– అభివృద్ధిలో అందరినీ కలుపుకునిపోతాం
– మా ఎమ్మెల్యేలు లేరని పనులను ఆపం
– ప్రజలను ఇబ్బంది పెట్టడం మా అభిమతం కాదు
– భట్టి నాటి ‘పీపుల్స్ మార్చ్’ హామీల అమలు షురూ
– ఆదిలాబాద్ జిల్లాలో రూ.614 కోట్ల పనులji
– ఎయిర్ పోర్టు తెస్తున్నాం
– పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం
– పిప్రి ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ సభలో సీఎం రేవంత్
ఆదిలాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: జల్ జంగల్ నినాదంతో పోరాట స్ఫూర్తిని చాటిన కొమురం భీమ్ గడ్డ ఇది.. అభివృద్ధికి నోచుకోని ఆదిలాబాద్‌ను పాలమూరు జిల్లాతో సమానంగా అభివృద్ధి చేయాలని ప్రేంసాగర్ రావు అనేవారు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ఎన్నికల ముందు భట్టి విక్రమార్క నిర్వహించిన పీపుల్స్ మార్చ్‌కు మూడేళ్లు నిండిన సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం పిప్రిలో సోమవారం జరిగిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. పీసీసీ అధ్యక్షుడిగా నిర్మల్‌లో నిరసన తెలిపినా, ఇంద్రవెల్లిలో దండోరా పెట్టినా, భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నిర్వహించినా ప్రజా సమస్యలు పరిష్కారం కోసమే అని తెలిపారు. ధైర్యం భయంగా మారి.. భయం పోరాటంగా మారి ఉక్కు సంకల్పంతో ఆనాడు పోరాటం కొనసాగించాం ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చామన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు.. అభివృద్ధి విషయంలో అందరినీ కలుపుకుని ముందుకు వెళతాం.. అందుకే పార్టీలకతీతంగా ఈ సభలకు ఆహ్వానించామన్నారు. గత పదేళ్లలో తెలంగాణలో ఇలాంటి సంప్రదాయం ఎప్పుడైనా చూశారా అంటూ ఈ సంప్రదాయాన్ని ఇలాగే కొనసాగించాలి.. అభివృద్ధికి కలిసి వచ్చిన మిత్రులకు అభినందనలు తెలియజేస్తున్నా అన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేకపోయినా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరు చేశామని, కాంగ్రెస్‌కు ఓటు వేస్తేనే అభివృద్ధి చేస్తామని మేం ఎప్పుడూ అనలేదు.. మేం పార్టీలు చూడలేదు.. ప్రజల కష్టాలు చూసి సంక్షేమ అమలు చేస్తున్నామని చెప్పారు. ఏనాడైనా గత ప్రభుత్వం ఇలాంటి ఆలోచనలు చేసిందా,సన్న బియ్యంతో పేదల కడుపు నింపాలని ఎప్పుడైనా ఆలోచన చేశారా అని నిలదీశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సన్న బియ్యం అందిస్తున్నామని, ఆడబిడ్డలను ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశామని, సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో ఆడబిడ్డలను ప్రోత్సహిస్తున్నామని, మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్తత్తుల మార్కెటింగ్‌కు హైటెక్ సిటీలో షాపులను కేటాయించామని వివరించారు. ఈ వేదికగా మాట ఇస్తున్నా.. పెండింగ్‌లోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడమే కాదు.. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తామి హామీ ఇచ్చారు. ఆదిలాబాద్‌కు సాగు నీరు ఇచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత తమది అన్నారు. ఎర్ర బస్సు తిరగడమే కష్టమైన ఈ ప్రాంతంలో కేంద్రంతో మాట్లాడి ఎయిర్‌పోర్టు మంజూరు చేయించామని, త్వరలోనేల్ణ వీలైతే జూన్ 2 నాటికి ఎయిర్‌పోర్టు నిర్మాణానికి శిలాఫలకం వేసే బాధ్యత తీసుకుంటామని చెప్పారు.
పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం 
ఆదిలాబాద్ ప్రాంతాన్ని పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, ఇందుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతోందని తెలిపారు. ఆదిలాబాద్‌లో యూనివర్సిటీకి సంబంధించి భూసేకరణ చేపట్టామని, త్వరలోనే ఆదిలాబాద్‌లో యూనివర్సిటీ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తామరని, బాసర జ్ఞాన సరస్వతీ ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు మంజూరు చేశామని, ఆలయ అభివృద్ధికి అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేస్తామని వెల్లడించారు. ప్రేంసాగర్ రావు అభ్యర్థన మేరకు గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని, ఆదిలాబాద్ జిల్లాకు ఏమేం కావాలో అంచనాలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ప్రతీ రెండు నెలలకోసారి ఈ జిల్లాకు వస్తూనే ఉంటా.. నిధులు తెస్తూనే ఉంటాం అన్నారు. మేం పాలకులం కాదు… ప్రజల సేవకులం అన్నారు. అంతకుముందు పిప్రికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖలకు ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ముందు తన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇచ్చిన హామీల అమలుకు సంబంధించిన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. నాడు భట్టి పాదయాత్రలో ఇండ్లు లేవని, ఆర్థిక భరోసా లేదని ఎందరో తమ బాధలు చెప్పుకున్నారు. వారందరికీ నేడు ఇండ్లు, రాజీవ్ యువ వికాసం ద్వారా ఆర్థిక భరోసాకు ప్రభుత్వం బాటలు వేసింది.
శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
విక్రమార్క నాడు ఇచ్చిన హామీలకు సంబంధించి రూ.614 కోట్ల వ్యయం కాగల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, మంత్రులు. ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. జైనథ్ గ్రామంలో రూ.20 కోట్లతో నిర్మించిన మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాల బాలుర భవనం, ఆదిలాబాద్ మున్సిపాలిటీలో రూ.20 కోట్లతో మైనారిటీ గురుకుల బాలికల విద్యాలయానికి ప్రారంభోత్సవం చేశారు. సిరికొండ నుంచి దస్నాపూర్, పిట్ట బంగారం మీదుగా ఇంద్రవెల్లి వరకు 13.46 కోట్లతో నిర్మించిన లాంగ్ స్వాన్ బ్రిడ్జిని ప్రారంభించారు. రూ.141.07 కోట్ల వ్యయం కాగల బోథ్ నియోజకవర్గంలోని బజార్ హత్నూర్ బోథ్, నేరడిగొండ, మండలాల్లోని పిప్పిరి ఎత్తిపోతల, తేజపూర్ ఎత్తిపోతల, బుగ్గారం ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన చేశారు. రూ.6.435 కోట్ల అంచనాలతో అదిలాబాద్ రూరల్ మండలం లాండసాంగి చెక్‌డ్యాం పనులకT శంకుస్థాపన, ఖానాపూర్ నియోజకవర్గం ఇంద్రవెల్లి, సిరికొండ మండలాల్లోని ముత్తూర్ చిన్న ఎత్తిపోతల పథకం, చిక్మస్ వాగు ప్రాజెక్టు ఎడమ కాలువ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.200 కోట్ల అంచనాలతో బోథ్ నియోజకవర్గం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులకు, బోథ్ మండలం పొచ్చరలో రూ.42.15 కోట్లతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.20.40 కోట్లతో ఐటీడీఏ ఉట్నూరు పరిధిలో నాగోబా ఆలయ సుందరీకరణ పనులకు, రూ.15 కోట్లతో ఉట్నూరు మండలం లక్కారంలో ఐటీడీఏ నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇచ్చోడ నుంచి డెడ్రా గ్రామం వరకు రూ.30 కోట్లతో నిర్మించనున్న రోడ్డు పనులకు, రూ.30 కోట్ల అంచనాలతో అదిలాబాద్ పురపాలక సంఘంలో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులకు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు శంకుస్థాపన చేశారు. రూ.9.45 కోట్లతో ఉత్తర విద్యుత్ కంపెనీ సంస్థ ఆపరేషన్ సర్కిల్ అదిలాబాద్ పరిధిలో బోథ్ నియోజకవర్గంలోని తలమడుగు బోథ్, నేరేడుగొండ మండలాల్లోని 33/11 కెవి విద్యుత్ ఉప కేంద్రం, కుచలాపూర్‌లో 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రం, ధనుర్-బి 33/11 కేవీ విద్యుత్ కేంద్రం, కుట్టి ఉప కేంద్రాలకు, బజార్ హత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో పిప్పిరి లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శంకుస్థాపనలు చేశారు. నిర్మల్ నియోజకవర్గంలో రూ.200 కోట్ల అంచనాలతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ పనులకు, రూ.205 కోట్ల అంచనాలతో బాసర ఆలయ అభివృద్ధికి పనులకు శంకుస్థాపనలు చేశారు. రూ.11.76 కోట్లతో ఆసిఫాబాద్ జిల్లా కెరిమిరి మండలంలో కేసులగూడ గ్రామంలో అమ్మనమడుగు ప్రాజెక్టుకు మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరు చేసిన పత్రాలను పంపిణీ చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరి మండలం గోయగాం గ్రామానికి చెందిన మచ్చర్ల రేఖ, ఆదే హిరాణి, చునకర్ రాధా, కడ్తాల రామయ్య, శంకర్, ఆనందరావు, ఇప్పా కిష్టాబాయ్, రెబ్బెన మండలం ఇందిరానగర్ గ్రామ పంచాయతీకి చెందిన గుండేటి భాగ్యలక్ష్మి, గోట్ల రజిత, అఖిల సప్తక్క, ఆత్రం సరోజ, షేక్ మహిముద, జైపూర్ మండలం టేకుమట్లలోని గోనె పద్మ, కోల శారద, ఉరుగొండ పద్మ, మాటూరి లలితతోపాటు మరో పదిమందికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి పత్రాలను సీఎం, డిప్యూటీ సీఎం అందజేశారు. పాత మంచిర్యాల పట్టణంలో జ్యూస్ షాప్ నిర్వహిస్తున్న రాజేందర్‌కు రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా మంజూరు చేసిన ప్రొసీడింగ్‌ను అందించారు. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి మంజూరు చేసిన ప్రొసీడింగ్‌ను అందించిచారు. ఉమ్మడి జిల్లాలోని 30,149 స్వయం సహాయక సంఘాలకు 2025-26సంవత్సరానికి వడ్డీ లేని రుణాలు రూ.53.50 కోట్ల చెక్కును పంపిణీ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం, పారదర్శకమైన పౌర సేవలు, విద్యా, వైద్యం, ఆరోగ్యం వంటి వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన ఐదు గ్రామ పంచాయతీలు పిప్రి, ముఖ్రా కే, నార్నూర్, ముత్నూరులకు భారతీయ నాణ్యత ప్రమాణాల సంస్థ ఐఎస్వో సర్టిఫికెట్‌కు అర్హత సాధించిన నేపథ్యంలో సర్పంచ్‌లకు సర్టిఫికెట్లను అందజేశారు. అలాగే కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మంజూరు పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ అందజేశారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం సిర్గాపూర్‌లో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





