– ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి
– ఎన్డీయే 12 ఏళ్ల కాలంలో రాష్ట్రానికి రూ.12 లక్షల కోట్ల సాయం
– ప్రతి పనికీ కేంద్ర రుణాలపైనే ఆధారం
– వాస్తవాలను ప్రజల ముందుంచాలి
– సీఎంకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తిస్థాయి శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. లేఖలోని సారాంశం ఇలా ఉంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో 6 ప్రధాన గ్యారంటీలతోపాటు 420 హామీలను ప్రజలకు ఇచ్చింది. ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన మీరు హామీలను అమలు చేయమంటే రాష్ట్ర ఖజానాలో లంకెబిందెలకు బదులు ఖాళీ మట్టి కుండలు ఉన్నాయంటూ వ్యంగ్యంగా మాట్లాడుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరే ఇటీవల ఒక సభలో సోనియా గాంధీ-రాహుల్ గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి అవసరమైతే రూ.1,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మీరు మాట్లాడిన తీరు చూస్తుంటే రాష్ట్ర ఖజానా నిల్ – కాంగ్రెస్ నాయకుల జేబులు ఫుల్ అన్న విషయం అర్థమవుతోంది. నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2014నుంచి నేటివరకు రాష్ట్ర అభివృద్ధికి అనేక రకాలుగా సహాయసహకారాలు అందిస్తూ వస్తోంది. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు, మరెన్నో మూలధన పెట్టుబడులు మొదలైనవాటి రూపంలో పన్నెండేళ్ల కాలంలో దాదాపు రూ.12 లక్షల కోట్లను రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కేటాయించింది. అందులో రూ.2.5 లక్షల కోట్ల పన్నుల వాటా నిధులు, రూ.1.85 లక్షల కోట్ల విలువైన రహదారుల నిర్మాణం, రూ.36వేల కోట్లకు పైగా రైల్వే బడ్జెట్ కేటాయింపులు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మరో రూ.50వేల కోట్ల విలువైన రైల్వే పనులు, దాదాపు రూ.40 వేల కోట్ల ఉపాధి హామీ నిధులు, రూ.50 వేల కోట్ల ఉచిత రేషన్ బియ్యం పంపిణీ, గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు వివిధ ఆర్థిక సంఘాల సిఫారసుల ద్వారా అందిస్తున్న రూ.40వేల కోట్లకు పైగా నిధులు, రూ.12వేల కోట్లకుపైగా విలువైన విద్యుత్ ప్రాజెక్టులు, రూ.14వేల కోట్లకుపైగా పీఎం కిసాన్ నిధులు, ఎరువుల సబ్సిడీ కోసం రూ.80వేల కోట్లకు పైగా నిధులు, విద్య, క్రీడలకు రూ.21వేల కోట్లకు పైగా నిధులు, దాదాపు రూ.9వేల కోట్ల ఆరోగ్య సంరక్షణ నిధులు మొదలైనవి ఉన్నాయి. కేంద్రం రూ.2 లక్షల కోట్ల కనీస మద్దతు ధరను చెల్లించి రైతుల నుంచి వరిని, మరో రూ.60వేల కోట్ల కనీస మద్దతు ధరను చెల్లించి పత్తిని సేకరించింది. కేంద్రం రాష్ట్ర అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులను ఇవ్వడమే కాÅ£ వివిధ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థల ద్వారా దాదాపు రూ.10 లక్షల కోట్ల రుణాలను కూడా అందించింది. వీటికి అదనంగా రాష్ట్రాలలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన మూలధన పెట్టుబడి నిధుల కోసం రాష్ట్రాలకు యాభయ్యేళ్ల కాలపరిమితితో కూడిన వడ్డీ రహిత రుణాలను అందించి ఆయా రాష్ట్రాల అభివృద్ధికి అదనపు సహకారాన్ని అందించాలనే ప్రధానమంత్రి మోదీ సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ కేపిటల్ ఇన్వెస్ట్ మెంట్(సాస్కీ) పేరిట ఒక నూతన పథకాన్ని 2020-21లో ప్రారంభించింది. కేంద్రం రాష్ట్రాలకు అందించిన ఈ సౌలభ్యాన్ని సానుకూలంగా అందిపుచ్చుకున్న రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఉంది. ఈ పథకం కింద 2020-21 నుంచి 2025-26 వరకు రాష్ట్రానికి రూ.10వేల కోట్లకు పైగా వడ్డీ రహిత రుణాలను అందించింది. ఈ రుణాలతో రాష్ట్రవ్యాప్తంగా మూలధన పెట్టుబడితో కూడిన కొన్ని వందల ప్రాజెక్టులు అమలుకు నోచుకున్నాయి.
రుణాలు లేకుండా ఒక్క పనీ చేయలేని పరిస్థితి
నాలాలు, రోడ్ల విస్తరణ, రైల్వే లైన్ల విస్తరణ, బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్ల నిర్మాణం, హాస్పిటల్స్, మెడికల్ అండ్ నర్సింగ్ కాలేజీలు, సంక్షేమ, మైనారిటీ పాఠశాలలు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, హాస్టళ్ల నిర్మాణం, పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య రేడియల్ రోడ్ల నిర్మాణం, గోదావరి-మూసీ నది అనుసంధానం, మూసీ సుందరీకరణ, స్మార్ట్ సిటీ మిషన్‌లో రాష్ట్ర వాటా నిధులు, వరదల వల్ల పాడైన నిర్మాణాల పునరుద్ధరణ, పీఎం గ్రామ సడక్ యోజనలో రాష్ట్ర వాటా నిధులు వంటి అనేక ప్రాజెక్టులకు సాస్కి నిధులు ఖర్చు చేశారు. ఎంఎంటీఎస్ ఫేజ్-2 కోసం రూ.200 కోట్లు, మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ కోసం రూ.114 కోట్లు, స్మార్ట్ సిటీస్ పథకం కోసం రూ.315 కోట్లు, గ్రామ సడక్ యోజన కోసం రూ.674 కోట్లు, ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య రేడియల్ రోడ్ల నిర్మాణానికి రూ.200 కోట్లు, సిద్ధిపేట బైపాస్ రోడ్డు కోసం రూ.110 కోట్లు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలల కోసం రూ. 388 కోట్లు, పలు హాస్టళ్ల నిర్మాణానికి రూ.300 కోట్లు వంటి ప్రాజెక్టులున్నాయి. అన్ని రాష్ట్రాల్లాగే తెలంగాణ కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలకు కూడా కేంద్ర అందిస్తున్న వడ్డీ రహిత రుణాల మీద ఆధారపడటం చూస్తుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలాంటి దుస్థితిలో ఉందో తెలుస్తోంది. గతంలోని రుణాలకు వడ్డీలు చెల్లించడానికి రుణాలు, ఉద్యోగుల జీతాలకి రుణాలు, రైతు భరోసా నిధులకు రుణాలు, సంక్షేమ పథకాలకు రుణాలు ఇలా చెప్పుకుంటూ పోతే రుణాలు లేకుండా రాష్ట్రం ఒక్క పని కూడా చేయలేని పరిస్థితి. 2014లో మిగులు నిధులతో ఏర్పడిన రాష్ట్రానికి పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో, గత 27 నెలల కాంగ్రెస్ పాలనలో పట్టిన దుస్థితికి నేటి ఆర్థిక పరిస్థితి అద్ధం పడుతోంది. పెరుగుతున్న రాష్ట్ర తలసరి అప్పు కూడా ఆర్థిక దుస్థితిని తెలియజేస్తోంది. కావున ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలకు ముందు ఆర్థిక పరిస్థితిపై పూర్తిస్థాయి శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ప్రజల తరపున మిమ్మల్ని కోరుతున్నాను.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





