“రేవంత్ రెడ్డి, మొదటి నుంచి తెలంగాణ సాంస్కృతిక ప్రతీకల విషయంలో సున్నితత్వం లేకుండా వ్యవహరిస్తూ వస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం కొత్త రూపకల్పన కానీ, సెక్రటేరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహస్థాపన కానీ, రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాల మార్పుకానీ ఉద్యమకారులకు, తెలంగాణ సమాజానికి చాలా మనస్తాపం కలిగించాయి. ప్రత్యర్థులు రేవంత్‌రెడ్డిని చంద్రబాబుతో ముడిపెట్టి విమర్శిస్తుంటారు. ఆయన కూడా అందుకు తగినట్టుగానే వ్యవహరిస్తే, ఇక అదే అభిప్రాయం స్థిరపడిపోతుంది. కెసిఆర్‌ను తెలంగాణ ఓటర్లు తిరస్కరించారంటే అర్థం తెలంగాణ వాదాన్ని తిరస్కరించారని కాదు. బహుశా, రేవంత్ ఆ అభిప్రాయంలో ఉండి, తెలంగాణను పూర్తిగా ప్రక్షాళన చేద్దామ నుకుంటున్నారేమో, అది పొరపాటు. కెసిఆర్‌లో తెలంగాణతనం లోపిస్తున్నందువల్లనే ఆయనకు ఓటమి అందించారు. వరుస చర్యల ద్వారా సమైక్యవాద వ్యవహారసరళిని పదేపదే ప్రదర్శిస్తే, అది రేవంత్‌కు రాజకీయంగా చాలా నష్టం చేస్తుంది.”

రేవంత్ రెడ్డి ఆలోచనావిధానం ఏమిటో, ఆయనకు, ఆయన సలహాదారులకు అసలు ఏదైనా ఆలోచన కానీ, విధానం కానీ ఉన్నాయో లేదో తెలియదు. ఎన్టీయార్, రోశయ్య విగ్రహాల సందర్భంగా, తెలంగాణవాదుల నుంచి వచ్చిన అభ్యంతరాలు, విమర్శలు తెలిసిఉండీ, మళ్లీ, గిల్లికజ్జాలు పెట్టుకునే తరహాలో ఎందుకు రేవంత్ వ్యవహరిస్తున్నారో అర్థం కాదు. రవీంద్రభారతిలో విగ్రహస్థాపనకు అనుమతించడం ద్వారా, బాలసుబ్రహ్మణ్యానికి అగౌరవం కలిగే పరిస్థితి కల్పించారు. ఎస్పీబీని బోనులో నిలబెట్టి, అర్జంటుగా ఆయన మీద తీర్పులు వెలువరించాలని తెలంగాణవాదులకు ఆసక్తి ఎందుకు ఉంటుంది? అందరు తెలుగువాళ్ల లాగే, తెలంగాణ ప్రజలు కూడా ఆయన పాటలు ఇష్టంగా వింటారు. ఆయనకు అన్ని చోట్లా అభిమానులున్నట్టే ఇక్కడా ఉంటారు.
ఆయనకు విగ్రహం ఉండాలా లేదా, అందుకు ఆయనకు యోగ్యత ఉందా లేదా అన్న చర్చ ఎవరూ చేయడం లేదు. చేయక్కరలేదు. నిర్దిష్టకాలంలో, నిర్దిష్టస్థలంలో ఆయన విగ్రహం ఏర్పాటు గురించిన ప్రశ్న మాత్రమే వివాదంలో ఉన్నది. ఈ వివాదం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సమాజానికి సంబంధించినది కాదు. వారు ఇందులో కల్పించుకోవడం ఆవాంఛనీయం కూడా. ఇది తెలంగాణ ప్రభుత్వానికి, ఉద్యమసమాజానికి జరుగుతున్న సంవాదం. ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటు తరువాత అయినా, వివిధ రంగాల తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు, స్మారకాలు ఏర్పాటు కావాలి కదా అన్నది ఒక కనీసమైన ఆకాంక్ష. ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోవాలి. కనీసం ప్రభుత్వ స్థలాలలో అయినా ప్రాంతీయన్యాయాన్ని అమలుచేయాలి. అట్లా చేయకపోగా, తెలంగాణ ఉద్యమంలో ప్రముఖంగా వినిపించిన ఆవేదనే ఇంకా కొనసాగుతూ ఉంటే, ఉమ్మడిరాష్ట్రంలో ఉండిన ఆనవాయితేయే కొనసాగితే, ఇక ప్రత్యేక రాష్ట్రం సాధించిందేమిటి? కాలం విశాలమైనది, స్థలాలకూ కొదవలేదు. తెలంగాణ ప్రతీకలను తగినంతగా సెలబ్రేట్ చేసుకున్నతరువాత, ఇతరులకు చోటివ్వడంలో ఏ అభ్యంతరాలూ ఉండవు. విగ్రహాలైనా చిహ్నాలైనా గౌరవంతో వెలియాలి కానీ, వివాదాల మధ్య కాదు.
కానీ, రేవంత్ రెడ్డి, మొదటి నుంచి తెలంగాణ సాంస్కృతిక ప్రతీకల విషయంలో సున్నితత్వం లేకుండా వ్యవహరిస్తూ వస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం కొత్త రూపకల్పన కానీ, సెక్రటేరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహస్థాపన కానీ, రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాల మార్పుకానీ ఉద్యమకారులకు, తెలంగాణ సమాజానికి చాలా మనస్తాపం కలిగించాయి. ప్రత్యర్థులు రేవంత్‌రెడ్డిని చంద్రబాబుతో ముడిపెట్టి విమర్శిస్తుంటారు. ఆయన కూడా అందుకు తగినట్టుగానే వ్యవహరిస్తే, ఇక అదే అభిప్రాయం స్థిరపడిపోతుంది. కెసిఆర్‌ను తెలంగాణ ఓటర్లు తిరస్కరించారంటే అర్థం తెలంగాణ వాదాన్ని తిరస్కరించారని కాదు. బహుశా, రేవంత్ ఆ అభిప్రాయంలో ఉండి, తెలంగాణను పూర్తిగా ప్రక్షాళన చేద్దామనుకుంటున్నారేమో, అది పొరపాటు. కెసిఆర్‌లో తెలంగాణతనం లోపిస్తున్నందువల్లనే ఆయనకు ఓటమి అందించారు. వరుస చర్యల ద్వారా సమైక్యవాద వ్యవహారసరళిని పదేపదే ప్రదర్శిస్తే, అది రేవంత్‌కు రాజకీయంగా చాలా నష్టం చేస్తుంది.
“మనోభావాలను గౌరవించడం, సాంస్కృతిక అంశాలను గమనింపులో పెట్టుకోవడం, ప్రజల ఉద్వేగాలతో చెలగాట మాడకపోవడం- రాజకీయ నాయకత్వం నేర్చుకోవాలి. కొంచెం తడి కూడా లేని ప్రభుత్వపాలన, కేవల యాంత్రికపాలన అవుతుంది. ప్రజలను విస్మరించిన ‘విజన్’ లు ఎప్పుడూ విజయం సాధించలేవు. నాలుగో నగరంలో జరగబోయే సమ్మిట్ విధానపత్రాన్ని చూస్తే, విఫలమైన విజన్ 2020 గుర్తుకు వస్తుంది. ఓ ఆర్ ఆర్ లోపల అంతా పట్టణీకరణ, ఆ తరువాత ఆర్‌ఆర్‌ఆర్ దాకా పారిశ్రామికీకరణ, ఆ పైన ఏమైనా మిగిలితే వ్యవసాయ తెలంగాణ ఉంటుంది. ఎగుమతి ఆధారిత వ్యవసాయం అట. ఐటీ పరిశ్రమలు, ఫార్మాలు, రియలెస్టేట్‌లు.. ఇటువంటి మాటలే తప్ప, తెలంగాణ స్థానిక జీవనాధారాల మెరుగుదలకు, స్థానిక వనరుల ఆధారంగా పరిశ్రమలకు, స్థానిక నైపుణ్యాల ఆధారంగా ఉపాధికి ఏ ఆలోచనలు లేవు. రాహుల్ గాంధీ ఈ సదస్సుకు వచ్చి, తాను చెప్పే గొప్పగొప్ప ఆదర్శాలను మళ్లీ వల్లిస్తే, అది కులగణన ప్రచారమంత వైరుధ్యంతో ఉంటుంది.”
భావోద్వేగాలు రాజకీయాలలో చాలా ముఖ్యపాత్ర వహిస్తాయని పదేళ్ల భారతదేశచరిత్రను చూసి అయినా అర్థం చేసుకోవాలి. రాజకీయ ప్రాతినిధ్యం పెంచుకోవాలని, సాధికారతను క్రమంగా అందుకోవాలని తపిస్తున్న వెనుకబడిన కులాల వారి ఆకాంక్షను గుర్తించినట్టుగానే వ్యవహరిస్తూ, మభ్యపెట్టి, మాయచేసే తరహాలో భావోద్వేగాలకు పైపూత వేయాలని అనుకుంటే, అది ఎప్పుడో ఒకప్పుడు తీవ్రమైన కల్లోలానికి దారితీస్తుందని తెలంగాణ కాంగ్రెస్‌తో పాటు, అన్ని రాజకీయపార్టీలు ఇప్పటికైనా గ్రహించాలి. ఒకవైపు రాహుల్‌గాంధీ, కులగణనలోను, బిసిలకు అవకాశాలు పెంచడంలోను తెలంగాణను నమూనాగా చెబుతూ దేశమంతా ప్రచారం చేస్తూ ఉంటే, తెలంగాణలో జరుగుతున్నది మాత్రం కేవలం ‘ప్రదర్శన’! సుప్రీంకోర్టు ఏమి చెబుతుందో తెలుసు, తీర్మానాలకు, ఆర్డినెన్సులకు ఎంత చెల్లుబాటు ఉంటుందో తెలుసు. 42 శాతానికి ఉన్న అవరోధాలేమిటో తెలుసు. పార్టీపరంగా అమలుచేయడానికి కూడా మనసురాని అగ్రకులాధిక్య రాజకీయాలూ తెలుసు. అయినా ఎందుకు మభ్యపెడతారు? అన్ని పార్టీలూ తమ తమ చట్రాల్లోని బిసి నాయకులను ముందుకు తోసి ఎందుకు నాటకాలు నడిపిస్తున్నాయి? సాయి ఈశ్వరాచారి ఆత్మాహుతికి కారకులెవరు? తెలంగాణవాదం స్థాయిలో బిసివాదం ఇంకా వెనుకబడిన శ్రేణుల్లో ఇంకలేదు కాబట్టి, అంతటి భావోద్వేగం చెలరేగలేదు కాబట్టి, సరిపోయింది కానీ, లేకపోతే, చారి ఆత్మత్యాగం, ప్రభుత్వంలో, మొత్తంగా రాజకీయవ్యవస్థలో, భూకంపం పుట్టించి ఉండేది! పర్యవసానాలను ఊహించకుండా, చిత్తశుద్ధి లేని భావోద్వేగాలను రగిలించి, లాభపడదామని చూసే పార్టీలు, ఈ సందర్భంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, తాము చేస్తున్నది ఎంతటి నేరమో ఆత్మపరిశీలన చేసుకోవాలి!
ఈశ్వరాచారి ఆత్మాహుతి, ప్రస్తుతానికి కొంత కన్నీరు, కొన్ని కల్లబొల్లి మాటలతో విస్మృతిలోకి జారిపోవచ్చును కానీ, న్యాయమైన ప్రాతినిధ్యం కోసం జరిగే పోరాటాలలో అతను జ్ఞాపకం వస్తూనే ఉంటాడు. రాజీలు పడుతున్న ఉద్యమకారులను నైతికంగా నిలదీస్తాడు, పోరాటవాదులకు స్ఫూర్తిగా నిలుస్తాడు. అతను చేసినటువంటి అనాలోచిత సాహసం ఎవరూ చేయకూడదు కానీ, అతని మరణం వేసిన ప్రశ్నలను ఎదుర్కొని తీరాలి.
మనోభావాలను గౌరవించడం, సాంస్కృతిక అంశాలను గమనింపులో పెట్టుకోవడం, ప్రజల ఉద్వేగాలతో చెలగాటమాడకపోవడం- రాజకీయ నాయకత్వం నేర్చుకోవాలి. కొంచెం తడి కూడా లేని ప్రభుత్వపాలన, కేవల యాంత్రికపాలన అవుతుంది. ప్రజలను విస్మరించిన ‘విజన్’ లు ఎప్పుడూ విజయం సాధించలేవు. నాలుగో నగరంలో జరగబోయే సమ్మిట్ విధానపత్రాన్ని చూస్తే, విఫలమైన విజన్ 2020 గుర్తుకు వస్తుంది. ఓ ఆర్ ఆర్ లోపల అంతా పట్టణీకరణ, ఆ తరువాత ఆర్‌ఆర్‌ఆర్ దాకా పారిశ్రామికీకరణ, ఆ పైన ఏమైనా మిగిలితే వ్యవసాయ తెలంగాణ ఉంటుంది. ఎగుమతి ఆధారిత వ్యవసాయం అట. ఐటీ పరిశ్రమలు, ఫార్మాలు, రియలెస్టేట్‌లు.. ఇటువంటి మాటలే తప్ప, తెలంగాణ స్థానిక జీవనాధారాల మెరుగుదలకు, స్థానిక వనరుల ఆధారంగా పరిశ్రమలకు, స్థానిక నైపుణ్యాల ఆధారంగా ఉపాధికి ఏ ఆలోచనలు లేవు. రాహుల్ గాంధీ ఈ సదస్సుకు వచ్చి, తాను చెప్పే గొప్పగొప్ప ఆదర్శాలను మళ్లీ వల్లిస్తే, అది కులగణన ప్రచారమంత వైరుధ్యంతో ఉంటుంది.
“హరగోపాల్ గారు ఎప్పుడూ చెబుతుంటారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో కెసిఆర్‌ను కలిసినప్పుడు ఆయన ఒక హితవు చెప్పారట. ‘చరిత్ర మీకు గొప్పఅవకాశం ఇచ్చింది, ఒక రాష్ట్రాన్నిసాధించడంలో పాత్ర వహించారు. ఆ రాష్ట్రాన్ని నడపడంతో ప్రజల ఆమోదం దొరికింది. దాన్ని సద్వినియోగం చేసుకోండి’ – అని. ఆ మాటను కెసిఆర్ ఎంతవరకు చెవిన పెట్టారో, ఎంతమేరకు తనకు దొరికిన అపూర్వావకాశాన్ని వినియోగించుకున్నారో పక్కనబెడదాం. రేవంత్‌రెడ్డికి కూడా చరిత్ర గొప్పఅవకాశాన్నే ఇచ్చింది. కెసిఆర్ ను కాదని ఆయనను తెలంగాణ ప్రజలు ఎంచుకున్నారంటే, అదొక అనూహ్యమైన పరిణామం. దాన్ని ఆయన సద్వినియోగం చేసుకుని, చరిత్రలో చిరస్థాయిగా నిలబడాలని ఆయన ప్రయత్నించవచ్చు. లేదా, ప్రజల మనస్సులను, ఆకాంక్షలను, అభీష్టాలను ఖాతరు చేయకుండా, తనకు తోచిన పద్ధతిలో, లేదా, లోకమంతా నడిచే పద్ధతిలో నడిస్తే,అది ఆయన ఇష్టం.”
దురదృష్టం ఏమిటంటే, తెలంగాణ ప్రతీకల విషయంలోను, బిసి ఆకాంక్షల విషయంలోను, అభివృద్ధి నమూనా విషయంలోను బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి పెద్దగా తేడా లేదు. కాకపోతే, కెసిఆర్ హయాంలో కనీసం కొన్ని వల్లింపులు ఉండేవి. ఉభయపక్షాలూ ఇప్పుడు తెలంగాణలోని ప్రవాసప్రజలను ఆకట్టుకోవడం ముఖ్యంగా భావిస్తున్నారు. పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యల మీద, విగ్రహాల వివాదం మీద, బిఆర్‌ఎస్, గోరువెచ్చటి స్పందనలను గుర్తించవచ్చు. తెలంగాణ స్థానికులుగా మారిపోయిన ఒకనాటి ప్రవాసులు, విగ్రహవివాదాల వంటి వాటిని కోరుకోవడం లేదు.
హరగోపాల్ గారు ఎప్పుడూ చెబుతుంటారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో కెసిఆర్‌ను కలిసినప్పుడు ఆయన ఒక హితవు చెప్పారట. ‘చరిత్ర మీకు గొప్పఅవకాశం ఇచ్చింది, ఒక రాష్ట్రాన్నిసాధించడంలో పాత్ర వహించారు. ఆ రాష్ట్రాన్ని నడపడంతో ప్రజల ఆమోదం దొరికింది. దాన్ని సద్వినియోగం చేసుకోండి’ అని. ఆ మాటను కెసిఆర్ ఎంతవరకు చెవిన పెట్టారో, ఎంతమేరకు తనకు దొరికిన అపూర్వావకాశాన్ని వినియోగించుకున్నారో పక్కనబెడదాం. రేవంత్‌రెడ్డికి కూడా చరిత్ర గొప్పఅవకాశాన్నే ఇచ్చింది. కెసిఆర్ ను కాదని ఆయనను తెలంగాణ ప్రజలు ఎంచుకున్నారంటే, అదొక అనూహ్యమైన పరిణామం. దాన్ని సద్వినియోగం చేసుకుని, చరిత్రలో చిరస్థాయిగా నిలబడాలని ఆయన ప్రయత్నించవచ్చు. లేదా, ప్రజల మనస్సులను, ఆకాంక్షలను, అభీష్టాలను ఖాతరు చేయకుండా, తనకు తోచిన పద్ధతిలో, లేదా, లోకమంతా నడిచే పద్ధతిలో నడిస్తే,అది ఆయన ఇష్టం.




