కాంగ్రెస్ పార్టీకి ప్రత్యమ్నాయం తామేనంటోంది బిజెపి. తమకెవరూ ప్రత్యమ్నాయం కాదంటోంది కాంగ్రెస్. అందుకు తాజా మున్సిపల్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమంటున్నారు పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్. గతంలో బిఆర్‌ఎస్ కూడా ఇలానే తమకు ప్రత్యమ్నాయ పార్టీ ఏదీ లేదని చెప్పుకుంది. కానీ. 2023 అసెంబ్లీ ఎన్నికలు ఆ పార్టీ అభిప్రాయాన్ని తలకిందులు చేసింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా బిఆర్‌ఎస్‌ను స్థానిక ప్రజలు నెత్తినపెట్టుకున్నారు. పదేళ్ళపాటు నిలదొక్కుకునేలా ప్రజలంతా మద్దతు పలికారు. కానీ, క్రమేణ ఆ పార్టీ ప్రజలకు దూరమవుతూ వొచ్చింది. ఉద్యమకారులకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇవ్వలేదన్న ఆరోపణలను తీవ్రంగా ఎదుర్కుంది. ఈ ప్రాంతాన్ని ఎవరైతే ఇంతకాలం దోచుకున్నారన్నారో వారికే కాంట్రాక్టులు అప్పగించిందన్న అపవాద మోసింది. ఉద్యమకాలంలో చేదోడుగా నిలిచిన ఒక్కో నాయకుడిని కోల్పోతూ వొచ్చింది. రాజకీయ ఎత్తుగడలతో కాంగ్రెస్‌తో సహా ఇతర పార్టీలను ఎదుగకుండా చేయగలిగాననుకుంది. కాని, రేవంత్‌రెడ్డి రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. పాలనలో చేసిన అవినీతి, అక్రమాలపై కాంగ్రెస్ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి దాడిని తట్టుకోలేని పరిస్థితి ఏర్పడిందనడానికి గత రెండేళ్ళ కాలంగా జరుగుతున్న ఎన్నికల ఫలితాలే ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నాయి.
బిఆర్‌ఎస్ రెండేళ్ళుగా కోర్టులు, కేసులతో సతమతమవుతున్నది. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీని ఆత్మరక్షణలో పడేశాయి. దాంతో ఆశించిన ఫలితాలను ఆ పార్టీ పొందలేకపోతున్నది. ఒక్కో ఎన్నికలో గతంలో కన్నా తక్కువ విజయాలనే పొందుతూ వొస్తున్నది. ఇదిలా ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ఆ పార్టీపై చేస్తున్న దాడిని సమర్థవంతంగా ఎదుర్కుని జవాబు చెప్పాల్సిన కెసిఆర్ తనకేమీ పట్టనట్లు ఫాం హౌజ్‌కే పరిమితం కావడం కూడా పార్టీ శ్రేణులను తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తున్నది. ఫలితంగా రేవంత్‌రెడ్డి ఆరోపణల్లో వాస్తవం లేకపోలేదన్న భావన ఆ పార్టీని, కెసిఆర్‌ను అభిమానించే వారిలో ఏర్పడడంకూడా నెగిటివ్ ఫలితాలు రావడానికి కారణంగా మారుతున్నదన్న అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. రేవంత్‌రెడ్డి తన ముఖ్యమంత్రి స్థాయిని మరిచి బిఆర్‌ఎస్‌పైన, ఆ పార్టీలోని ప్రధాన నాయకత్వం పైన విమర్శలు చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్న సమాజం, అదే రీతిలో కెటిఆర్ రియాక్ట్ కావడాన్ని కూడా తప్పుపడుతున్నారు. ఇద్దరు కూడా హూందాగా వ్యవహరించినప్పుడే రాజకీయ నాయకులపట్ల గౌరవాభిమానాలు పెరుగుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఇక్కడ మూడు పార్టీల మధ్య ఒక విధంగా యుద్దం జరుగుతున్నదనే చెప్పాలె. ఈ మూడు పార్టీలు కూడా ఎదుటి పార్టీని శత్రువుగానే పరిగణిస్తున్నాయి. ఎప్పుడు ఎన్నికలు వొచ్చినా తామే అధికారంలోకి వొస్తున్నామని చెప్పుకున్నాయి. ఈ మూడు పార్టీలు కూడా మిగతా రెండు పార్టీలు జతకట్టాయంటూ నిన్న మొన్నటివరకు ఆరోపించుకున్నాయి. కాని తాజా మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం పదవులకోసం ఒకదానికొకటి మద్దతిచ్చుకోవడం విచిత్ర పరిణామం. బద్ద శత్రువులుగా ఇంతకాలం మాటల దాడిచేసుకున్న కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపిలు కలిసి అధికార పదవులు పంచుకున్నాయి. ఉదాహరణకు కామారెడ్డిలో కాంగ్రెస్ చైర్మన్ ఎన్నిక కావడానికి బిఆర్‌ఎస్ మద్దతిచ్చింది. అలాగే అమనగల్లులో బిజెపితోపాటు బిఆర్‌ఎస్‌కు చెందిన ఒక కార్పోరేటర్ మద్దతు లభించింది. అలియాబాద్‌లో బద్ద శత్రువులైన కాంగ్రెస్, బిజెపి ఒకటైనారు. మెట్‌పల్లిలో బిజెపి, స్వతంత్రులు కలిసి కాంగ్రెస్‌కు మద్దతిచ్చారు. అలాగే బెల్లంపల్లి లో కూడా. ఇస్నాపూర్‌లో బిఆర్‌ఎస్‌కు బిజెపి మద్దతిచ్చింది. రాయకల్, ఆసిఫాబాద్‌లో బిఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ మద్దతు లభించింది.
ఏదిఏమైనా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరుగులేని మెజార్టీని సాధించుకుంది. బిఆర్‌ఎస్ వోట్ల రీత్యా రెండవ స్థానంలో ఉన్నప్పటికీ చాలా చోట్ల కనీసం ఖాతా తెరువని పరిస్థితి. కోస్గి, మక్తల్, ధర్మపురి, భైంసాలాంటి మున్సిపాలిటీల్లో కనీసం ఒక స్థానాన్నికూడా సాధించుకోలేకపోయింది. అలాగే ఎల్లారెడ్డి, యాదగిరిగుట్ట, వడ్డెపల్లి, సుల్తానాబాద్, పెద్దపల్లి, నందికొండ, మంథిన, మధిర, కొడంగల్, హాలియా, చొప్పదండి, భూత్పూర్, ఆత్మకూర్‌ల్లో కేవలం ఒక్కస్థానానికే పరిమితమైంది. పదేళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ బిఆర్‌ఎస్ ఇప్పుడు కాంగ్రెస్‌ను అనుకున్న స్థాయిలో ఢీ కొనలేకపోయిందనడానికి తాజా ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ సాధించుకున్న వోటింగ్ పర్సంటేజ్‌తో చూస్తే, తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ పర్సంటేజ్ బాగా తగ్గింది. అందుకు ఈ రెండేళ్ళకాలంలో కాంగ్రెస్ విమర్శలను ధీటుగా తిప్పికొట్టి, ప్రజలను ఆకట్టుకోలేకపోవడమే కారణంగా భావిస్తున్నారు. తెలంగాణ అంటే బిఆర్‌ఎస్, బిఆర్‌ఎస్ అంటేనే తెలంగాణగా భావించిన ప్రజలు ఆ పార్టీని ఎందుకు ఆదరించడంలేదన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే బిజెపి మాత్రం ఎంతోకొంత పుంజుకుంది. గతంతో పోలిస్తే ఆ పార్టీ వోట్ల శాతంతో పాటు, స్థానాలు కూడా పెరిగాయి. బిజెపికి పెరిగిన వోటు శాతం, బిఆర్‌ఎస్‌నుండి తగ్గిన వోటు శాతమే నంటున్నారు రాజకీయ పరిశీలకులు. కెసిఆర్ తిరిగి రావాలంటూ వొస్తున్న నినాదాలకు తగినట్లుగా ఇప్పటికైనా కెసిఆర్ ప్రజలమద్యలోకి వొస్తే ఆ పార్టీ తిరిగి పూర్వ స్థాయికి చేరుకుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.





