2-బిహెచ్ కే కేటాయింపులు పూర్తి చేస్తాం

– 99 రోజుల ప్రణాళికలో పట్టణాల్లో ఇండ్లకు కార్యాచరణ
– త్వరలో 1.12 లక్షల ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు
– జూన్ నాటికి మరో లక్ష  పూర్తి
– రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25: ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో అసంపూర్తిగా ఆగిపోయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తిచేయడమేగాక ఖాళీగా ఉన్న ఇండ్లను అర్హులైన నిరుపేదలకు కేటాయిస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. శాసనసభ సమావేశాల్లో బుధవారం సుమారు 22మంది సభ్యులు ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్ రూం ఇళ్లపై అడిగిన ప్రశ్నలకు ఆయన సుదీర్ఘ వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా త్వరలో ఉమ్మడి జిల్లాల పరిధిలో ప్రత్యేక సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. సమస్యలను పరిష్కరించేందుకు కొద్ది రోజుల్లో ఒక టోల్‌ఫ్రీ నెంబర్‌ను అందుబాటులోకి తెస్తామని, వీటి ద్వారా వచ్చే ప్రశ్నలకు 24 గంటల్లోగా సమాధానం చెప్పడమేగాక వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి చొరవతో తెలంగాణ ప్రాంతంలో 21లక్షల ఇండ్లు నిర్మించారని, మళ్లీ ఈ పేదల ప్రభుత్వంలోనే పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం సాగుతోందని తెలిపారు. గత ప్రభుత్వం రెండు లక్షల పైచిలుకు ఇండ్లను మంజూరు చేసి హైదరాబాద్ ప్రాంతానికి లక్ష ఇండ్లను కేటాయించగా వీటిలో 78,861 ఇండ్లు పూర్తయినా మౌలిక సదుపాయాలకు నోచుకోలేదని, 21,838 ఇండ్లు పునాదులకే పరిమితమయ్యాయని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 26 కాలనీలు అసంపూర్తిగా ఉండిపోయాయని, తాము కొత్తగా కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఇండ్లు మంజూరు చేశామంటూ రూ.738 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించామని చెప్పారు. తాము ఎలాంటి భేషజాలకు పోకుండా గతంలో అసంపూర్తిగా మిగిలిపోయిన 92వేల ఇళ్లలో 62వేల ఇళ్లు పూర్తి చేశామన్నారు. 2023 ఎన్నికలకు ముందు నాటి ప్రభుత్వం 23,500 ఇండ్లను కేటాయించగా నగరంలో వృత్తి వ్యాపారాలు చేసుకునే వారు 20-30 కి.మీ దూరంలో కేటాయించిన ఇండ్లలోకి రాలేదని, ఫలితంగా 12వేలకుపైగా ఇండ్లు ఖాళీగా ఉండిపోయాయని చెప్పారు. దీనిపై ఉన్నతాధికారులు, నాలుగు జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో మూడుసార్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహించామని, లబ్దిదారులకు మరో అవకాశాన్ని కల్పిస్తూ రెండు నెలల్లోగా వీటిలో గృహప్రవేశాలు చేయాలని నోటీసులు ఇచ్చామని తెలిపారు. ఒకవేళ వారు రాలేకపోతే సుమారు 5-10 కి.మీ పరిధిలో ఉండే అర్హులైన పేదలకు కేటాయించేందుకు నిర్ణయించామని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక-99 రోజుల కార్యక్రమంలో భాగంగా కొత్త కేటాయింపులు పూర్తి చేస్తామని సభకు తెలిపారు.

కాలనీలకు మౌలిక సదుపాయాల కోసం రూ.784 కోట్లు

2017లో చేపట్టిన కాలనీలకు మౌలిక సదుపాయాలకు సంబంధించి గతంలో రూపొందించిన అంచనాలు రద్దు చేస్తూ జీవో ఇచ్చామని, జర్నలిస్టుల కాలనీలకు కూడా మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో సుమారు 80 కాలనీలకు మౌలిక సదుపాయాల కోసం రూ.784 కోట్లు మంజూరు చేశామని, సుమారు రూ.432 కోట్లు ఖర్చు చేయగా మిగిలిన మొత్తంతోపాటు మరో రూ.270 కోట్ల వరకు అవసరం ఉంటుందని భావిస్తున్నామన్నారు. రాష్ట్రంలో తొలి విడత 4.50 లక్షల ఇండ్లు మంజూరు చేస్తూ ప్రత్యేకంగా చెంచులకు, ఐటీడీఏ పరిధిలో గిరిజనులకు 12వేల ఇండ్లను మంజూరు చేశామని తెలిపారు. గతంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తామని, ఇంతవరకు కేటాయించని ఇండ్లకు సంబంధించి పాత కాంట్రాక్టర్లు అప్పటి రేటుకు సమ్మతిస్తే వారికి పనులు అప్పగిస్తామని తెలిపారు. 99 రోజుల ప్రణాళికా కార్యక్రమంలో లబ్దిదారుల ఎంపిక పూర్తి చేస్తామని, గతంలో నిర్మాణాలు చేపట్టి ఆపివేసిన లబ్దిదారులకు మిగిలిన నిర్మాణాలకు గాను నిధులు విడుదల చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల కమిటీలకు గ్రామాల్లో సర్పంచ్ అధ్యక్షునిగా ఉంటారని, ఆయన ఆధ్వర్యంలోని కమిటీ నిరుపేదలను ఎంపిక చేస్తే కలెక్టర్ పరిశీలన, అనంతరం జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆమోదంతో కేటాయింపులు జరుగుతాయని, రానున్న కాలంలో ఈ కమిటీల్లో ఎమ్మెల్యేలకు ప్రాతినిధ్యం కల్పించేలా పరిశీలిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ఈ నెల 31నాటికి సుమారు లక్షా 12వేల ఇందిరమ్మ ఇండ్లు పూర్తయి గృహప్రవేశాలు జరగనున్నాయని, జూన్ నాటికి మరో లక్ష ఇండ్ల నిర్మాణం పూర్తవుతుందని మంత్రి పొంగులేటి ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని తెలిపారు. గతంలో గృహలక్ష్మి పధకం కింద ప్రారంభించి అసంపూర్తిగా ఆగిపోయిన ఇండ్లకు నిధులు ఇస్తామని, దీనిపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకోవలసి ఉందని తెలిపారు. జీహెచఎంసీ పరిధిలో ఇండ్ల నిర్మాణానికి ఇప్పటికే 14-15 స్దలాలను గుర్తించామని, ఆయా ప్రాంతాల్లోని నిరుపేదలకు ఇండ్లు ఇస్తామని, రాష్ట్రంలోని ఇతర ముఖ్య పట్టణాల్లో కూడా ఇదే పద్ధతిని అమలు చేస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

మంచి పథకం : ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి 

ఎమ్మెల్యే కె.వెంకటరమణా రెడ్డి జోక్యం చేసుకుంటూ ఇందిరమ్మ ఇల్లు మంచి పథకమన్నారు. వీటి వల్ల పేదలకు లబ్ది జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో కట్టిన డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇల్లు నాసిరకంగా ఉండడంతో శిథిలావస్థకు చేరాయని విమర్శించారు. ఇప్పటికే పూర్తయి ఎవరికి కేటాయించని డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇళ్లలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి జోక్యం లేకుండా పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందేలా చొరవ చూపాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌లో ఎన్ని డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్లు నిర్మించారని ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ప్రభుత్వాన్ని ‌ప్రశ్నించారు. ఇప్పటికే పూర్తయి ఎవరికీ కేటాయించని డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్లు వీలైనంత త్వరగా లబ్దిదారులకు అందజేయాలని సూచించారు. ఖైరతాబాద్‌లో 5 ప్రాంతాల్లో డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇళ్లు కట్టేందుకు శంకుస్థాపన చేశారని  ఆయన గుర్తు చేశారు. వీలైనంత త్వరగా వాటిని పూర్తి చేయాలని కోరారు. బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో లక్ష డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్లు నిర్మించిందని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గుర్తు చేశారు. చిన్నచిన్న రిపేర్ల కారణంగా వేల డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్లు ఇంకా లబ్దిదారులకు అందజేయలేదన్నారు. బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంలో పార్టీని దృష్టిలో పెట్టుకుని డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌లు ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం ఇందిరమ్మ కమిటీలు చెప్పే వారికే ఇళ్లు ఇస్తామంటున్నారని సబిత మండిపడ్డారు. అల్లుడు వస్తే ఏడుంటడు, బిడ్డ వస్తే ఏడుంటడు అని గతంలో మాట్లాడిన కేసీఆర్‌ ‌గత పదేళ్ళలో అసలైన పేదలకు ఇళ్లు ఇవ్వలేదని  ఎమ్మెల్యే వంశీ కృష్ణ మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లకు సైతం కాలం చెల్లడంతో శిథిలావస్థకు చేరాయన్నారు. వారికి సైతం ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. జాయింట్‌ ‌ఫ్యామిలీని రీ ఎంక్వరీ చేసి ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు బ్జడెట్‌లో రూ. 5 వేల కోట్లు కేటాయించారని, ఇంకా పూర్తి కాని వాటికే  సరిపోవని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ ‌రెడ్డి అన్నారు. వచ్చే ఏడాది కేటాయించిన ఇళ్లకు నిధులు ఎలా ఇస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇంతలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జోక్యం చేసుకుని రాజేశ్వర్‌ ‌రెడ్డి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గానికి నాలుగున్నర లక్షల ఇళ్లు అని మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. నియోజకవర్గానికి అన్ని ఇళ్లు ఉంటాయా అంటూ సందేహం వ్యక్తం చేశారు. సభను పక్కదారి పట్టించడమే ఎజెండాగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల కోసం పెట్టిన బ్జడెట్‌ను బీఆర్‌ఎస్‌ ‌విమర్శిస్తుందా అంటూ ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. బడ్జెట్‌ ‌పుస్తకాలను చించి పేదలను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అవమానించారంటూ భట్టి నిప్పులు చెరిగారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *