రైతు భరోసాపై సంబరాలు ఎందుకో?

కాంగ్రెస్‌ను నిలదీసిన బీజేపీ ఎంపీ డీకే అరుణ 

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 25: స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ధైర్యం కాంగ్రెస్‌కు లేదని బీజేపీ మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ అన్నారు. రెండెకరాలు ఉన్నవారికి కూడా రైతు భరోసా ఇంకా రాలేదని, అలాంటప్పుడు రైతు భరోసా పేరుతో సంబురాలు ఎందుకు చేసుకుంటున్నారో కాంగ్రెస్‌ నేతలకే తెలియాలని ఎద్దేవా చేశారు. ఎంపీ అరుణ నల్లగొండలో బుధవారం పర్యటించారు. బీజేపీ నేతలతో పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఫోన్‌ ట్యాపింగ్‌లో బీజేపీ నాయకులందరూ బాధితులేనన్నారు. దీనిపై రేవంత్‌ ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం, ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నిస్తూ వాటిపై సీబీఐ విచారణ చేయించాలని కోరారు. జూన్‌ 25 దేశ చరిత్రలో చీకటి రోజని తెలిపారు. ఎమర్జెన్సీ పేరుతో కాంగ్రెస్‌ చేసిన అరాచకాల గురించి ప్రజలందరికీ తెలియాలన్నారు. ఆనాడు పేదలపై అరాచకాలు చేశారని.. నేడు సామాజిక న్యాయం అంటూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచిన కాంగ్రెస్‌ పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రపంచవ్యాప్తంగా లభిస్తోన్న ఖ్యాతిని చూసి రాహుల్‌ గాంధీ ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా భారత్‌ శక్తి ఏంటో పాకిస్థాన్‌కు చూపించామన్నారు. ప్రధానిని విమర్శించే సీఎం రేవంత్‌రెడ్డి ఎమర్జెన్సీ గురించి ముందుగా మాట్లాడాలని అరుణ హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *