– బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు లక్ష్మీనర్సయ్య
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: రైతు వ్యతిరేక విధానాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావును కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. రాష్ట్రంలో రైతులు ఆర్థికంగా, వ్యవసాయపరంగా తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందన్నారు. రైతుల సమస్యలను పట్టించుకోకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న రైతు భరోసా నిధులను ఎకరాకు రూ.15,000 చొప్పున వెంటనే విడుదల చేయాలని, రుణ మాఫీ పేరుతో రైతులను మోసం చేయడం మానేసి రుణ మాఫీ కాని రైతులందరికీ పూర్తిస్థాయిలో వెంటనే అమలు చేయాలని కిసాన్‌మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. యూరియా కొరతతో పంటలు ఎండిపోతున్న పరిస్థితిని ప్రభుత్వం గమనించి రైతులకు యూరియా నిరంతరంగా అందుబాటులో ఉండేలా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు చెల్లించాల్సిన బోనస్ డబ్బులను ఏళ్లతరబడి పెండింగ్‌లో పెట్టడం అన్యాయమని, పెండింగ్ బోనస్ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రాబోయే రబీ సీజన్‌లో వరి పంట కొనుగోలుకు ముందుగానే తగినన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయకపోతే రైతుల పక్షాన బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, ఉద్యమాలు చేపడుతుందని స్పష్టంగా తెలియజేశామని మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వాపురం లక్ష్మీనర్సయ్య తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





