ములుగు అభివృద్ధికి అటవీ శాఖ గ్రీన్‌ సిగ్నల్‌

– దశాబ్దాల రహదారి సమస్యలకు చరమ గీతం
– రాష్ట్ర వైల్డ్‌ లైఫ్‌ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు
– మంత్రి సీతక్క సుదీర్ఘ పోరాటానికి దక్కిన ఫలితం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క దీర్ఘకాలంగా చేస్తున్న పోరాటానికి ఫలితంగా రాష్ట్ర వైల్డ్‌ లైఫ్‌ బోర్డు 9వ సమావేశంలో ములుగు ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. రాష్ట్ర సచివాలయంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితురాలిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి, వైల్డ్‌ లైఫ్‌ ప్రాంతాల గుండా రోడ్లు, ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్స్‌, సబ్‌స్టేషన్ల నిర్మాణం, స్టాండిరగ్‌ కమిటీ ఏర్పాటు వంటి అనేక అంశాలపై చర్చ జరిగింది. మహబూబాబాద్‌ జిల్లా పాకాల కొత్తగూడెంలో 30 పడకల హాస్పిటల్‌ నిర్మాణానికి 0.80 హెక్టార్ల అటవీ భూమిని బదిలీ చేయడంపై నిర్ణయం తీసుకున్నారు. నివాస ప్రాంతాల్లో అటవీ జంతువుల కట్టడి కోసం నాలుగు క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్‌లు ఏర్పాటు చేయాలని, ఎకో టూరిజాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని, అరణ్య భవన్‌లో ప్రత్యేకంగా టైగర్‌ సెల్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మంత్రి సీతక్క ప్రతిపాదనలకు వైల్డ్‌ లైఫ్‌ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ప్రధానంగా కంతనపల్లి, లవ్వాల్‌, కొండపర్తి, కొడిశెల, ఐలాపురం, పాకాల కొత్తగూడెం నుండి దుబ్బగూడెం వరకు రహదారుల నిర్మాణం కోసం చాలాకాలంగా సీతక్క పోరాడున్నారు. కానీ అటవీ, పర్యావరణ చట్టాల కారణంగా రహదారుల నిర్మాణానికి అటవీ శాఖ అడ్డు చెబుతోంది. సోమవారం జరిగిన రాష్ట్ర వైల్డ్‌ లైఫ్‌ బోర్డు సమావేశం ఎట్టకేలకు ఆయా రహదారుల నిర్మాణానికి అంగీకారం తెలిపింది. తాడ్వాయి, ఏటూరునాగారం ప్రాంతాల్లో ఎకో టూరిజం అభివృద్ధి కోసం ప్రత్యేక సఫారీ వాహనాలకు బోర్డు అనుమతులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అడవులతో ఆదివాసీల జీవితం అనుసంధానమై ఉందని, వారి అభివృద్ధికి చట్టాలు అడ్డుకాకూడదని అన్నారు. పోడు భూములకు సరైన సరిహద్దులు గుర్తించాలని, అటవీ భూమి పేరుతో ఆదివాసీలకు ఇబ్బందులు కలిగించకూడదని, వారి జీవితాన్ని కాపాడాలంటే వారి అవసరాలకనుగుణంగా చట్టాల అమలు అవసరమని, తమ ప్రాంతాల్లో రహదారులు లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదు అని స్పష్టం చేశారు. రిజర్వ్‌ ఫారెస్ట్‌ ఏరియాల్లో ఉన్న ఆవాసాలకు విద్యుత్‌, హాస్పిటల్‌ వంటి మౌలిక వసతులు కల్పించడానికి అభ్యంతరాలు ఎందుకని అటవీ శాఖ అధికారులను ప్రశ్నించారు. పోడు భూముల సాగుకు అవసరమయ్యే విద్యుత్‌ కనెక్షన్ల మంజూరును అడ్డుకోవద్దని సూచించారు. పోడు రైతుల అభ్యంతరాలు తెలుసుకునేందుకు జిల్లా అటవీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. కాగా, ములుగు ప్రాంత అభివృద్ధికి సహకరించిన అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖకు, వైల్డ్‌ లైఫ్‌ బోర్డు సభ్యులకు మంత్రి సీతక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ములుగు ప్రజలకు ఏటూరునాగారంలో టోల్‌ చార్జీలు వసూలు చేయొద్దని మంత్రి సీతక్క ప్రతిపాదించగా అటవీ శాఖ మంత్రి సురేఖ ఆదేశాలతో వైల్డ్‌ లైఫ్‌ బోర్డు ఆమోదం తెలిపింది. సమావేశంలో ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, మురళి నాయక్‌, వెడ్మ బొజ్జు పటేల్‌, రాందాస్‌ నాయక్‌లు పాల్గొన్నారు. అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్‌ నదీం, పీసీసీఎఫ్‌ సువర్ణ, పలువురు అధికారులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *