– సీఎం రేవంత్‌ను ప్రశ్నించిన కేంద్ర మంత్రి బండి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25: అసెంబ్లీ, పార్లమెంట్ సీట్ల సంఖ్య పెంపుతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టమేమీ ఉండదని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. మహిళలకు చట్ట సభల్లో 33 శాతం సీట్లు కేటాయిస్తే మీకొచ్చిన నష్టమేంటి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. దక్షిణాదిపై కేంద్రం వివక్ష చూపుతోందని, పోరాటానికి దక్షిణాది రాష్ట్రాలు సిద్ధం కావాలంటూ డి-లిమిటేషన్, 50 శాతం ఎంపీ స్థానాల పెంపుపై రేవంత్ రెడ్డి మంగళవారం చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. మీడియాతో బుధవారం మాట్లాడుతూ ప్రాంతీయ అసమానతల పేరు చెప్పి ఇంకెన్నాళ్లు చలి కాచుకుంటారని నిలదీశారు. దేశాన్ని విభజించాలని చూస్తున్నారా.. దేశభక్తి, జాతీయ వాదం మీలో మచ్చుకైనా కనిపించవా అని అడిగారు. దక్షిణాదిలోని తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కూటమి ఓడిపోతుందనే వణుకు మీలో మొదలైందా అని ఎద్దేవా చేశారు. ఎన్ని గిమ్మిక్కులు చేసినా కాంగ్రెస్ పాచిక తమిళనాడు, కేరళలో పారడం లేదని అర్ధమైంది.. అందుకే దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని కొత్త డ్రామా మొదలు పెట్టారా అని నిలదీశారు. తమిళనాడు, కేరళ ప్రజలు విజ్ఞులు.. కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధమయ్యారన్నారు. మీకు, కాంగ్రెస్ పార్టీకి మహిళలంటే ద్వేషం.. అందుకే 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మహిళలకు 33 శాతం సీట్లు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కాపీలను చింపిన ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీలతో అంటకాగుతున్నారన్నారు. మీరెన్ని కుట్రలు చేసినా, విభజన రాజకీయాలు చేసినా మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తామని సంజయ్ స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





