– మావోయిస్టుల చావుకు అర్బన్ నక్సల్స్ కారకులు
– మీకు మరో నాలుగు నెలలు మాత్రమే గడువు
– వేములవాడలో కేంద్ర మంత్రి బండి సంచలన వ్యాఖ్యలు
వేములవాడ, ప్రజాతంత్ర, నవంబర్ 18: అర్బన్ నక్సల్స్ మాయలో పడి మావోయిస్టులు మోసపోయి ప్రాణాలు కోల్పోవద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. ఇచ్చిన మాట మేరకు వచ్చే మార్చి నాటికి మావోయిజాన్ని అంతం చేసి తీరుతారని అన్నారు. అర్బన్ నక్సల్స్ పట్టణాల్లో కుటుంబ సభ్యులతో కలిసి జల్సా చేస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా పైరవీలు చేసుకుంటూ ఆస్తులు కూడగట్టుకుని కార్లలో తిరుగుతున్నారు. వాళ్ల మాటలు నమ్మిన అమాయకులు తుపాకీ పట్టుకుని అడవుల్లో తిరుగుతూ తిండీ తిప్పలు లేక ప్రాణాలు కోల్పోతున్నారు. అర్బన్ నక్సల్స్ చెప్పేదొకటి. చేసేదొకటి. వారి మాటలు నమ్మి మోసపోవద్దు. మంచి ఆలోచనలతో సమాజంలోకి రండి. ప్రజలకు సేవ చేయండి అని పిలుపునిచ్చారు. మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవడానికి మరో నెలలు నెలల సమయం మాత్రమే ఉందని, 2026 మార్చినాటికి మావోయిజాన్ని అంతం చేసి తీరుతామని పునరుద్ఘాటించారు. తుపాకీ ద్వారా రాజ్యాధికారం సాధ్యం కాదు. తుపాకీ పట్టుకుని అమాయకులైన దళిత, గిరిజనులను చంపారు. పోలీసులను చంపారు. మా ప్రతాప రామకృష్ణను కూడా కాల్చి చంపేందుకు యత్నించారు. చావుదాకా వెళ్లొచ్చారు. జాతీయ జెండా ఎగరేయొద్దని నక్సలైట్లు బీజేపీ నేతలను ఎంతోమందిని కాల్చి చంపారు. జాతీయ జెండా ఎగరేసేటోడు భారతీయుడా? నల్లజెండా ఎగరేసేటోడు భారతీయుడా? నక్సలైట్లది ఏ సిద్ధాంతం? తుపాకీ ద్వారా మీరు సాధించిందేమిటి? మీరు సాధించిందల్లా అమాయకులను పొట్టన పెట్టుకున్నారు.. మీరూ బలైపోయారు..
మేం బ్యాలెట్ ను నమ్ముకుని ముచ్చటగా మూడోసారి దేశ ప్రజల ఆశీర్వాదంతో మోదీ ఆధ్వర్యంలో బీజేపీ అధికారంలోకి రాగలిగాం. మీరు తుపాకీ పట్టుకుని పోలీసులను, దళిత, గిరిజనులను చంపడం, మీరూ చనిపోవడం మినహా మీరు సాధించిందేమిటి? ఈ రోజు దేశంలో ఉన్నది ఆషామాషీ ప్రభుత్వం కాదు. మోదీ ప్రభుత్వం. దేశ సరిహద్దులో జవాను వద్ద, పోలీసుల వద్ద మాత్రమే తుపాకీ ఉండాలి. మావోయిస్టులు తుపాకులను వదిలి జన జీవన స్రవంతిలో కలవాలి. మావోయిజాన్ని అంతం చేయడమే మా లక్ష్యం. మావోయిస్టులు లొంగిపోవాలని అమిత్ షా అవకాశమిచ్చినా వినకుండా ప్రాణాలు కోల్పోతున్నారు. కలం పట్టి చదువుకునే అమ్మాయిలకు మాయమాటలు చెప్పి తుపాకులు పట్టి అడవుల్లోకి పంపితే తిండి తిప్పలు లేక తిరుగుతున్నారు. చనిపోతున్నారు. ఎవరైనా లొంగిపోతే వాళ్లపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారు. అమిత్ షా మాట ఇస్తే నిలబెట్టుకునే నాయకుడు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా, ఆయన భార్య సాధించిందేమిటి అని ప్రశ్నించారు. తుపాకీ వీడి జనంలోకి వచ్చే వారికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోంది. బుల్లెట్ ను నమ్ముకుంటే ప్రాణాలు తీసుకోవడం మినహా మీరు సాధించేదేమీ లేదు. బ్యాలెట్ ను నమ్ముకుంటే అధికారంలోకి రాగలమనే విషయాన్ని గుర్తుంచుకోండి అని బండి హితవు పలికారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





