సిక్స్ ‌ప్యాక్‌ ‌ఫైల్‌ ఎక్కడ పోయింది?

– సీఎం సంతకానికే దిక్కలేకపోతే ఎలా
– హామీలను తుంగలో తొక్కింది నిజం కాదా
– గవర్నర్‌ ‌ప్రసంగంలోనే తప్పులు దొర్లితే ఎలా
– ఐటి సెక్రటరీ ఎవరో వారిని తొలగించండి
– దిల్లీకి వెళ్లి నిధులు ఇచ్చి వస్తున్నారు
– 420 వరల్డ్ ‌కప్‌ ‌పెడితే కాంగ్రెస్‌ ‌ఫస్ట్ ‌వస్తుంది
– ధన్యవాద తీర్మానంపై ఎందుకు ధన్యవాదాలు తెలపాలి
– తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్‌ ‌ప్రసంగంపై కెటిఆర్‌ ‌విసుర్లు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 17: శాసనసభలో గవర్నర్‌ ‌ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో మాటల యుద్దం నడిచింది. అసెంబ్లీలో గవర్నర్‌ ‌ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్‌ ‌మాట్లాడుతుండగా పలు సందర్భాల్లో మంత్రులు ఆయన ప్రసంగానికి అడ్డుపడ్డారు. ఈ క్రమంలో నేనే రాజు.. నేనే మంత్రి అని మిడిసిపడ్డ వారు సంపద మూటగట్టుకు పోలేరని అన్నారు. ఎన్నికల హామీ దస్త్రంపై సీఎం సంతకం చేశారని 2023 నాటి గవర్నర్‌ ‌ప్రసంగంలో ఉంది. ఏళ్లు గడిచినా సీఎం సంకల్పం, చిత్తశుద్ధి ఏమైంది? తొలి క్యాబినెట్‌లోనే ఆరు హామీలకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు. బహిరంగ వేదికపై సీఎం సంతకం చేసిన దస్త్రం ఏమైందన్నారు. సీఎం ఫైల్‌కే దిక్కు లేకపోతే కాంగ్రెస్‌ ‌మాటలు ఎవరు నమ్ముతారని, మాయమైన దస్త్రం కోసం సిట్‌ ఏర్పాటు చేయాలని కేటీఆర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. ప్రభుత్వానికి ఎవరు ధన్యవాదాలు చెప్పాలి.. ఎందుకు చెప్పాలని ప్రశ్నించారు. రైతులు, వితంతువులు, వృద్ధులు, నిరుద్యోగులు ఎవరు ధన్యవాదాలు చెప్పాలని నిలదీశారు. గ్యారంటీ కార్డులను భద్రపరచుకోవాలని చెప్పి మోసం చేయలేదా అని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు ఎక్కడ దాచిపెట్టాలో చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ ‌నేతలు దిల్లీ వెళ్లి నిధులు తెస్తారనుకుంటే నిధులు ఇచ్చి వస్తున్నారని కేటీఆర్‌ ‌విమర్శించారు. ఉషస్సులు వస్తున్నాయ్‌.. ‌పోతున్నాయ్‌.. ‌ప్రజల జీవితాల్లో వెలుగులేవని కేటీఆర్‌ ‌అన్నారు. ప్రభుత్వం డిజాస్టర్‌ ‌పాలన సాగిస్తోందని మండిపడ్డారు. ఎగ్గొట్టు, కూలగొట్టు, చెడగొట్టు.. ఇదీ కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ పాలన అని ఎద్దేవా చేశారు. ఎగనామాలు.. పంగనామాలు.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యమని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీల కోసం కోటి 25 లక్షల మంది చేసుకున్న ప్రజాపాలన దరఖాస్తులు ఏమయ్యాయని ప్రశ్నించారు. గ్యారంటీ కార్డులు బాకీ కార్డులుగా మారి వెక్కిరిస్తున్నాయన్నారు. ఇండియా క్రికెట్‌లో టీ20 వరల్డ్ ‌కప్‌ ‌గెలిచింది.. అదే 420 వరల్డ్ ‌కప్‌ ‌పెడితే కాంగ్రెస్‌ ‌ఫస్ట్ ‌వస్తుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చారాణా పని చేసి.. బారాణ చేసినట్లుగా చెప్పుకుంటుందని అన్నారు. నేనే రాజు.. నేనే మంత్రి అని మిడిసిపడితే మ‌ట్టికొట్టుకుని పోతారని వ్యాఖ్యానించారు. మూసీలో ముంచుతున్న ఇండ్లకు జీరో వాల్యూ కాదు.. రేవంత్‌ ‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చేసిన తొలి సంతకానికి జీరో వాల్యూ అని తెలిపారు. కాంగ్రెస్‌ ‌గ్యారంటీ కార్డులకు, డిక్లరేషన్లకు ప్రజల్లో జీరో వాల్యూ అని అన్నారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడితే కర్ణుడిని అని చెప్పుకంటున్నాడని.. ఆయన ఎన్నికల ముందు దానకర్ణ.. ఇప్పుడు కుంభకర్ణ అని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. డిక్లరేషన్ల కోసం ఢిల్లీ నుంచి విమానాలు వేసుకుని వచ్చారని.. కానీ వాటిని అమలు మాత్రం చేయడం లేదని అన్నారు. ఇక తెలంగాణ ప్రజల సొమ్మును పక్క రాష్టాల్ల్రో కాంగ్రెస్‌ ‌ప్రచారం కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. పాలకులు ప్రజలకు ఇచ్చిన మాటను నెలబెట్టుకోవాలని కేటీఆర్‌ ‌తెలిపారు.

గవర్నర్‌ ‌ప్రసంగానికి విలువ ఉండాల

పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగం, అసెంబ్లీలో గవర్నర్‌ ‌ప్రసంగానికి విలువ ఉండాలని అన్నారు. గవర్నర్‌ ‌ప్రసంగానికి ప్రాధాన్యత ఉంటుందని వ్యాఖ్యానించారు. కానీ గవర్నర్‌ ‌ప్రసంగానికి విలువ లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండున్నరేండ్లలో రెండున్నర లక్షలు అందుకున్న కుటుంబాన్ని చూపించాలని డిమాండ్‌ ‌చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హాలను ఎందుకు అమలు చేయడం లేదని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్ని కేటీఆర్‌ ‌ప్రశ్నించారు. మహిళలకు ఇస్తామన్న రూ.2500 హామీ ఏమైందని అడిగారు. నిరుద్యోగులకు జాబ్‌ ‌క్యాలెండర్‌ అన్నారు.. ఏమైందని నిలదీశారు. గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని మండిపడ్డారు. గ్యారంటీలు, హామీల అమలు విషయంలో ఎందుకింత నిర్లక్ష్యమని కేటీఆర్‌ ‌ప్రశ్నించారు. కేసీఆర్‌ ‌పదేండ్ల పాలనలో రేషన్‌ ‌కార్డులు ఇవ్వలేదా అని కేటీఆర్‌ ‌ప్రశ్నించారు. రేషన్‌ ‌కార్డులు ఇవ్వలేదని నిండు సభలో ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి చెప్పలేదా అని అడిగారు. పదే పదే అబద్దాలు వల్లె వేస్తే లాభం ఎవరికి అని నిలదీశారు. 2023లో ఐటీ ఉద్యోగుల సంఖ్య 9.46లక్షలు. తాజాగా గవర్నర్‌ ‌ప్రసంగంలో ఆ సంఖ్య 9.39లక్షలుగా పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వచ్చాక 7వేల ఉద్యోగాలు తగ్గాయనేది వాస్తవమా? కాదా? ఉద్యోగాలు ఎందుకు తగ్గాయి?  బీఆర్‌ఎస్‌ ‌హయాంలో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తక్కువగా వచ్చినా రాష్ట్రాన్ని దీటుగా నిలబెట్టాం. మనది కేంద్రంపై ఆధారపడే రాష్ట్రం కాదని కేటీఆర్‌ అన్నారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సవాల్‌ ‌విసిరారు. మహిళా సంఘాలకు రూ.57 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్లు అసెంబ్లీలో భట్టి చేసిన వ్యాఖ్యలపై ఈ జీవో చూపించండి. ఇక్కడే రాజీనామా చేసి నేను వెళ్లిపోతాను అంటూ సవాల్‌ ‌విసిరారు. అసెంబ్లీని తప్పుదోవ పట్టించవద్దంటూ డిప్యూటీ సీఎంకు సూచించారు.

ఉద్యోగుల సంక్షేమం, పీఆర్సీ అమలు ఏదీ

ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, పీఆర్సీ అమలు , పెండింగ్‌ ‌డీఏల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న జాప్యాన్ని కేటీఆర్‌ ఎండగట్టారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పీఆర్సీ వేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం, నేటికీ ఆ దిశగా అడుగులు వేయకపోవడం ఉద్యోగ వర్గాలను వంచించడమేనని విమర్శించారు. పీఆర్సీ గడువు ముగిసి 27 నెలలు కావస్తున్నా ఇంకా పత్తా లేదని, అలాగే 5 డీఏలు బాకీ ఉండటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. కేవలం సర్వీసులో ఉన్న ఉద్యోగులే కాకుండా రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి రాష్ట్రంలో అత్యంత దయనీయంగా మారిందని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పదవీ విరమణ తర్వాత రావాల్సిన ప్రయోజనాలు సకాలంలో అందక, ఆర్థిక ఇబ్బందులతో ఇప్పటివరకు సుమారు 80 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారని సభ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించి పలు ఉదాహరణలను ప్రస్తావిస్తూ క్యాన్సర్‌ ‌వంటి ప్రాణాంతక వ్యాధులకు వైద్యం చేయించుకోవడానికి కూడా డబ్బులు లేక, తమకు రావాల్సిన సొంత సొమ్ము కోసం ఎదురుచూస్తూ ప్రాణాలు వదిలిన ఘటనలు కలచివేస్తున్నాయన్నారు. రూ.60 లక్షల వరకు బెనిఫిట్స్ ‌రావాల్సిన ఇన్స్పెక్టర్లు, హెడ్‌ ‌మాస్టర్లు అప్పుల ఒత్తిడితో గుండెపోటుకు గురై మరణించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని ఆయన విమర్శించారు. మరోవైపు నిరుద్యోగుల విషయంలోనూ ప్రభుత్వం మాట తప్పిందని మండిపడ్డారు. గత ఏడాది జూన్‌ 2‌న ప్రారంభిస్తామన్న రాజీవ్‌ ‌యువ వికాసం పథకం ఇంతవరకు కార్యరూపం దాల్చలేదని ఎద్దేవా చేశారు. తన పార్టీ అధిష్టానానికి వెయ్యి కోట్లు ఇచ్చే సత్తా ఉందని చెప్పుకునే ముఖ్యమంత్రి రాష్ట్రం కోసం కష్టపడి పనిచేసిన ఉద్యోగులకు , భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను ఎందుకు చెల్లించడం లేదని కేటీఆర్‌ నిలదీశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగుల పెండింగ్‌ ‌డీఏలను విడుదల చేయాలని, పీఆర్సీ పక్రియను వేగవంతం చేయాలని డిమాండ్‌ ‌చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *