– ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతాం
– అధికారంలోకి రావడం ఖాయం
– తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: తన కొత్త రాజకీయ పార్టీ ప్రకటనకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముహూర్తం ఖరారు చేశారు. మే నెల మొదటి వారంలో మంచి రోజు చూసుకుని పార్టీని అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు. పార్టీ పేరులో తెలంగాణ అనే పదం తప్పనిసరిగా ఉంటుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తన మొదటి ఛాయిస్ సిద్దిపేట అని, రెండో ఛాయిస్ బోధన్ అని పేర్కొన్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలో బీజేపీ ఉండదని, ప్రధాన ప్రతిపక్షంగా తామే అవుతామని, ప్రజల సమస్యలపై పోరాటం చేస్తామని ఆమె తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తామే వస్తామని చెప్పారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలతోపాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ దారిలోనే వెళ్తోందని, కొత్త తరహా రాజకీయం చేయడం లేదని విమర్శించారు. ప్రాంతీయ పార్టీలు లీడర్ సెంట్రిక్‌గా ఉంటాయని, కానీ వ్యవస్థ నిర్మాణం జరగాలని, సైద్దాంతిక పునాది ఉండాలని కవిత అన్నారు. మహిళలను అవమానించవద్దన్నారు. వైఎస్ షర్మిలారెడ్డి నేడు ఏపీలో ఒక జాతీయ పార్టీకి అధ్యక్షురాలిగా ఉన్నారని.. కానీ తెలంగాణలో ఆమె పార్టీ పెట్టడం ప్రజలకు నచ్చలేదని తెలిపారు. చిరంజీవి పార్టీ పెట్టి మూసివేయలేదా అని ప్రశ్నించగా ’నా లైన్‌లో నేను వెళ్తున్నా.. నా ప్రయత్నం నాది’ అని అన్నారు. తెలంగాణ వాదమే తమ పార్టీ మొదటి లైన్ అని తేల్చిచెప్పారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్ప్పుడు కిందిస్థాయి నుంచి వచ్చినవారు కేంద్ర మంత్రులు అయ్యారని గుర్తు చేశారు. తన పార్టీలో కొత్త తరానికి అవకాశాలు ఉంటాయని కవిత పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





