– మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
పినపాక,ప్రజాతంత్ర,జనవరి 09 :రాష్ట్ర క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించే విధంగా ప్రభుత్వం క్రీడాకారులను తీర్చిదిద్దుతుందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఏడూళ్ళ బయ్యారంలో పాఠశాల క్రీడా సమాఖ్య 69వ జాతీయ కబడ్డీ పోటీల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడలు కేవలం శారీరక ఆరోగ్యానికే కాక క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారికి అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి, శిక్షణ కేంద్రాల ఏర్పాటు, నిపుణుల మార్గనిర్దేశం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న జాతీయస్థాయి కబడ్డీ పోటీలు యువతలో క్రీడాప్రతిభను వెలికితీయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి అభినందించారు. ఇలాంటి పోటీలు మరిన్ని గ్రామాలకు విస్తరించేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల మధ్య జరుగుతున్న కబడ్డీ పోటీని ప్రారంభించి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కాసేపు కబడ్డీ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, పాయం వెంకటేశ్వర్లు, మహబూబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట, డీఈవో బి.నాగలక్ష్మి, ప్రజాప్రతినిధులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు పాల్గొన్నారు.
—————————————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





