గద్దర్ ఆలోచనలకు రూపం కల్పిస్తాం

– ప్రపంచ ఫిల్మ్ ఇండస్ట్రీ హబ్‌గా హైదరాబాద్
– అవార్డుల ఉత్సవాన్ని ‘న భూతో న భవిష్యత్తు’లా నిర్వహించాలి
– ఫిలిం అవార్డుల స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: వచ్చే ఉగాది రోజున గద్దర్ ఫిలిం అవార్డుల ఫంక్షన్ కార్యక్రమాన్ని న భూతో న భవిష్యత్తు అన్న విధంగా ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. ప్రపంచ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ వైపు చూసేలా ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని, అందుకవసరమైన సహాయ సహకారాలను ప్రభుత్వం సంపూర్ణంగా అందిస్తుందని అన్నారు. గద్దర్ ఫిలిం అవార్డులలో భాగంగా సినిమాల స్క్రీనింగ్ ప్రక్రియ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం ప్రసాద్ ల్యాబ్స్‌లో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక మార్పు కోసం కళలను ఉపయోగించి ప్రజల కోసం తన జీవితాన్ని ధారపోసిన మహానుభావుడు గద్దర్ అని కొనియాడారు. అందుకే ప్రజా ప్రభుత్వం ఆయన పేరిట సినిమా అవార్డులను ప్రారంభించిందని, ఇది రెండవ సంవత్సరం అని వివరించారు.  తెలుగు సినీ పరిశ్రమలోని అన్ని విభాగాలకు అవార్డులు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ కేవలం తెలుగు ఇండస్ట్రీకే కాదు దేశంలోని వివిధ భాషలకు కేంద్రంగా మారాలని ప్రజా ప్రభుత్వం గొప్ప సంకల్పంతో పనిచేస్తున్నదని తెలిపారు. ఇక్కడున్న సానుకూల వాతావరణాన్ని ఉపయోగించుకొని హైదరాబాదును ప్రపంచ సినీ కేంద్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకుని ముందుకు పోతోందన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు, శాఖ మంత్రి వెంకట్ రెడ్డి అందుబాటులో లేరని, మీ అందరినీ ప్రోత్సహించాలనేది మా అందరి ఏకైక లక్ష్యం అనే సందేశాన్ని మీ అందరికీ తెలియజేయవలసిందిగా తనకు తెలిపారని డిప్యూటీ సీఎం వివరించారు. అవార్డుల కార్యక్రమాన్ని ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు మనస్ఫూర్తిగా తీసుకొని బాధ్యతాయుతంగా ముందుకు వెళ్తున్నారని అభినందించారు. జ్యూరీ చైర్మన్ మణిశర్మని తెలియని వారు సినీ రంగంలో లేరని, తరతమ బేధాలు లేకుండా, పారదర్శకంగా సినిమాలు చూడడమే కాదు నిష్పక్షపాతంగా అవార్డుల ఎంపిక చేపట్టాలని చైర్మన్‌తోపాటు జ్యూరీ సభ్యులను కోరుతున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మణిశర్మ, ఎఫ్‌డీసీ¾ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *