అమెరికా ఆర్థిక సంస్థలపై దాడులు చేస్తాం

– ఇరాన్‌ ‌హెచ్చరిక

టెహ్రాన్‌,‌ మార్చి 11: ఇరాన్‌- ఇ‌జ్రాయెల్‌, అమెరికా మధ్య యుద్ధం 12వ రోజుకు చేరుకుంది. ఈ సమయంలో యుద్దాన్ని మరింత తీవ్రం చేసేందుకు సిద్దమని ఇరాన్‌ ‌ప్రకటించింది. ఇకపై అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన ఆర్థిక సంస్థలు, బ్యాంకులపై దాడులు చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్‌ ‌మిలిటరీ సెంట్రల్‌ ఆపరేషనల్‌ ‌కమాండ్‌ ‌ఖాటమ్‌ అల్‌ అన్బియా ఒక ప్రకటన విడుద‌ల చేశారు. ప్రజలు ఈ సంస్థ‌లు, బ్యాంకులకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. తాజాగా ఇరాన్‌ ‌రాజధాని టెహ్రాన్‌లోని ఒక కీలక బ్యాంకుపై ఇజ్రాయెల్‌ అర్ధరాత్రి దాడి చేసింది. ఈ ఘటనలో చాలామంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ఇరాన్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేసింది. ఇకపై తాము కూడా ఇలాగే అమెరికా, ఇజ్రాయెల్‌లకు చెందిన ఆర్థిక సంస్థలు, బ్యాంకులపై దాడి చేస్తామని, అక్కడి ప్రజలు ఆ ప్రదేశాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. ఇజ్రాయెల్‌ ‌తమ బ్యాంకులపై దాడి చేయడం ద్వారా తాము కూడా అలాంటి సంస్థలపై దాడులు చేసేందుకు తగిన కారణాన్ని ఇచ్చిందని ఇరాన్‌ ‌తెలిపింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ ‌సహా గల్ఫ్ ‌దేశాల్లోని అమెరికాకు చెందిన సంస్థలపై దాడులు చేసేందుకు ఇరాన్ ‌సిద్ధమవుతోంది. ఈ దాడులకు సంబంధించి అమెరికన్‌ ‌సంస్థల టార్గెట్‌ ‌లిస్టును ప్రకటించింది. ఇందులో ప్రముఖ అమెరికన్‌ ‌టెక్‌ ‌కంపెనీలు, ఇన్‌‌ఫ్రా కంపెనీలున్నాయి. గూగుల్‌, ‌మైక్రోసాప్ట్, ఐబీఎం, పాలంటిర్‌, ‌నివిడియా, ఒరాకిల్‌ ‌వంటి సంస్థలున్నాయి. ఈ సంస్థలు గల్ఫ్ ‌కంట్రీస్‌లో, ఇజ్రాయెల్‌లలో పలు ఆఫీసుల నుంచి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతానికి ఇరాన్‌, ఇ‌జ్రాయెల్‌ ఒకదానిపై ఒకటి చమురు సంస్థలు, ఆర్థిక కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసుకుంటున్నాయి. యుద్ధం కారణంగా హోర్ముజ్‌ ‌జలసంధి నుంచి చమురు రవాణా నిలిచిపోవడంతో ఇండియా, చైనా వంటి పలు ఆసియా దేశాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.

హర్ముజ్‌ ‌వద్ద ఇరాన్‌కు చెందిన 16 మైన్‌లేయర్స్,‌ పలు నౌకలు ధ్వంసం

చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్‌ ‌జలసంధి సమీపంలో భీకర దాడులు జరిగాయి. ఈ జలసంధి సమీపంలో ఇరాన్‌ ‌మోహరించిన మైన్‌లేయర్స్, ‌నౌకలు లక్ష్యంగా అమెరికా దళాలు విరుచుకుపడ్డాయి. దీంతో అవి ధ్వంసమయ్యాయి. తాము జరిపిన దాడుల్లో ఇరాన్‌ ‌కు చెందిన 16 మైన్‌లేయర్స్‌తోపాటు పలు నౌకలు ధ్వంసం అయ్యాయని యూఎస్‌ ‌సెంట్రల్‌ ‌కమాండ్‌ ‌పేర్కొంది. ఈ దాడికి సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్టు చేసింది. జలసంధిలో పేలుడు సృష్టించడానికి ఇరాన్‌ ‌సన్నాహాలు చేస్తున్నట్లు అమెరికా నిఘా వర్గాలకు సమాచారం అందిందని ఆ దేశ మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇరాన్‌కు గట్టి హెచ్చరికలు చేశారు. జలసంధి సమీపంలో ఇరాన్‌ ఎక్కడైనా మైన్స్‌ను అమర్చినట్లయితే వాటిని తక్షణమే తొలగించాలని ట్రూత్‌ ‌సోషల్‌లో పేర్కొన్నారు. లేదంటే పర్యవసానాలు చాలా తీవ్రంగా, మునుపెన్నడూ చూడని స్థాయిలో ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్‌ ‌స్వయంగా వాటిని తీసేస్తే అది మంచి పరిణామం అన్నారు. లేదంటే కరేబియన్‌ ‌సముద్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా నౌకలను ధ్వంసం చేసేందుకు ఉపయోగించిన క్షిపణులను వాడి జలసంధిలోని మైన్‌లేయర్స్ ‌పడవలను లక్ష్యంగా చేసుకుంటామన్నారు. ట్రంప్‌ ‌హెచ్చరికల తర్వాత ఇరాన్‌ ‌మైన్‌లేయర్స్‌ను ధ్వంసం చేసినట్లు యూఎస్‌ ‌సెంట్రల్‌ ‌కమాండ్‌ ‌ప్రకటించింది.
ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా చమురును కొనుగోలు చేసేందుకు భారత్‌కు ఇచ్చిన అనుమతి వల్ల పుతిన్‌ ‌సర్కార్‌కు పెద్దగా ఆర్థిక ప్రయోజనం ఉండదని శ్వేతసౌధం ప్రకటించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *