14న తెల్ల రేషన్ కార్డుల పంపిణీ

– ముఖ్యమంత్రి చేతుల మీదుగా శ్రీకారం
– అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు
– సన్న బియ్యంతో రాష్ట్ర జనాభాలో 84% మందికి లబ్ది
– చట్టబద్దంగా బీసీల‌కు 42% రిజర్వేషన్లు
– ముఖ్యమంత్రి సభ విజ‌య‌వంతం చేయాలి
– పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి  పిలుపు

సూర్యాపేట, ప్రజాతంత్ర, జులై 11 : రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయనున్నామని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కొత్త రేష‌న్ కార్డుల ప్ర‌క్రియ నిరంత‌రంగా కొన‌సాగుతుంద‌న్నారు. ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో  ఈనెల‌ 14న సీఎం చేతుల మీదుగా నూతన రేషన్‌ కార్డుల పంపిణీని ప్రారంభించ‌నున్నారు. ఈ నేపథ్యంలో  ముఖ్య‌మంత్రి బ‌హిరంగ సభ ఏర్పాట్ల‌పై  కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, ఎంపి కిరణ్‌కుమార్‌ రెడ్డి, నల్లగొండ జిల్లా ఇంఛార్జ్‌ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్ తో కలిసి మంత్రి స‌మీక్ష‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్త‌మ్‌ మాట్లాడుతూ గత వందేళ్ల‌లో భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని బిసి కులగణన 1.04 లక్షల ఎన్యుమరేటర్ల ద్వారా సేకరించి విజయవంతం చేసింద‌ని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం కులగనణ చేసి, బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం అమలు కోసం చట్టం తెచ్చామన్నారు  జూలై 10న నిర్వహించిన క్యాబినెట్‌ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల‌కు 42శాతం రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాల‌ని  నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అలాగే ప్రజల కోరిక మేరకు ఎస్సీ వర్గీకరణ చేశామని, బిసి కులగణన, ఎస్సి వర్గీకరణ అనే రెండు క్యాబినెట్‌ సబ్‌ కమిటీలకు చైర్మన్‌ గా తానే వ్యవహరించానని తెలిపారు. ఈనెల 14న 5 లక్షల కొత్త రేష‌న్ కార్డులు ఇవ్వబోతున్నామని, అదనంగా కుటుంబ సభ్యులను రేషన్‌ కార్డులో చేర్చుతున్నామని తెలిపారు. రూ.13వేల కోట్లతో  3.10 కోట్ల మందికి ఆరు కేజీల సన్న బియ్యం ఉచితంగా ఇచ్చి 95 లక్షల కుటుంబాలకి చెందిన పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టి ఆకలి తీర్చడం, అర్హులందరికీ రేషన్‌ కార్డులు ఇవ్వడం అనేవి నాకు చాలా సంతోషం, సంతృప్తిని ఇచ్చాయని, ఇలాంటి పేదవారికి ఆహార భద్రత  కల్పించే సంక్షేమ పథకాలు స్వతంత్ర భారతదేశంలోనే లేవని తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గం బిఎన్‌ రెడ్డి లాంటి గొప్ప వీరులు జన్మించిన గడ్డ అని, తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి, నీరు కోసం పోరాడిన వీరులెందరో పోరాడారని, మీ ఎమ్మెల్యే సామేలు రోడ్లు, ప్రాజెక్టుల కోసం నిరంతరం కృషి చేస్తున్నాడని, గతంలో ఎన్నడూ లేని విధంగా కనీవినీ రీతిలో తుంగతుర్తిని అభివృద్ధి చేసేందుకు త‌న‌ వంతు సహాయం తప్పకుండా ఉంటుందని తెలిపారు.
బ‌హిరంగ స‌భ‌కు వేలాదిగా త‌ర‌లిరండి
14న తుంగతుర్తి గడ్డ నుంచి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు చేతులు మీదుగా రేషన్‌ కార్డుల పంపిణీ చేసి బహిరంగ సభకు వేలాదిగా ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇంఛార్జ్‌ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ మాట్లాడుతూ గత పాలకులు పేదల సంక్షేమం కోసం ఏ పథకం చేయలేదని, పేదల‌కు నూతన రేషన్‌ కార్డులు ఇవ్వలేదన్నారు. కానీ ప్రజా ప్రభుత్వం వొచ్చినప్పటి నుంచి  పేదల సంక్షేమం కోసం కృషి చేస్తోంద‌ని తెలిపారు. ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతూ బీసీల‌కు 42 శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో ఎంపి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌ నాయక్‌, రాష్ట్ర వ్యవసాయ కమిషన్‌ మెంబర్‌ చెవిటి వెంకన్న యాదవ్‌, ఎస్పీ నరసింహ, అదనపు ఎస్పీ రాంబాబు, డీఆర్‌డీఏ వీవీ అప్పారావు, డిఎఫ్‌ఓ సతీష్‌ కుమార్‌, డిఎస్‌ఓ మోహన్‌ బాబు, ఆర్డిఓ వేణు మాధవరావు, తహశీల్దార్‌ హరిప్రసాద్‌, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *