించాలని కోరుతూ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ టీయూడ‌బ్ల్యుజె  ప్రతినిధులు ఈరోజు మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావును  హైదరాబాద్‌లో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు హరీష్ రావు దృష్టికి పలు సమస్యలను తీసుకువచ్చారు. గతంలో ఉన్న జీవో 239 ప్రకారం సుమారు 23 వేల మందికి అక్రిడిటేషన్ కార్డులు లభించేవని, కానీ నూతన జీవో 252 వల్ల దాదాపు 13 వేల మంది జర్నలిస్టులు కార్డులు కోల్పోయే ప్రమాదం ఉందని వివరించారు. ముఖ్యంగా డెస్క్, బ్యూరో జర్నలిస్టులంటూ విభజించి, రెండు కార్డుల విధానాన్ని తీసుకురావడం వల్ల జర్నలిస్టుల మధ్య విభజన రేఖలు గీసినట్లవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై హ‌రీష్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జర్నలిస్టుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియాను గౌరవించాల్సింది పోయి వారిని అణచివేసేలా కొత్త నిబంధనలు తేవడం దుర్మార్గం. డెస్క్ జర్నలిస్టులకు వేరు రిపోర్టర్లకు వేరు అంటూ రెండు కార్డుల విధానం తీసుకురావడం జర్నలిస్టుల మధ్య చిచ్చు పెట్టడమే. వార్తను ప్రజల వరకు చేర్చడంలో డెస్క్ జర్నలిస్టుల పాత్ర కూడా కీలకం. అలాంటి వారికి అక్రిడిటేషన్ ఇవ్వకుండా కేవలం గుర్తింపు కార్డు ఇచ్చి చేతులు దులుపుకోవాలనుకోవడం వారిని కించపరచడమేన‌న్నారు.  గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా 23 వేల మందికి అక్రిడిటేషన్లు ఇచ్చి గౌరవించుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంఖ్యను 13 వేలకు కుదించాలని చూడటం అంటే.. దాదాపు 10 వేల మంది జర్నలిస్టులకు అన్యాయం చేయడమేన్నారు. కొత్త జీవో వల్ల జర్నలిస్టులు హెల్త్ కార్డులు, బస్ పాస్ సౌకర్యాలను కోల్పోయే ప్రమాదం ఉంది. జర్నలిస్టుల ఆరోగ్యం పట్ల, వారి ప్రయాణ సౌకర్యాల పట్ల ప్రభుత్వానికి పట్టింపు లేకపోవడం శోచనీయమ‌న్నారు. గతంలో జర్నలిస్టులకు 5 లక్షల ప్రమాద బీమా కల్పించి, ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించేది. ఇప్పుడు ఆ ప్రీమియం చెల్లించడంలో కూడా ప్రభుత్వం అలసత్వం వహిస్తూ అన్యాయం చేస్తున్న‌ద‌న్నారు. ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర వెలకట్టలేనిది. అందుకే కేసీఆర్ జర్నలిస్టులను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా జర్నలిస్టులకు ఆర్థిక సాయం అందించి, వారి కుటుంబాలకు అండగా నిలిచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిద‌న్నారు. ఈ జీవోపై ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని కచ్చితంగా ప్రశ్నిస్తానని హరీష్ రావు యూనియన్ నాయకులకు హామీ ఇచ్చారు. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం, జీవో 252 సవరణ కోసం టీయూడ‌బ్ల్యుజె  చేస్తున్న పోరాటానికి తన పూర్తి మద్దతు ఉంటుందని, ప్రభుత్వానికి తగు సూచనలు చేసి జర్నలిస్టులకు న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇచ్చారు. వినతిపత్రం సమర్పించిన వారిలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీ సాగర్, కోశాధికారి పి.యోగనంద్, తెంజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.రమణ కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి యార నవీన్ కుమార్, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు అవ్వారి భాస్కర్, చిన్నపత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బిజిగిరి శ్రీనివాస్, టీయూడబ్ల్యూజే హైదరాబాద్ నగర అధ్యక్షులు రాకేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్ తదితరులు ఉన్నారు.
————————————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *